Indian Railways: కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్…రైల్వే సేవలు రద్దు చేస్తారా? క్లారిటీ ఇచ్చిన రైల్వే శాఖ
Indian Railways News Alert: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మునుపటిలానే రైల్వే సేవలను పూర్తిగా రద్దు చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది.
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కరోనా వైరస్ కట్టడి ప్రయత్నాల్లో భాగంగా పలు రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ, లాక్‌డౌన్ అమలుచేస్తున్నాయి. అటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించే అవకాశముందన్న ప్రచారంతో వలస కార్మికులు ఆందోళన చెందుతున్నారు. దిల్లీ, ముంబై, పూణె. అహ్మదాబాద్ తదితర ప్రముఖ నగరాల నుంచి యూపీ, బీహార్‌కు చెందిన వలస కార్మికులు తమ స్వస్థలాలకు తరలివెళ్తున్నారు. మళ్లీ లాక్‌డౌన్ అమలు చేస్తే ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, అందుకే స్వస్థలాలకు వెళ్లిపోతున్నట్లు వారు చెబుతున్నారు. రైళ్లను కూడా ఆపేస్తారన్న ప్రచారం వలస కార్మికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రైల్వే సేవలను పూర్తిగా ఆపేస్తారన్న ప్రచారంతో వలస కార్మికులు రైల్వే స్టేషన్లకు పోటెత్తుతున్నారు. ముంబై నుంచి యూపీకి వెళ్లే రైళ్లలోని సాధారణ బోగీలు వలస కార్మికులతో కిక్కిరిసిపోతున్నాయి.
రైల్వే సేవలను పూర్తిగా రద్దు చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనిపై రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా రైళ్ల రాకపోకలను నిలిపివేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని రైల్వే బోర్డు ఛైర్మన్ సునీత్ శర్మ తోసిపుచ్చారు. రైళ్లను నిలిపివేసే యోచన రైల్వే శాఖకు లేదని ఆయన స్పష్టంచేశారు. వేసవికాల ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా మరిన్ని రైళ్లను నడిపే యోచనలో ఉన్నట్లు తెలిపారు. వేసవికాలంలో రైళ్లలో ప్రయాణీకుల రద్దీ సహజమేనని పేర్కొన్నారు. రైల్వే సేవలను ఆపేస్తారని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు.
ఇవి కూడా చదవండి..బర్త్ డే వేళ నెట్టింట్లో అడ్డంగా బుక్కైపోతున్న జయాబచ్చన్, ఎంతటి దురహంకారమంటూ తీవ్రమైన ట్రోలింగ్
తక్కువ ఖర్చుతో ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకుంటున్నారా.. అయితే ఆంధ్రా కాశ్మీరం ఉందిగా..!