Delhi vs Centre: ఢిల్లీపై పెత్తనం కేంద్రానిదే.. కొత్త చట్టంతో రాజుకుంటున్న రాజకీయ రగడ
అసెంబ్లీ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతంగా దేశ రాజధాని ఢిల్లీ కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా అక్కడి పరిపాలనా పరమైన నిర్ణయాలకు పూర్తి అధికారాలను...
Delhi vs Centre new political fight: అసెంబ్లీ కలిగిన కేంద్ర పాలిత ప్రాంతంగా దేశ రాజధాని ఢిల్లీ (NATIONAL CAPITAL DELHI) కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా అక్కడి పరిపాలనా పరమైన నిర్ణయాలకు పూర్తి అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్ (LG)కు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం (UNION GOVERNMENT) తీసుకువచ్చిన నూతన చట్టం తాజాగా ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి మరోసారి పొలిటికల్ ఫైట్ (POLITICAL FIGHT)పరిస్థితి తీసుకువచ్చింది. న్యూఢిల్లీ (NEWDELHI)కి సంబంధించిన అన్ని కీలకమైన నిర్ణయాలను ఆమోదించే అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్‌కు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాన్ని ఏప్రిల్ 28వ తేదీన నోటిఫై చేసింది. దాంతో ఇకపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం (DELHI GOVERNMENT) ప్రతి అంశంపై లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి పొందాల్సి ఉంటుంది. జి.ఎన్.సి.టి.డి. 2021 (GNCTD ACT 2021)గా పిలిచే కొత్త చట్టాన్ని ఇటీవల పార్లమెంటు ఆమోదించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAM ADMI PARTY) సహా కొన్ని విపక్షాలు.. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని అభివర్ణిస్తూ వ్యతిరేకించాయి. అయితే లోక్ సభ (LOKSABHA)లో ఎన్డీఏ ప్రభుత్వానికి (NDA GOVERNMENT) ఉన్న సంఖ్యాబలం కారణంగా ఈ బిల్లు ఆమోదం పొందింది. ఆ తర్వాత రాజ్యసభ (RAJYASABHA) ఆమోదం కూడా లభించడంతో ఈ కొత్త చట్టం ఏప్రిల్ 27 అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను ఏప్రిల్ 28వ తేదీన కేంద్ర హోంశాఖ (UNION HOME MINISTRY) విడుదల చేసింది.
దేశ రాజధానిలో పబ్లిక్ ఆర్డర్, పోలీస్, భూ సంబంధిత విషయాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండగా.. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, అడవులు, రవాణా తదితర అంశాలు ఢిల్లీ ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. అయితే అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇచ్చినట్టుగానే ఢిల్లీకి కూడా కేంద్ర ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమిస్తుంది. తాజాగా తీసుకువచ్చిన చట్టం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక అంశాలపై తీసుకునే నిర్ణయాలను కూడా లెఫ్టినెంట్ జనరల్ ఆమోదించాల్సి ఉంటుంది. అంటే పరోక్షంగా రాష్ట్ర పరిధిలోని అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా ఓకే చేయాల్సి వస్తుందన్నమాట. ఇకపై ఢిల్లీ ప్రభుత్వం అంటే అక్కడి ముఖ్యమంత్రి అని కాకుండా లెఫ్టినెంట్ గవర్నర్ అని భావించాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నామమాత్రంగా మారిపోయినట్లు అయింది. తాజా ఆదేశాలతో ఇకనుంచి లెఫ్టినెంట్ గవర్నర్ దాదాపు 80కి పైగా ప్రభుత్వ శాఖలను నియంత్రించడంతో పాటు అసెంబ్లీ ఆమోదించిన బిల్లును సైతం నిలిపివేయడం లేదా ఆమోదించడం చేయగలుగుతారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అవినీతి నిరోధం, వైద్యం, విద్య, సోషల్ వెల్ఫేర్, టూరిజం, ఎక్సైజ్, ట్రాన్స్పోర్ట్ లాంటి అంశాలతో పాటు స్థానిక అధికారుల బదిలీలు కూడా ఢిల్లీ ప్రభుత్వం.. లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదంతో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లెఫ్టినెంట్ గవర్నర్ కావాలి అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర స్థాయి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసే అవకాశం కొత్త చట్టం ద్వారా లభించింది.
ఇతర రాష్ట్రాల్లో గవర్నర్ల పాలన, పాత్ర నామమాత్రంగా కొనసాగుతుంటే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ దాదాపు సూపర్ పవర్‌గా మారే అవకాశం ఈ కొత్త చట్టం ద్వారా లభించింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ పదవిలో ఎవరు ఉన్న వారితో ఘర్షణ వైఖరిని అవలంభిస్తున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తమ పరిపాలన నియంత్రించే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూ వున్నారు కేజ్రీవాల్. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేరుగా ఈ కొత్త చట్టం తీసుకురావడం ద్వారా ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని నామమాత్రంగా మార్చినట్లు అయింది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పక్షాలు కొత్త చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వాన్ని నామమాత్రం చేసే కుట్రలో భాగంగానే ఈ కొత్త చట్టాన్ని తీసుకు వచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు కాంగ్రెస్ తదితర రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ కొత్త చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. అయితే ఒకసారి చట్టంగా మారిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏమాత్రం జోక్యం చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ALSO READ: అగ్రరాజ్యానికి అదే టెన్షన్ .. 2 దశాబ్ధాలైనా అదే కలవరం