Dera Baba: డేరాబాబా మళ్లీ విడుదల.. హర్యానా ఎన్నికల్లో ఆయన ప్రభావం ఎవరికి లాభం?

హర్యానా... మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం, మొఘలుల పాలనకు నాంది, ముగింపు పలికిన పానిపట్టు యుద్ధాలు జరిగిన నేల. పురాణేతిహాసాలు, చరిత్ర పేజీల్లోనే కాదు, వర్తమానంలో కుస్తీ పట్టుతో మట్టికరిపించే మల్లయోధులను దేశానికి అందిస్తున్న ప్రాంతం. ఇప్పుడు అక్కడ ఎన్నికల యుద్ధం జరుగుతోంది.

Dera Baba: డేరాబాబా మళ్లీ విడుదల.. హర్యానా ఎన్నికల్లో ఆయన ప్రభావం ఎవరికి లాభం?
Dera Chief Ram Rahim Singh
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 02, 2024 | 11:51 AM

హర్యానా… మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం, మొఘలుల పాలనకు నాంది, ముగింపు పలికిన పానిపట్టు యుద్ధాలు జరిగిన నేల. పురాణేతిహాసాలు, చరిత్ర పేజీల్లోనే కాదు, వర్తమానంలో కుస్తీ పట్టుతో మట్టికరిపించే మల్లయోధులను దేశానికి అందిస్తున్న ప్రాంతం. ఇప్పుడు అక్కడ ఎన్నికల యుద్ధం జరుగుతోంది. జాతీయ పార్టీలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (BJP), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), బహుజన్ సమాజ్ పార్టీ (BSP)తో పాటు ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (INLD), జన్‌నాయక్ జనతా పార్టీ (JJP), ఆజాద్ సమాజ్ పార్టీ (ASP) వంటి ప్రాంతీయ పార్టీలు తలపడుతున్న ఈ సమరంలో రాజకీయ పార్టీలతో పాటు వివాదాస్పద ‘డేరా సచ్ఛా సౌదా’ అధినేత గుర్మీత్ రామ్ రహీం సింగ్ వంటి మతగురువుల ప్రభావం కూడా ఈ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. గత రెండేళ్ల వ్యవధిలో 10 పర్యాయాలు ‘పెరోల్‌’పై బయటికొచ్చిన డేరా బాబా సరిగ్గా ఇప్పుడు పోలింగ్‌కు మూడ్రోజుల ముందు పెరోల్‌పై విడుదల కావడం చర్చనీయాంశంగా మారింది. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఎలాగైనా సరే మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని చూస్తుంటే.. హిమాచల్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల తరహాలో హామీల వర్షం కురిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి గెలుపు తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ రెండు ప్రధాన పార్టీలకు ధీటుగా.. ఢిల్లీ, పంజాబ్‌లో ఇప్పటికే పాగా వేసిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP).. ఆ రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్న హర్యానాలోనూ జెండా పాతాలని ప్రయత్నిస్తోంది. ఇతర పార్టీలు సైతం వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలిచి, ఫలితాల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ దక్కనిపక్షంలో ప్రభుత్వ ఏర్పాటులో ‘కింగ్ మేకర్’ అవతారం ఎత్తాలని ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇలా మొత్తంగా హర్యానాలో రాజకీయ సమరం ఆసక్తికరంగా మారింది.

