ప్రజలను మోసగించారు, ఇది ప్రజా ద్రోహక బడ్జెట్, కాంగ్రెస్ నేత పి.చిదంబరం మండిపాటు
ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ బడ్జెట్లో ప్రజలకు ద్రోహం చేశారని, ఇది కేవలం ధనికులకు మాత్రమే ప్రయోజనకమైనదని కాంగ్రెస్ సీనియర్ నేత..,
ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ బడ్జెట్లో ప్రజలకు ద్రోహం చేశారని, ఇది కేవలం ధనికులకు మాత్రమే ప్రయోజనకమైనదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం ఆరోపించారు. రిపబ్లిక్ దినోత్సవం రోజున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన వేలాది రైతులకు వ్యతిరేకంగా, వారిపై కక్ష గట్టిన రీతిలో ఈ బడ్జెట్ ఉందన్నారు. అన్నదాతలకు సాయపడాల్సింది పోయి వారికి హాని కలిగించేదిగా ఇది ఉందన్నారు. వ్యాక్సిన్లకు కేటాయింపులు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లను కలిపేశారని ఆయన విమర్శించారు. రక్షణ, ఆరోగ్య రంగాలకు నిధులను మరింత పెంచాల్సి ఉందన్నారు. పెట్రోలియం ఉత్పతులతో సహా పలు వస్తువులపై సెస్ విధించారని, కానీ ఎంపీల్లో చాలామందికి ఈ విషయం తెలియదని చిదంబరం పేర్కొన్నారు. సెస్సుల నుంచి వచ్ఛే ఆదాయంతో రాష్ట్రాలకు ఎలాంటి వాటా లభించదని ఆయన చెప్పారు. ఇది అన్నదాతలతో సహా సగటు వ్యక్తిపై క్రూరమైన దెబ్బ అని ఆయన అభివర్ణించారు.
దేశంలో అనేక పరిశ్రమలు మూత పడ్డాయని, ఇంకా వేలమంది ఉద్యోగాలకోసం అల్లాడుతున్నారని, వారి విషయాన్ని ఈ బడ్జెట్లో ప్రస్తావించారా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపులు జరిపారు..కానీ ఈ పెద్ద బడాయి కబుర్లకు ప్రజలు మోసపోరు అని ఆయన వ్యాఖ్యానించారు.