Corona Pandemic: దేశవ్యాప్తంగా కరోనా నిబంధనలు ఎక్కడెక్కడ..ఎలా ఉన్నాయంటే..!

Corona Pandemic: దేశవ్యాప్తంగా కరోనా నిబంధనలు ఎక్కడెక్కడ..ఎలా ఉన్నాయంటే..!
Corona

కరోనా మహమ్మారి రెండోసారి తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. మొదటిసారి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించి పరిస్థితి అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం.

KVD Varma

|

Apr 17, 2021 | 9:39 PM

Corona Pandemic: కరోనా మహమ్మారి రెండోసారి తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. మొదటిసారి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించి పరిస్థితి అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈసారి మాత్రం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం.. తమ పరిధిలో పరిస్థితిని బట్టి నిబంధనలు విధిస్తూ వస్తున్నాయి. కఠిన ఆంక్షలు కొన్నిచోట్ల.. నైట్ కర్ఫ్యూ మరికొన్ని ప్రదేశాల్లో.. వీకెండ్ లాక్ డౌన్ కొన్ని నగరాల్లో అమలులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా నిబంధనలు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం..

మహారాష్ట్రలో.. ఇక్కడ కరోనా ఉదృతి చాలా ఎక్కువగా ఉంది. రోజుకు అరవైవేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో లాక్ డౌన్ విధించాకపోయినా దాదాపు అటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఏప్రిల్‌ 14 రాత్రి 8 గంటల నుంచి 15 రోజుల పాటు జనతా కర్ఫ్యూ అమలులో ఉంటుంది. రాష్ట్రమంతటా 144 సెక్షన్‌ అమలులో ఉంది. అత్యవసర, నిత్యావసర సేవలు మినహా అన్ని కార్యకలాపాలు, బహిరంగ ప్రదేశాలు, మాల్స్‌, రెస్టారెంట్లు మూత పడ్డాయి.

ఢిల్లీలో.. మహారాష్ట్ర తరువాత ఇక్కడే కేసులు ఎక్కువ నమోదు అవుతున్నాయి. దాదాపు రోజుకు ఇరవై వేల మంది కరోనా బారిన పడుతున్నారు. ఇక్కడ కూడా కఠిన ఆంక్షలు అమలులో ఉన్నాయి. వీకెండ్ కర్ఫ్యూ ఇక్కడ అమలు చేస్తున్నారు. శుక్రవారం రాత్రి పది గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ అన్ని కార్యకలాపాలు ఇక్కడ బంద్. రెస్టారంట్లకు కేవలం హోం డెలివరీకి మాత్రమే అనుమతి ఇచ్చారు. సినిమా హాళ్ళు 30 శాతం సామర్ధ్యంతోనే నడుస్తున్నాయి. వివాహాల్లో 50 మంది.. అంత్యక్రియల్లో 20 మందికి మించి పాల్గొనకూడదు.

ఉత్తరప్రదేశ్‌ లో..

ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వం ఆదివారాలు లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఆ రోజుల్లో అన్ని గ్రామీణ, పట్టణప్రాంతాల్లో పూర్తి లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. కరోనా నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. మాస్క్‌ ధరించకుండా ఒకసారి పట్టుబడితే రూ. 1000, మళ్లీ మళ్లీ నిబంధన ఉల్లంఘిస్తే రూ. 10వేల జరిమానా విధిస్తారు. మహారాష్ట్ర, కేరళ వంటి కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఆర్‌టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు తప్పనిసరి చేసింది.

మధ్యప్రదేశ్‌ లో..

మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం కరోనా కర్ఫ్యూ పేరుతో ఆంక్షలు విధించింది. కర్ఫ్యూ సమయంలో అత్యవసర, వైద్య సేవలు, నిర్మాణ కార్యకలాపాలు, నిత్యావసర దుకాణాలు మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది. మహారాష్ట్ర నుంచి వచ్చేవారికి ఆర్‌టీ-పీసీఆర్‌ నెగెటివ్‌ పత్రం తప్పనిసరి అని పేర్కొంది.

రాజస్థాన్‌ లో

రాజస్థాన్‌లోనూ ఏప్రిల్‌ 16 సాయంత్రం 6 గంటల నుంచి ఏప్రిల్‌ 19 ఉదయం 5 గంటల వరకు వీకెండ్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. నిత్యావసర, వైద్య సేవలు మినహా అన్ని కార్యకలాపాలను ఆపేశారు. వివాహాది శుభకార్యాలు, అంత్యక్రియల్లో పాల్గొనేవారి సంఖ్యను పరిమితంగా ఉండాలని చెప్పింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కరోనా నెగెటివ్‌ పత్రం తప్పనిసరి చేస్తున్నట్లు వెల్లడించింది.

తమిళనాడులో..

తమిళనాడులోనూ ఏప్రిల్‌ 10 నుంచి లాక్‌డౌన్‌ తరహా కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. పండగలు, మతపరమైన బహిరంగ సమావేశాలపై నిషేధం విధించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్‌లు, సినిమా థియేటర్లు 50శాతం సామర్థ్యంతో నడపాలని ఆదేశించారు. ప్రార్థనా మందిరాల్లోకి భక్తులకు రాత్రి 8 గంటల వరకే అనుమతినిచ్చింది.

కర్ణాటకలో..

రోజువారీ కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో కర్ణాటక కూడా ఒకటి. అక్కడ బెంగళూరు సహా ఏడు జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది. చండీగఢ్‌, కేరళ, పంజాబ్‌, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి వచ్చేవారు తప్పనిసరిగా ఆర్‌టీ-పీసీఆర్‌ నెగటివ్‌ పత్రం చూపించాలసి ఉంటుంది.

పంజాబ్‌, చండీగఢ్‌ లలో..

పంజాబ్‌లో ఏప్రిల్‌ 30 వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంది. స్కూళ్లు మూతబడ్డాయి. చండీగఢ్‌ ప్రభుత్వం శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు వారాంతపు లాక్‌డౌన్‌ విధించింది. చండీగఢ్‌కు వచ్చేవారు కొవా పంజాబ్‌ యాప్‌లో నమోదు చేసుకోవాలని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది.

కేరళ లో.. కేరళలో ఏప్రిల్‌ 30 వరకు కరోనా ఆంక్షలు విధించారు. దుకాణాలన్నీ రాత్రి 9 గంటల వరకు మూసివేస్తారు.

ఇక, తెలంగాణలో మాస్క్‌ లేకపోతే రూ. 1000 జరిమానా విధిస్తున్నారు. గుజరాత్‌, ఒడిశా, హరియాణా, జమ్మూకశ్మీర్‌ల్లోని పలు జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రమంతటా రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంది.

Also Read: AP Corona Vaccine: ఏపీకి చేరిన కరోనా వ్యాక్సిన్.. ప్రత్యేక వాహనాల్లో భారీ బందోబస్తు నడుమ జిల్లాలకు టీకాల తరలింపు

Remdesivir: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ‘రెమ్‌డెసివిర్’ ధరలు భారీగా తగ్గింపు.. వివరాలివే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu