Congress: ఢిల్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ కీలక నిర్ణయం.. ‘ఈగిల్’ గ్రూప్ ఏర్పాటు.. ఎందుకో తెలుసా?
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే ఈగిల్ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. ఈ బృందం ఎన్నికలపై నిఘా పెట్టనుంది. దీంతో పాటు గతంలో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, గత ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరిపి నివేదికను పార్టీ హైకమాండ్‌కు అందజేయనుంది.

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఈగిల్ (Empowered group of Leaders and Expeerts)గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. 8 మంది ముఖ్య నాయకులు, నిపుణులతో కూడిన ఈ గ్రూపులో అజయ్ మాకెన్, దిగ్విజయ్ సింగ్, అభిషేక్ సింఘ్వీ, పవన్ ఖేడాతో సహా పలువురు ముఖ్య నేతలను కాంగ్రెస్ చేర్చుకుంది. పార్టీకి చెందిన ఈగల్ బృందం మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై పోస్ట్‌మార్టమ్ చేసి సవివరమైన నివేదికను సిద్ధం చేసి పార్టీ హైకమాండ్‌కు సమర్పించనుంది.
భారత ఎన్నికల సంఘం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించేందుకు తక్షణమే అమల్లోకి వచ్చేలా నాయకులు, నిపుణులతో కూడిన సాధికారిక కార్యవర్గాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఏర్పాటు చేశారని పార్టీ జారీ చేసిన లేఖలో పేర్కొంది. ఈ కమిటీ మొదట మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో అవకతవకలను గుర్తించనుంది. వీలైనంత త్వరగా హైకమాండ్‌కు సమగ్ర నివేదికను సమర్పించనుంది.
దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో గతంలో జరిగిన ఎన్నికలను కూడా ఈగిల్ విశ్లేషించి రానున్న ఎన్నికలను, దేశంలో నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలను చురుగ్గా పర్యవేక్షించి నివేదికలు సిద్ధం చేసి హైకమాండ్‌కు పంపనుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై ఎన్నికల సంఘం కూడా స్పందించింది.
ఈ 8 మందికి గ్రూప్‌లో చోటు..
అజయ్ మాకెన్
దిగ్విజయ్ సింగ్
అభిషేక్ సింఘ్వీ
ప్రవీణ్ చక్రవర్తి
పవన్ ఖేడా
గుర్దీప్ సింగ్ సప్పల్
నితిన్ రౌత్
చల్లా వంశీ చంద్ రెడ్డి
గతేడాది చివర్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో ఒకవైపు బీజేపీ, షిండే గ్రూపునకు చెందిన శివసేన, అజిత్ పవార్ గ్రూపునకు చెందిన ఎన్సీపీతో కూడిన అధికార కూటమి ఉంది. మరో వైపు మహావికాస్ అఘాడి బరిలో నిలిచింది. ఇందులో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన, శరద్ పవార్ కు చెందిన NCP ఉన్నాయి. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడం, దాని మిత్రపక్షాలు ఎన్నికల్లో విజయం సాధించడంతో గెలుపుపై ఆశలు పెట్టుకున్న ప్రత్యర్థులు షాక్‌కు గురయ్యారు. ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలన్నీ 50 సీట్ల మార్కును కూడా చేరుకోలేకపోయాయి. చాలా స్థానాల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని గతంలో కాంగ్రెస్ కూడా ఈవీఎంలపై ప్రశ్నలు సంధించింది. అయితే ఈ ఆరోపణలన్నింటిపై ఎన్నికల సంఘం ఒక్కొక్కటిగా స్పందిస్తూ.. పార్టీకి సలహాలు కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 5న ఓటింగ్, ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడికానున్నాయి. అందుకే ఫలితాలకు ముందే పార్టీ ఈగిల్ గ్రూప్‌ని ఏర్పాటు చేసింది.
Hon'ble Congress President Shri @kharge has constituted an Empowered Action Group of Leaders and Experts (EAGLE) with immediate effect, comprising the following members, to monitor the conduct of free and fair elections by the Election Commission of India. pic.twitter.com/a5qgmNDP79
— Congress (@INCIndia) February 2, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..