AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Yaas: యాస్ తుపాను బీభత్సకాండ.. సునామీలా విరుచుకుపడ్డ ప్రక‌ృతి ప్రళయం.. కోటిమందిపై ప్రభావం..!

చెరువు కట్టు తెగడం చూశాం...నది గట్టు తెగడం చూశాం..అదే సముద్రం గట్టు తెగితే...తుపానే సునామీలా విరుచుకుపడితే...ఇంకేమైనా ఉంటుందా..ఏముండదు..అంతా మడతెట్టి ముంచేస్తదిగా..అదే జరిగింది.

Cyclone Yaas: యాస్ తుపాను బీభత్సకాండ.. సునామీలా  విరుచుకుపడ్డ ప్రక‌ృతి ప్రళయం.. కోటిమందిపై ప్రభావం..!
Cyclone Yaas Batters Bengal And Odisha
Balaraju Goud
|

Updated on: May 27, 2021 | 7:35 AM

Share

Cyclone Yaas: చెరువు కట్టు తెగడం చూశాం…నది గట్టు తెగడం చూశాం..అదే సముద్రం గట్టు తెగితే…తుపానే సునామీలా విరుచుకుపడితే…ఇంకేమైనా ఉంటుందా..ఏముండదు..అంతా మడతెట్టి ముంచేస్తదిగా..అదే జరిగింది పశ్చిమ బెంగాల్.. ఒడిశా రాష్ట్రాల్లో.. యాస్ తుపాను.. చేసిన బీభత్సానికి కోటిమందికి పైగా నష్టపోయారు. లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి…అది తీరం దాటే టప్పుడు చేసిన బీభత్సం మాటల్లో చెప్పలేం.

యాస్ తుఫాను పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. ఈ రెండు రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో భారీ నష్టాన్ని మిగిల్చింది. అనేక ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. బుధవారం ఉదయం తర్వాత యాస్ తుఫాను పశ్చిమబెంగాల్, ఒడిశాల మధ్య తీరం దాటిన విషయం తెలిసిందే.

సరిగ్గా ఉదయం 11గంటలా 30నిమిషాలు ఒడిశా బాలాసోర్ ప్రాంతంలో యస్ తుపాన్ తీరం దాటింది. తీరం దాటే సమయంలో గాలులు సృష్టించిన బీభత్సకాండను చెబితే అర్థం కాదు చూస్తేనే..దాని విశ్వరూపం కనిపించింది. సముద్రంలో ఎగిసిపడుతున్న అలలు, హోరున వినిపించిన ఆ శబ్ధాలు… 2004 ను ఓసారి గుర్తు చేసింది. పౌర్ణమి , చంద్ర గ్రహణం ఏర్పడిన రోజే యాస్‌ తుపాను తీరానికి చేరువగా రావడంతో రాకాసి అలలు తీరాన్ని ముంచెత్తాయి. సముద్రానికి, తీరానికి సమీపంలో ఉన్న గ్రామాల మధ్య సరిహద్దులు చెరిపేశాయి.తీరం దాటేప్పుడు సముద్రం రుద్రరూపం దాల్చింది.

తుపాను వాయవ్య దిశగా కదులుతూ 3 గంటల్లో బలహీనపడనుంది. ఒడిశా, పశ్చిమ్‌ బెంగాల్‌లోని తీర ప్రాంత జిల్లాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపింది. భీకరగాలులు, భారీ వర్షాలతో ఆయా ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. ఒడిశాలోని ధర్మా పోర్టు దగ్గర తుఫాన్‌ బలహీనపడింది. మధ్యాహ్నం 12.30కి అతితీవ్ర తుఫాన్‌ నుంచి తీవ్ర తుఫాన్‌గా మారింది. తీరం దాటే ప్రక్రియ మూడున్నర గంటలపాటు సాగింది.

ఒడిశా, బెంగాల్‌పై తీవ్ర ప్రభావం చూపింది యస్‌ తుఫాన్‌.

తుపాను ధాటికి పలుచోట్ల ఇళ్లు, భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు, టవర్లు నేలకొరిగాయి. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. గంటకు 130 155 కి.మీ వేగంతో వీచిన పెనుగాలులు ఒడిశాలోని భద్రక్‌ జిల్లాను అతలాకుతలం చేశాయి. ప్రచండ గాలుల ధాటికి కొన్ని చోట్ల ఇంటి పైకప్పులు ఎగిరి పడ్డాయి. ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా చాందీపూర్‌ తీరంలో సముద్రం బాగా ముందుకొచ్చింది. ఆ ప్రాంతంలోని సుమారు 30 గ్రామాలు సముద్రపు నీటిలో చిక్కుకున్నాయి. తుపాను ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఒడిశా, బెంగాల్‌లో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇండియన్‌ ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఓడీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

రెండు వారాల్లోనే రెండు తుఫాన్లు..అటు అరెబియా గట్టు..ఇటు బంగళా గట్టు..రెండు గట్లలో తుఫాను సృష్టించిన బీభత్సానికి తూర్పు, పశ్చిమ తీరాలు..చిగురుటాకులా వణికిపోయాయి. పశ్చిమబెంగాల్, ఒడిశాలో తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. రెండురాష్ట్రాల్లో దాదాపు 20లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పశ్చిమబెంగాల్‌లో ముగ్గురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

యస్ తుఫాను ఇంత ఉధృతంగా ఉండడానికి కారణం…సంపూర్ణ చంద్రగ్రహణం పున్నమి కావడంతోనేనట.. సముద్రంలో అలల ఉధృతి తీవ్రంగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. చంద్రగ్రహణం సమయంలో.. సముద్రం మరింత అల్లకల్లోలంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే తీర ప్రాంతాల్లో తుఫాన్‌ పెను బీభత్సం సృష్టిస్తుందని హెచ్చరించారు. సాధారణంగా జాబిలి భూమికి దగ్గరగా వచ్చినప్పుడు సూపర్‌ మూన్‌గా కనిపిస్తుంది. ఆ సమయంలో సముద్రంలో ఆటుపోట్లు ఉంటాయి. అలలు గరిష్టంగా ఎత్తులో ఎగిసిపడుతుంటాయని వాతావరణ శాఖ చెబుతోంది.

Read Also… Simhachalam Substation Fire: సింహాచలం ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్‌లో అగ్నిప్రమాదం.. సకాలంలో మంటలు అదుపు చేసిన ఫైర్ సిబ్బంది