రంగులు లేని హోళీ పండుగ.. రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం.. ఉల్లంఘిస్తే కఠినచర్యలు
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి కరాళనృత్యం చేస్తోంది. రెండో విడత మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది.
uttarakhand new guidelines: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి కరాళనృత్యం చేస్తోంది. రెండో విడత మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో హోళీ పండుగ సందర్భంగా ఆ రాష్ట్ర సర్కార్ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని నిర్ణయించింది.
హోళీకా దహన్ ఉత్సవాల్లో 60 ఏళ్ల వృద్ధులు, పదేళ్ల వయసు లోపు పిల్లలు, అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు పాల్గొనవద్దని ఆదేశించింది. ఈ మేరకు వారిని అనుమతించమని ఉత్తరాఖండ్ సర్కారు కొవిడ్ తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. అలాగే, కోవిడ్ కంటైన్మెంట్ జోన్లలో హోళీ వేడుకలను నిషేధించామని వెల్లడించింది. కరోనా హాట్ స్పాట్లలో ప్రజలు ఇళ్లలోనే వేడుకలు జరుపుకోవాలని సర్కారు సూచించింది. హోళీ సందర్భంగా రంగులు చల్లుకోరాదని సర్కారు ఆదేశించింది. హోలీ సందర్భంగా ఆహార పదార్థాలను పంచుకోరాదని కోరింది. కుంభమేళాలో పాల్గొనే ప్రజలు కొవిడ్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఉత్తరాఖండ్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది.