COVID-19: కొత్త వేరియంట్ బిఎఫ్.7పై ఆందోళన వెనుక కారణాలివే.. అజాగ్రత్తగా ఉంటే పెను ప్రమాదమే.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు
కోవిడ్ భయం మళ్లీ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా కేసులు విస్తారంగా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా భారత్‌లో కొత్త వేరియంట్ కేసులు నాలుగే వెలుగు చూసినప్పటికి.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అప్రమత్తమైంది. ఆందోళన చెందాల్సి అవసరం లేదని..
కోవిడ్ భయం మళ్లీ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా కేసులు విస్తారంగా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా భారత్‌లో కొత్త వేరియంట్ కేసులు నాలుగే వెలుగు చూసినప్పటికి.. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అప్రమత్తమైంది. ఆందోళన చెందాల్సి అవసరం లేదని చెప్పినప్పటికి.. అజాగ్రత్తగా ఉంటే మాత్రం మునుపటి పరిస్థితులు తప్పవని హెచ్చరించింది. గతంలో కరోనా డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లను కేంద్రప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొన్నప్పటికి.. బిఎఫ్.7 వేరియంట్ తీవ్రత దృష్ట్యా భారత్ సైతం తీవ్ర ఆందోళన చెందుతోంది. సాధారణంగా దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ దాదాపు పూర్తయింది. బూస్టర్ డోస్ సైతం అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్త చర్యగా కోవిడ్ టీకా వేయించుకోవడంతో పాటు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖతో మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు పాటించడం తప్పనిసరని వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ రెండో దశలో తీవ్ర ప్రాణ నష్టం జరిగిందని, ఆ అనుభవాల దృష్ట్యా.. బిఎఫ్.7 వేరియంట్ పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈక్రమంలో ఈ కొత్త వేరియంట్ లక్షణాలు తెలుసుకుందాం.
బిఎఫ్.7 వేరియంట్ ప్రధానంగా ఎగువ శ్వాసకోశ సమస్యలను సృష్టిస్తుంది. ఛాతీ పైభాగం, గొంతుపై దీని ప్రభావం అధికంగా ఉంటుంది. అలాగే జ్వరం, జలుబు వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. శ్వాసకోశ సమస్యలు తీవ్రం కావడం వల్ల ఊపిరి తీసుకోవడం కష్టంగా మారొచ్చు. ఈ క్రమంలో చనిపోయే అవకాశాలు ఉండొచ్చు.
ఎవరైనా వ్యక్తుల్లో కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. మొదట్లోనే సరైన చికిత్స తీసుకుంటే.. వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. దేశంలో సాధారణ కరోనా కేసులు 200 కంటే తక్కువుగా నమోదవుతున్నాయి. జులై – అక్టోబర్ మధ్యలో 4 బిఎఫ్.7 కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. వీటిలో మూడు కేసులు గుజరాత్‌లో, ఒక కేసు ఒడిశాలో గుర్తించారు. ఈ నలుగురు ప్రస్తుతం వైరస్ నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు వెలుగుచూసిన వేరియంట్లతో పోలిస్తే బిఎఫ్.7 ఎక్కువేమి కాదని, అయితే వ్యాప్తి రేటు ఎక్కువగా ఉండటంతో అత్యధిక మందికి ఈ వైరస్ సోకే అవకాశముందని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్‌లో ఇది ప్రవేశిస్తే.. ఇప్పటివరకు ఎదుర్కొన్న వేరియంట్ల కంటే దీని బారిన పడే వారి సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే అందరికి ఏకకాలంలో వైద్య సదుపాయాలు కల్పించడం కష్టతరం కావచ్చంటున్నారు వైద్య నిపుణులు.
బిఎఫ్.7 వేరియంట్ ప్రభావం చైనాలో అధికంగా ఉంది. గతంతో పోలిస్తే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో కొత్త వేరియంట్ భారత్‌లో వ్యాప్తి చెందితే పరిణామాలు ఎలా ఉంటాయోనని ప్రభుత్వం, వైద్యాధికారులు అందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
బిఎఫ్.7 వేరియంట్ చైనాలో మాత్రమే కాకుండా అమెరికా, ఇంగ్లాండ్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ తదితర దేశాల్లోనూ వ్యాప్తి చెందుతోంది. చైనాలో వ్యాప్తి చెందుతున్నంత వేగంగా ఇతర దేశాల్లో వ్యాప్తి చెందకపోవడం కాస్త ఉపశమనం కలిగించే అంశంగా వైద్య నిపుణులు చెబుతున్నారు. చైనాలో బిఎఫ్.7 వేరియంట్ వ్యాప్తి చెందడానికి అక్కడి ప్రజల వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండటమే కారణంగా తెలుస్తోంది. పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ అమలు కాకపోవడం ఈ వేరియంట్ వ్యాప్తికి దోహదం చేసి ఉండొచ్చని వైద్యరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న పరిస్థితుల దృష్ట్యా కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇప్పటికే అధికారులతో సమీక్షించి కోవిడ్ నియంత్రణ చర్యలపై సమీక్షించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ప్రధాని పిలుపునిచ్చారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..