Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ దూకుడు.. వారందరి ఆస్తులు జప్తు..

|

Jan 25, 2023 | 8:32 PM

సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు కొనసాగుతోంది. ఇందులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సమీర్‌ మహేంద్ర, అమిత్‌ అరోరా, విజయ్‌ నాయర్, దినేశ్‌ అరోరా, అరుణ్‌ పిళ్లైకి చెందిన..

Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ దూకుడు.. వారందరి ఆస్తులు జప్తు..
Enforcement Directorate
Follow us on

సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు కొనసాగుతోంది. ఇందులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సమీర్‌ మహేంద్ర, అమిత్‌ అరోరా, విజయ్‌ నాయర్, దినేశ్‌ అరోరా, అరుణ్‌ పిళ్లైకి చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసింది. వీటి విలువ 76.54 కోట్ల రూపాయలు. ఇందులో స్థిరచరాస్తులతో పాటు బ్యాంకు ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, వాహనాలు ఉన్నాయి.

ఢిల్లీలోని జోర్‌బాగ్‌లో మద్యం వ్యాపారి సమీర్‌ మహేంద్ర, గీతిక మహేంద్రుకు ఉన్న 35 కోట్ల రూపాయల విలువ చేసే నివాస భవనాలు, అలాగే గురుగ్రామ్‌లో అమిత్‌ అరోరాకు చెందిన 7.68 కోట్ల రూపాయల విలువ చేసే నివాస ప్రాంగణం, విజయ్‌ నాయర్‌కు చెందిన ముంబయిలోని 1.77 కోట్ల రూపాయల విలువ చేసే నివాస భవనంతో పాటు దినేశ్‌ అరోరాకు చెందిన 3.18 కోట్ల రూపాయలు విలువ చేసే రెస్టారెంట్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జప్తు చేసింది. హైదరాబాద్‌ శివారు వట్టి నాగులపల్లిలో అరుణ్‌ పిళ్లైకి చెందిన 2.25 కోట్ల రూపాయల విలువైన భూమి కూడా ఈ జప్తు జాబితాలో ఉంది. వీటితో ఇండో స్పిరిట్‌ గ్రూప్‌ కి చెందిన 10.23 కోట్ల రూపాయలు విలువ చేసే 50 వాహనాలు, 14.39 కోట్ల రూపాయల విలువ చేసే బ్యాంక్‌ బ్యాలెన్స్‌, ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయి.

జప్తు చేసిన ఆస్తుల వివరాలతో పాటు ఈ కుంభకోణానికి సంబంధించి వివరాలతో ఒక నోట్‌ను ఈడీ విడుదల చేసింది. 2021-22లో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రభుత్వ ఖజానాకు 2,873 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఈడీ పేర్కొంది. ఇందులో 76.54 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను గుర్తించి జప్తు చేయడం జరిగిందని తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి హైదరాబాద్‌, ఢిల్లీ, చెన్నై, ముంబయి సహ ప్రదేశాల్లో ఈడీ ఇప్పటి వరకు సోదాలు నిర్వహించింది. ఈ కేసులో ఇప్పటి వరకు విజయ్‌ నాయర్‌, సమీర్‌ మహేంద్రు, అమిత్‌ అరోరా, శరత్‌ రెడ్డి, బినోయ్‌ బాబు, అభిషేక్‌ బోయినపల్లిని ఈడీ అరెస్టు చేసింది. వీళ్లంతా ప్రస్తుతం జూడిషియల్‌ కస్టడీలో ఉన్నారు.

అటు ఈ వ్యవహారంలో ఈడీ ఇప్పటికే రెండో ఛార్జ్‌షీట్‌ కూడా దాఖలు చేసింది. ఈ ఛార్జ్‌షీట్‌లో ఏడు కంపెనీల పేర్లున్నాయి. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా పేరు కూడా ఈ వ్యవహారంలో నానుతోంది. మరో వైపు ఈ కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ కోర్టులో వాదనలు ముగిసాయి. దీనిపై కోర్టు ఫిబ్రవరి 9న తీర్పు వెలువరించనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..