Ratan Tata: రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలంటూ అప్పట్లో నెట్టింట ట్రెండింగ్.. ఆయన ఏమన్నారంటే..?
ఏ అవార్డులు, బిరుదులు నాకొద్దు.. దేశానికి సేవ చేయడమే నాకు ముద్దు. ఇది టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా మాట. తనకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలంటూ అప్పట్లో సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం ఆపాలని కోరుతూ రతన్ టాటా అవార్డుల కంటే దేశసేవ తనకు ముఖ్యమని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు.
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (Ratan Tata) (86) కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో దేశం కన్నీరు పెడుతోంది. అంతటి మానవతావాది ఇక లేరు అన్న విషయాన్ని ప్రజలు జీర్ణించుకోలకేపోతున్నారు.
అయితే రతన్ టాటాకు దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో 2021లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఆ ప్రచారాన్ని ఆపాలంటూ టాటా నెటిజన్లను కోరారు. అవార్డుల కంటే దేశానికి సేవ చేసే అవకాశం రావడమే తాను అదృష్టంగా భావిస్తానని అన్నారు. పారిశ్రామిక, సేవా రంగాల్లో ఆయన చేసిన సేవలకు గానూ టాటాకు భారత రత్న పురస్కారం ఇవ్వాలని.. అందుకోసం తమ #BharatRatnaForRatanTata ప్రచారంలో చేరాలని డాక్టర్ వివేక్ భింద్రా అనే ఓ మోటివేషనల్ స్పీకర్ 2021లో పిలుపునిచ్చారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ హ్యాష్‌ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అయ్యింది. రతన్‌టాటా భారత రత్నకు అర్హులంటూ ఆయన అభిమానులు, నెటిజన్లు వేల సంఖ్యలో ట్వీట్లు చేశారు. ఈ ప్రచారంపై రతన్ టాటా ‘‘నాకు అవార్డు ఇవ్వాలంటూ సోషల్‌మీడియాలో కొందరు వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలను నేను అభినందిస్తున్నా. అయితే ఇలాంటి ప్రచారాలను వెంటనే నిలిపివేయాలని వారిని సవినయంగా కోరుతున్నా. వీటన్నంటికంటే నేను భారతీయుడిని అవడం.. దేశ వృద్ధి, శ్రేయస్సు కోసం నావంతు సహకారం అందించే అవకాశం రావడమే అదృష్టంగా భావిస్తాను’’ అని ట్వీట్ చేశారు.
While I appreciate the sentiments expressed by a section of the social media in terms of an award, I would humbly like to request that such campaigns be discontinued.
Instead, I consider myself fortunate to be an Indian and to try and contribute to India’s growth and prosperity pic.twitter.com/CzEimjJPp5
— Ratan N. Tata (@RNTata2000) February 6, 2021
పారిశ్రామికవేత్త, దాతగా కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న రతన్ టాటా.. దేశంలో కరోనా విజృంభించిన సమయంలో రూ. 1500కోట్ల విరాళాలు ప్రకటించి తన పెద్దమనసు చాటుకున్నారు. ఆయన సేవలకుగానూ కేంద్రం 2000 సంవత్సరంలో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్ పురస్కరాలతో సత్కరించింది. కాగా తాజాగా ఆయన భారతరత్నకు అర్హుడు అంటూ ప్రస్తుతం నెట్టింట నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..