Delhi: విశ్వాస తీర్మానం ఎదుర్కోనున్న సీఎం కేజ్రీవాల్.. మా ఎమ్మెల్యేలు ఎవరికీ అమ్ముడుబోరని ఉద్ఘాటన

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) నేడు సొంత ప్రభుత్వంపై అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు. దీనిద్వారా ఆప్‌ ఎమ్మెల్యేలు ఎవరూ అమ్ముడు పోరని నిరూపిస్తామని ప్రకటించారు. ఆప్‌ (AAP) ప్రభుత్వాన్ని కూల్చేందుకు,...

Delhi: విశ్వాస తీర్మానం ఎదుర్కోనున్న సీఎం కేజ్రీవాల్.. మా ఎమ్మెల్యేలు ఎవరికీ అమ్ముడుబోరని ఉద్ఘాటన
Arvind Kejriwal
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 29, 2022 | 12:42 PM

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) నేడు సొంత ప్రభుత్వంపై అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు. దీనిద్వారా ఆప్‌ ఎమ్మెల్యేలు ఎవరూ అమ్ముడు పోరని నిరూపిస్తామని ప్రకటించారు. ఆప్‌ (AAP) ప్రభుత్వాన్ని కూల్చేందుకు, అవినీతి పేరుతో తమ నాయకులను కొనేందుకు బీజేపీ ఆపరేషన్‌ లోటస్‌ చేపట్టిందని సీఎం కేజ్రీవాల్‌ ఆరోపించారు. అయితే ఆప్‌ ఎమ్మెల్యేలు కమలం పార్టీ ప్రలోభాలను లొంగరని నిరూపించేందుకు సోమవారం అసెంబ్లీ ముందుకు విశ్వాస తీర్మానాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ బల పరీక్ష ద్వారా ఢిల్లీలో ఆపరేషన్ లోటస్ కాస్తా ఆపరేషన్ కీచడ్ గా మారనుందని చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 ఎమ్మెల్యేలకు గాను ఆమ్‌ ఆద్మీ పార్టీకి 63 మంది సభ్యుల బలం ఉన్నది. కేజ్రీవాల్‌ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పటికీ ప్రభుత్వం సులభంగా మెజారిటీని నిరూపించుకునే అవకాశం ఉందని లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్‌ పీడీటీ ఆచార్య అన్నారు. సాధారణంగా మెజారిటీ నిరూపించుకోవాలని ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడతాయి. అయితే అధికార పార్టీలు కూడా కాన్ఫిడెన్స్‌ మోషన్‌ను సభలో ఎప్పుడైనా ప్రవేశపెట్టవచ్చని చెప్పారు.

అయితే.. సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో మద్యం పాలసీపై సమాధాం చెప్పకుండా ప్రజల దృష్టి మరల్చేందుకు ఈ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని మండిపడ్డారు. సీబీఐ దర్యాప్తు గురించి నిజాలు చెప్పకుండా ఢిల్లీ అధికార పార్టీ డ్రామాలు ఆడుతోందని దుయ్యబట్టారు. మరోవైపు.. సోమవారం ఉదయం 11గంటలకు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశం ప్రారంభంలోనే ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణంలో అవినీతి జరిగిందని బీజేపీ ఆరోపించింది. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరగాలని ఆ పార్టీ నేతలు పట్టుబట్టారు. ఈ క్రమంలో ఆప్, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి