PM Modi: “ఇందిరా గాంధీ ఉండి ఉంటే రూ.10 లక్షలు ట్యాక్స్‌లకే పోయేవి..”

ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఇప్పుడు ఇందిరా గాంధీ ప్రభుత్వం ఉండి ఉంటే..రూ.12 లక్షల ఆదాయం ఉన్న వాళ్లు రూ.10 లక్షల వరకూ పన్నులు కట్టాల్సి వచ్చేదని సెటైర్లు వేశారు. మాజీ ప్రధాన మంత్రులు జవహర్ లాల్ నెహ్రూతో పాటు ఇందిరా గాంధీ ప్రజల నుంచి భారీ పన్నులు వసూలు చేశారని, వాళ్ల పాలసీలే అలా ఉండేవని తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలోని ఆర్‌కే పురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ..ఈ కామెంట్స్ చేశారు.

PM Modi:  ఇందిరా గాంధీ ఉండి ఉంటే రూ.10 లక్షలు ట్యాక్స్‌లకే పోయేవి..
Narendra Modi
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 02, 2025 | 7:31 PM

పొరపాటున ఇప్పుడు ఇందిరా గాంధీ ప్రభుత్వం ఉండి ఉంటే ఏటా 10 లక్షల రూపాయలు ట్యాక్స్‌లు కట్టడానికే పోయేవని ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చురకలు అంటించారు. ఇదే సమయంలో తమ ప్రభుత్వం ట్యాక్స్ విధానాన్ని ఎంత సులభతరం చేసిందో వివరించారు. కొత్త బడ్జెట్‌తో మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చామని అన్నారు. రూ.12 లక్షల ఆదాయం వరకూ పన్ను భారం నుంచి మినహాయింపు ఇచ్చామని వెల్లడించారు. “జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో ఎవరికైనా రూ.12 లక్షల ఆదాయం ఉండి ఉంటే…అందులో నాలుగు వంతులు పన్నులు కట్టడానికే పోయేవి. ఇప్పుడు ఇందిరా గాంధీ ప్రభుత్వం ఉన్నా..అదే జరిగేది” అని వ్యాఖ్యానించారు మోదీ.

అయితే…1970లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో చరిత్రలోనే అత్యధికంగా పన్ను వసూళ్లు చేశారన్న విమర్శలున్నాయి. అప్పట్లో దాదాపుగా 93% మేర ట్యాక్స్ వసూలు చేశారని లెక్కలు చెబుతున్నాయి. 1973-74 మధ్య కాలంలో ఈ పన్ను భారం ఎక్కువగా ఉండేది. అయితే..ఇప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను విధానాన్ని సులభతరం చేశారు. ఈ సందర్భంగానే మోదీ కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. కొత్త పన్ను విధానం ప్రకారం..12 లక్షల ఆదాయం ఉన్న వాళ్లను పన్ను నుంచి మినహాయించారు. ఇది సామాన్యులకు ఎంతో ఊరటనిచ్చింది. ఇక ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతోంది. ప్రచారం తుది దశకు చేరుకున్నప్పటికీ బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్య పోటాపోటీ నెలకొంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. పదేళ్ల ఆప్ పాలనలో ఢిల్లీని పూర్తిగా ధ్వంసమైపోయిందని మోదీ విమర్శించారు. అటు ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా ఇదే స్థాయిలో కౌంటర్‌లు ఇస్తున్నారు. మురికివాడల్ని ధ్వంసం చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని మండి పడ్డారు. దీనికి మోదీ గట్టిగానే బదులిచ్చారు. అటు కాంగ్రెస్ కూడా బడ్జెట్‌పై విమర్శలు చేస్తూ ఆ అంశాన్ని ఢిల్లీ ఎన్నికలకు ముడి పెడుతోంది. ఏదో కొంత మందికి మాత్రమే మేలు జరిగేలా బడ్జెట్‌ని రూపొందించారని, ఢిల్లీ ప్రజలు ఇది గమనించాలని ప్రచారం చేస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..