జాట్, నాన్-జాట్‌గా చీలిన రాష్ట్రం

భాష ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్రం పంజాబీలు చేసిన పోరాటం ఫలితంగా 1966లో నాటి అవిభాజ్య పంజాబ్ రాష్ట్రం నుంచి హిమాచల్ ప్రదేశ్, హర్యానా ఏర్పడ్డాయి. ఆనాటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ‘జాట్’ సామాజికవర్గం ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. తొలినాళ్లలో దేవీలాల్, ఆ తర్వాత చౌతాలా, హుడా కుటుంబాలు రాష్ట్ర రాజకీయాలను శాసించాయి. రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో వ్యవసాయ భూములు కల్గిన ‘జాట్’ సామాజిక వర్గం ప్రజలు సంఖ్యాబలం ప్రకారం చూస్తే ఓబీసీ (OBCల కంటే తక్కువే. అయినప్పటికీ రాజకీయాలు, క్రీడలు, వ్యాపారాలు సహా అనేక ఇతర రంగాల్లో వారి పట్టు గణనీయంగా ఉంది. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ జాటేతర నేత మనోహర్ లాల్ ఖట్టర్‌ను ముఖ్యమంత్రిగా చేసే వరకు ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే జాట్ వర్గం నేతలే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చరిత్ర ఉంది. ఈసారి జాట్లు బీజేపీ పట్ల తీవ్రమైన వ్యతిరేకతను ప్రదర్శిస్తూ కాంగ్రెస్‌ వెంట నడుస్తున్నారు. ఒలింపిక్స్ వంటి క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిథ్యం వహించిన వినేశ్ ఫోగట్ వంటి క్రీడాకారులు సైతం ఆ పార్టీలో చేరి క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జాట్ వర్గం ఓట్లతో పాటు దళితుల ఓట్లను లెక్కేసుకుంటూ తమ గెలుపు సునాయాసం అన్న భావనలో కాంగ్రెస్ వర్గాలున్నాయి. అయితే ఓబీసీ, దళిత వర్గాల్లో ఏదో ఒక వర్గం మద్ధతు లేకుండా కేవలం జాట్ల ఓట్లతోనే గట్టెక్కే పరిస్థితి లేదు.

దశాబ్దాలుగా రాజకీయాల్లో జాట్ల ఆధిపత్యంతో అవకాశాలు దక్కించుకోలేకపోయిన అనేక ఓబీసీ కులాల ఓటర్లు బీజేపీ కారణంగా గత పదేళ్లలో ప్రభావవంతమైన శక్తిగా ఎదిగారు. జాటేతర వర్గాల మద్దతుతోనే బీజేపీ గత రెండు పర్యాయాలు గెలుపొందింది అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సారి జాటేతర వర్గం ఓటర్లు ఒకేవైపు నిలుస్తారా లేక వివిధ పార్టీల మధ్య చీలిపోతారా అన్నదే ఈ రాష్ట్రంలో బీజేపీ భవిష్యత్తును నిర్ణయించనుంది. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్న అగ్నిపథ్ స్కీమ్, ఉద్యోగుల పాత పెన్షన్ విధానం, నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాలు, వృద్ధాప్య పెన్షన్లు, మహిళలకు ప్రతి నెలా ఆర్థిక సహాయం, శాంతిభద్రతల సమస్య వంటివి ఎన్నికల్లో ప్రభావం చూపే అంశాలుగా మారాయి.

ఆ పార్టీలు వ్యతిరేక ఓటును చీల్చేనా?

జాట్ వర్గం నేతల చేతుల్లో ఉన్న ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (INLD), జన్‌నాయక్ జనతా పార్టీ (JJP)లు.. జాట్-దళిత కాంబినేషన్‌తో చెరొక దళిత-బహుజన పార్టీలతో జతకట్టాయి. ఐఎన్ఎల్డీ-బీఎస్పీ జతకట్టగా, జేజేపీ-ఏఎస్పీ కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సైతం ‘జాట్-దళిత-మైనారిటీ’ కాంబినేషన్‌తో అధికారం చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో ప్రాంతీయ పార్టీలు ఏర్పాటు చేసుకున్న రెండు వేర్వేరు కూటములు జాట్-దళిత ఓట్ల తీసుకొచ్చే చీలిక కాంగ్రెస్ పార్టీకే నష్టం కల్గిస్తుంది. వీటికి తోడు గత ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సైతం విపక్ష కూటమి (I.N.D.I.A) నుంచి దూరం జరిగి ఒంటరిగానే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంతో కొంత చీలే అవకాశం కనిపిస్తోంది.

