Raksha Bandhan: కూతురుతో రాఖీ కట్టించడానికి హైటెక్ ప్లాన్.. నెల రోజుల బాలుడు కిడ్నాప్!
రాఖీ కట్టేందుకు తనకు సోదరులు లేరని కుమార్తె మారం చేయసాగింది. అంతే కుమార్తె కోరిక తీర్చేందుకు ఆ తల్లీదండ్రులు ఏ మాత్రం ఆలోచించకుండా నెల వయసున బిడ్డను చోరీ చేశారు. పోలీసులు రంగంలోకి దిగడంతో కథ సుఖాంతమైంది. ఈ విచిత్ర ఘటన దేశ..
న్యూఢిల్లీ, ఆగస్టు 27: రాఖీ కట్టేందుకు తనకు సోదరులు లేరని కుమార్తె మారం చేయసాగింది. అంతే కుమార్తె కోరిక తీర్చేందుకు ఆ తల్లీదండ్రులు ఏ మాత్రం ఆలోచించకుండా నెల వయసున్న బిడ్డను చోరీ చేశారు. ఇంతలో పోలీసులు రంగంలోకి దిగడంతో కథ సుఖాంతమైంది. ఈ విచిత్ర ఘటన దేశ రాజధాని ఢిలీలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..
దేశ రాజధాని ఢిల్లీలోని ఛట్టా రైల్ చౌక్ వద్ద ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వికలాంగ మహిళ పక్కలో ఉన్న పసికందును గురువారం తెల్లవారుజామున 4.34 గంటలకు కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. తమ బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణలో భాగంగా సమీపంలోని సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేశారు. సుమారు 400 సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేయగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి బిడ్డను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. బైక్ నెంబర్ సంజయ్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు. దాదాపు 15 మందితో కూడిన పోలీస్ టీం వారు ఠాగూర్ గార్డెన్‌లోని రఘుబీర్ నగర్‌లోని సి-బ్లాక్‌ను ముట్టడించి లోపలికెళ్లి తనిఖీ చేయగా నిందితుల వద్ద చోరీకి గురైన బిడ్డను కనుగొన్నారు. అక్కడ నిందితులైన దంపతులు మరియు కిడ్నాప్‌కు గురైన బిడ్డను కనుగొన్నారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) సాగర్ సింగ్ కల్సి తెలిపారు. నిందితులను సంజయ్‌గుప్తా (41), అనితాగుప్తా (36)లుగా గుర్తించారు. సంజయ్‌గుప్తా దంపతులను శనివారం అరెస్ట్ చేశారు.
ఠాగూర్ గార్డెన్‌లోని రఘుబీర్‌నగర్‌కు చెందిన నిందిత దంపతుల కుమారుడు (17) గతేడాది ఆగస్టు 17న డాబా పైనుంచి కిందపడి మృతి చెందాడు. వారికి 15 ఏళ్ల కుమార్తె ఉంది. రాబోయే రక్షా బంధన్‌కు రాఖీ కట్టేందుకు తనకు తమ్ముడు కావాలని కోరిందని, అందుకే ఛట్టా రైల్ చౌక్ సమీపంలో తల్లి పక్కన నిద్రిస్తున్న బాలుడిని కిడ్నాప్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడించారు. వృత్తిరీత్యా టాటూ ఆర్టిస్ట్ అయిన సంజయ్ గతంలో మూడు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు తేలింది. ఇక అతని భార్య అనితా గుప్తా మెహందీ ఆర్టిస్ట్ అని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.