Cyclone Biparjoy Updates: బిపర్‌జాయ్ తుఫాన్ మరింత ఉగ్రరూపం దాల్చుతోంది. గుజరాత్ తీరం వైపు దూసుకొస్తూ అంతకంతకూ బలపడుతోంది. తుఫాన్ ధాటికి గుజరాత్ గజగజ వణికిపోతోంది. ఈ తుఫాన్.. గుజరాత్‌లోని జఖౌ వద్ద రేపు సాయంత్రం తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ద్వారక, కచ్ ప్రాంతాల మధ్య 150 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని తాకనున్నట్లు అంచనా వేస్తోంది. అదే జరిగితే ఆ ప్రాంతంలో విధ్వంసం ఖాయంగా కనిపిస్తుంది. బిపర్‌జాయ్ తుఫాన్ పశ్చిమ తీరంలో పెను విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దాంతో.. తీర ప్రాంతాల్లో విపత్తు బృందాలను మోహరించారు. గుజరాత్, మహారాష్ట్రలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో లక్షా 30 వేల మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాన్‌పై గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. మత్స్యకార గ్రామాలను ఖాళీ చేయించి.. సముద్రంలోకి వెళ్లకూడదని సూచించింది. తీర ప్రాంతాలకు చెందిన 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే, తుఫాన్ కారణంగా 69 రైళ్లు రద్దయ్యాయి. మరో 58రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు పశ్చిమ రైల్వే తెలిపింది.
తుఫాన్ ప్రభావంతో గుజరాత్, కేరళ, కర్నాటక, గోవా, మహారాష్ట్రల్లోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 160 నుంచి 170 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. ప్రధానంగా.. గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కఛ్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే.. తుఫాన్ తీరానికి సమీపిస్తోన్న కొద్దీ తీవ్రత పెరుగుతోంది. అయితే, తీర ప్రాంతాల్లో వారిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించామని.. సహాయక చర్యల కోసం సైన్యాన్ని కూడా రంగంలోకి దించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
బిపర్‌జాయ్ తుఫాన్‌పై అత్యవసర సమీక్ష నిర్వహించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. తుఫాన్‌పై ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేశామన్నారు అమిత్‌షా. సహాయక చర్యల కోసం NDRF , SDRF బృందాలను సిద్దం చేసినట్టు వెల్లడించారు. అటు.. గుజరాత్‌లోని తుఫాన్ పరిస్థితిని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తీరప్రాంతాల్లో పర్యటించి సహాయక సిబ్బందికి సూచనలు ఇచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..