ఒకవేళ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఉంటే మాత్రం ఓటర్లు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే బలమైన పార్టీకే ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఆ లెక్కన కాంగ్రెస్ పార్టీయే బలమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. పైగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా సహా అనేక మంది హర్యానా ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. హామీల వర్షం కురిపిస్తూ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నింటినీ గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు.

ఓబీసీ ఓట్లపై కమలదళం గురి

జాట్లు, జాటేతర వర్గాలుగా చీలిపోయిన స్థితిలో ఉన్న రాష్ట్రంలో అధిక సంఖ్యాకులుగా ఉన్న ఓబీసీ ఓట్లే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ మధ్యనే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీకి ఆనుకుని ఉన్న దక్షిణ హర్యానాలోని గురుగ్రాం, ఫరీదాబాద్, భివానీ-మహంద్రగఢ్ లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపొందింది. ఈ మూడు స్థానాల పరిధిలో 27 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు ప్రాధాన్యతలు మారిపోతుంటాయి. ఈ పరిస్థితుల్లో దక్షిణ హర్యానాలో పట్టు నిలబెట్టుకోవడంతో పాటు గత ఎన్నికల్లో పేలవమైన ప్రదర్శన కనబర్చిన ఇతర ప్రాంతాలపై బీజేపీ దృష్టి పెట్టింది. అన్ని ప్రాంతాల్లోనూ గణనీయమైన సంఖ్యలో ఉన్న ఓబీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే గత ఏడాది మనోహర్ లాల్ ఖట్టర్‌ను తప్పించి ఓబీసీ వర్గాల్లో ఆదరణ ఉన్న నేత నయాబ్ సింగ్ సైనీకి ముఖ్యమంత్రి పీఠం అప్పగించింది.

మరోవైపు అత్యాచారం, హత్య వంటి కేసుల్లో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా ప్రభావం ఇప్పటికీ ఆ రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలపై ఉంది. లోక్‌సభ ఎన్నికల సమయంలో డేరా బాబాను పెరోల్ మీద విడుదల చేయడం ద్వారా ఆయన అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నిం చేసిన బీజేపీ, అసెంబ్లీ ఎన్నికలకు మూడు రోజుల ముందు విడుదల చేయడం ద్వారా ఈ ఎన్నికల్లోనూ లబ్ది పొందాలని చూస్తోంది. అందుకే డేరా బాబాకు పెరోల్ ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాసింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆధిపత్యాన్ని సవాల్ చేసిన కాంగ్రెస్, ఈ ఎన్నికల్లో గెలిచి మరో రాష్ట్రాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందన్నది అక్టోబర్ 8న తేలిపోనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
మొదటిసారి కెమెరా ముందు అంజనా దేవి.! పవన్ ని చూస్తే బాధేసింది అంటూ
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
డైరెక్టరే నా చెంపపై కొట్టాడు.. కానీ ఆ న్యూస్‌తో అంతా రివర్స్.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఆ స్టార్ హీరో సినిమాను అలా చేసి.. నా గొయ్యిని నేనే తవ్వుకున్నా.!
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
ఒక్క సంతకంతో జగన్‌కు చెక్‌ పెట్టిన పవన్.! వీడియో అదిరింది.
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
గోల్డెన్ ఫిష్ పట్టినట్టే.! దేవరకి అనిరుద్ రెమ్యునరేషన్ ఎంత.?
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
పెద్ద ప్లానింగే ఇది.! యశ్ టాక్సిక్‌ సినిమాలో హాలీవుడ్ యాక్టర్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
అమ్మో.. లక్ష్మక్క చితక్కొట్టిందిగా.! అదిరిపోయిన రొమాంటిక్ సాంగ్.
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
టీజర్ అప్ డేట్ వచ్చిందహో..| కొండా సురేఖ కామెంట్స్ పై నాగ్ సీరియస్
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో
కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ నటుల ఆగ్రహజ్వాలలు.! వీడియో