జనవరిని విడాకుల నెల అని ఎందుకు అంటారు.. ఈ టైమ్‌లోనే ఎందుకు విడిపోతున్నారో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా జనవరి నెలలో విడాకుల దరఖాస్తులు భారీగా పెరుగుతున్నాయి. అందుకే సామాజిక నిపుణులు జనవరిని విడాకుల నెల అని పిలుస్తున్నారు. పండుగలు ముగియగానే జంటలు ఎందుకు విడిపోవాలని నిర్ణయించుకుంటున్నాయి? కొత్త ఏడాది సంకల్పాలు బంధాలను ఎందుకు బలి తీసుకుంటున్నాయి? దీని వెనుక ఉన్న షాకింగ్ కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం..

జనవరి నెల అనగానే మనకు కొత్త లక్ష్యాలు, కొత్త సంకల్పాలు గుర్తొస్తాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా సామాజిక నిపుణులు, న్యాయవాదులు జనవరిని మరో పేరుతో పిలుస్తున్నారు.. అదే విడాకుల నెల. అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ప్రతి ఏడాది జనవరిలో విడాకుల దరఖాస్తులు భారీగా పెరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. అసలు కొత్త ఏడాదిలో బంధాలు ఎందుకు తెగిపోతున్నాయి? దీని వెనుక ఉన్న కారణాలేంటి?
గణాంకాలు ఏం చెబుతున్నాయి?
పంచవ్యాప్తంగా గత కొన్ని దశాబ్దాలుగా సేకరించిన డేటా ప్రకారం.. ఇతర నెలలతో పోలిస్తే జనవరిలో విడాకుల కేసులు 30 నుంచి 35 శాతం అధికంగా నమోదవుతున్నాయి. చిత్రం ఏమిటంటే.. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ రేటు చాలా తక్కువగా ఉంటుంది.
పండుగల వెనుక దాగున్న నిశ్శబ్దం
నవంబర్, డిసెంబర్ నెలల్లో పండుగలు, కుటుంబ వేడుకలు, సెలవులు ఉంటాయి. ఇంట్లో పిల్లల కోసం లేదా సమాజం కోసం చాలా జంటలు తమ మధ్య ఉన్న గొడవలను పక్కన పెట్టి కలిసి ఉన్నట్లు నటిస్తారు. కానీ ఆ సెలవులు ముగిసి, జనవరి నెల రాగానే.. ఇక ఈ బంధాన్ని సాగదీయడం అనవసరం అనే నిర్ణయానికి వస్తున్నారు. అందుకే జనవరిని విడాకుల సీజన్‌కు నాందిగా నిపుణులు భావిస్తారు.
కొత్త ప్రారంభం కోసమేనా?
జనవరిలో విడాకులు పెరగడానికి ప్రధాన కారణం న్యూ ఇయర్, న్యూ స్టార్ట్ అనే మనస్తత్వం. పాత ఏడాదిలో అనుభవించిన మానసిక వేదన, ఒత్తిడిని వదిలేసి, కొత్త ఏడాదిలో స్వేచ్ఛగా జీవించాలని చాలా మంది కోరుకుంటారు. తమ కెరీర్, ఆరోగ్యంపై దృష్టి పెట్టినట్లే, ప్రశాంతత లేని సంబంధాల విషయంలోనూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్లలో కూడా విడాకులు ఎలా పొందాలి? అనే సెర్చ్‌లు ఈ నెలలోనే గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి.
బంధాలు విడిపోవడానికి ప్రధాన కారణాలు
కేవలం నెల మాత్రమే కారణం కాదు, ఏడాదంతా పేరుకుపోయిన సమస్యలు జనవరిలో పేలుతున్నాయి.
- జీవిత భాగస్వామిపై విశ్వాసం లేకపోవడం.
- మనసు విప్పి మాట్లాడుకోకపోవడం, నిరంతర మౌనం.
- డబ్బు విషయంలో వచ్చే తగాదాలు బంధాన్ని బలహీనపరుస్తున్నాయి.
- బంధాన్ని కాపాడుకోవాలనే తపన ఇద్దరిలోనూ లోపించడం.
కొత్త సంవత్సరం అందరికీ సంతోషాన్ని ఇవ్వాలని లేదు. కొంతమందికి ఇది పాత బాధల నుంచి విముక్తి పొందే సమయం కావచ్చు. ఏది ఏమైనా, బంధాన్ని పునర్నిర్మించుకోవడానికి ప్రయత్నించడం మొదటి మార్గం అయితే.. గౌరవప్రదంగా విడిపోవడం చివరి మార్గం అని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
