India Corona: దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి.. ప్రమాద ఘంటికలు.. జాగ్రత్తలు పాటించకపోతే అంతే.. !

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లోకి ఇతర రాష్ట్రాల ప్రయాణికులను వచ్చేందుకు నిబంధనలు విధిస్తున్నారు.

India Corona:  దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి.. ప్రమాద ఘంటికలు.. జాగ్రత్తలు పాటించకపోతే అంతే.. !
Corona-Virus-India
Follow us

|

Updated on: Feb 25, 2021 | 9:48 PM

India Corona: దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లోకి ఇతర రాష్ట్రాల ప్రయాణికులను వచ్చేందుకు నిబంధనలు విధిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోనుంది. మళ్లీ లాక్​డౌన్​ విధించే అవకాశం ఉందా? అన్న చర్చ సాగుతోంది. దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ పడగ విప్పుతున్నట్టే కనిపిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య కొద్ది రోజులుగా పెరుగుతూ పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు పదకొండు నెలల క్రితం విధించిన లాక్​డౌన్​ పరిస్థితులు మళ్లీ వస్తాయేమోనన్న భయాలు వెంటాడుతున్నాయి.

సెప్టెంబర్ నెల మధ్యలో రోజుకు సగటున 90 వేలకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. తర్వాత ఆ గ్రాఫ్ తగ్గుతూ వచ్చినా.. ప్రస్తుతం మళ్లీ వాటి సంఖ్య కలవర పెడుతోంది. ప్రతిరోజు సగటున 16 వేల వరకు కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళకరంగా మారింది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, చత్తీస్​గఢ్ రాష్ట్రాల్లో సగటు కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో కరోనా కట్టడికి ఆయా ప్రభుత్వాలు ఆంక్షల వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి.

మహారాష్ట్రలోని పుణెలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తోంది. అమరావతి జిల్లాలో వారంరోజుల పాటు పూర్తి లాక్​డౌన్​ విధించింది. మార్చి 1 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. రాజకీయ, మతపరమైన ర్యాలీలతో పాటు.. ప్రజలు గుమికూడే కార్యక్రమాలపైనా నిషేధం అమలవుతోంది. కొవిడ్‌ నిబంధనలు పాటించకుంటే లాక్‌డౌన్‌ పొడగించే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరించింది.

మరోవైపు, పలు రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల నేపథ్యంలో బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తెలంగాణ నుంచి విమానాల్లో వచ్చే ప్రయాణికులకు కరోనా నెగెటివ్ రిపోర్టును తప్పనిసరి చేసింది. ఇందుకు సంబంధించి అన్ని విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ సర్కార్ సైతం ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. విమానాలు, రైళ్లు, బస్సుల్లో వచ్చేవారికి ఈ నిబంధన వర్తించనుంది. కారుల్లో వచ్చేవారికి దీని నుంచి మినహాయింపు ఉంటుంది. కరోనా నెగెటివ్​ రిపోర్టు చూపించని వారికి అక్కడే పరీక్షలు నిర్వహించి… పాజిటివ్​గా తేలితే 14 రోజుల పాటు క్వారెంటైన్​కు పంపిస్తారు.

పెళ్లి మండపాల్లో కరోనా వ్యాప్తి నివారించేందుకు కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తోంది. ప్రజలు కొవిడ్​ మార్గదర్శకాలు పాటించేలా మండపాల్లో మార్షల్స్​ను ఏర్పాటు చేసింది. కాగా కరోనా మళ్లీ ప్రమాదకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు చేతుల్ని శానిటైజ్ చేసుకోవడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేనిపక్షంలో మరోసారి ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

Also Read:

ఎదురీత ముందు.. విధిరాత ఎంత..?.. కష్టాల దిగమింగి.. కన్నీళ్లను చెరిపేసి.. మెకానిక్‌గా మహిళ జీవనపోరాటం

Dr. Noori Parveen: సలాం డాక్టరమ్మా..! పది రూపాయలకే వైద్యం.. ‌భవిష్యత్ తరాలకు ఆదర్శం

Andhrapradesh: భార్యకు ప్రేమతో.. నిలువెత్తు చెక్క విగ్రహం.. వేదమంత్రాల సాక్షిగా ఇంట్లో ప్రతిష్ట