Coal Crisis: ముంచుకొస్తున్న ముప్పు.. బొగ్గు కోసం కోల్ ఇండియా కష్టాలు.. దేశాన్ని అలుముకుంటున్న చీకట్లు

దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలంటారు. కానీ ఆ దీపమే లేకపోతే ఇంటి పరిస్థితి ఏంటి? ఎస్.. దేశంలో ప్రస్తుతం ఇదే పరిస్థితి. డిమాండ్‌కు సరిపడా కరెంట్ లేదు. ఉత్పత్తి చేద్దామంటే బొగ్గులేదు.

Coal Crisis: ముంచుకొస్తున్న ముప్పు.. బొగ్గు కోసం కోల్ ఇండియా కష్టాలు.. దేశాన్ని అలుముకుంటున్న చీకట్లు
Coal Crisis
Follow us

|

Updated on: May 01, 2022 | 7:20 AM

Coal Crisis in India: దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలంటారు. కానీ ఆ దీపమే లేకపోతే ఇంటి పరిస్థితి ఏంటి? ఎస్.. దేశంలో ప్రస్తుతం ఇదే పరిస్థితి. డిమాండ్‌కు సరిపడా కరెంట్ లేదు. ఉత్పత్తి చేద్దామంటే బొగ్గులేదు. 12 రాష్ట్రాల్లో 2 నుంచి 8 గంటల పాటు విద్యుత్ కోతలు.. ఆస్పత్రులు, మెట్రోలకు పవర్ అందించలేని సిట్యువేషన్. ఇంతకీ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ సంక్షోభానికి ఎవరు కారణం.

దేశంలోని పవర్ ప్లాంట్ల దగ్గర 22 మిలియన్ టన్నుల బొగ్గు ఉంది. ఇది 10 రోజులకు మాత్రమే సరిపోతుంది. ఆ తర్వాత ఉత్పత్తి ఆగకుండా ఉండేందుకు బొగ్గు సప్లైలో వేగం పెంచాం.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేసిన కామెంట్ ఇది. దేశంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పడానికి ఈ ఒక్క స్టేట్ మెంట్ చాలు. దేశాన్ని ఎలాంటి చీకటి రోజులు పొంచి ఉన్నాయో చెప్పటానికి.. కరెంట్ కోతలు.. కేవలం ఒక రాష్ట్రానికో, ఒక ప్రాంతానికో కాదు. మొత్తం దేశం ఎదుర్కొంటున్న, ఎదుర్కోబోతున్న సమస్య. డిమాండ్‌ ఈస్ట్ సప్లై ఈక్వేషన్‌ బెడిసికొట్టింది. దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది.. దానికి అనుగుణంగా సప్లై పెరగకపోవడమే ప్రస్తుత పరిస్థితికి అసలు కారణమని నిపుణులు చెబుతున్నారు. పవర్‌ డిమాండ్‌ 38 ఏళ్లలో కనీవినీ ఎరుగని రికార్డుస్థాయికి చేరితే.. ఉత్పత్తిలో ఏ మాత్రం మార్పు లేదు.

కోల్ ఇండియా దగ్గర ప్రస్తుతం 56.7 మిలియన్ టన్నుల బొగ్గు ఉంది. సింగరేణిలో 4.3 మిలియన్ టన్నుల స్టాక్ ఉంది. క్యాప్టివ్ బొగ్గు బ్లాకుల్లో 2.3 మిలియన్ టన్నుల స్టాక్ ఉన్నట్టు కేంద్రం లెక్కలు చెప్తున్నాయి. ఇక, దేశం మొత్తం మీద 165 థర్మల్‌ పవర్‌ స్టేషన్లు ఉంటే, వాటిలో 56 పవర్‌ స్టేషన్లలో 10 శాతం, అంతకన్నా తక్కువ బొగ్గు నిల్వ ఉందని సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ చెబుతోంది. కనీసం 26 థర్మల్‌ స్టేషన్లలో 5 శాతం బొగ్గు నిల్వ ఉందని ఈ సంస్థ చెప్పడం ప్రస్తుత పరిస్థితికి అద్ధం పడుతోంది.

ఎప్పుడూ లేనంతగా ఈసారి రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో కరెంట్ వినియోగం విపరీతంగా పెరిగింది. ఇదే టైమ్‌లో ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కారణంగా బొగ్గు దిగుమతులపై ప్రభావం పడింది. అందుకే దేశంలో ఈ పరిస్థితి వచ్చిందని చెప్తోంది కేంద్రం. బొగ్గు కొరతను అధిగమించేందుకు కోల్ ఇండియా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏప్రిల్ నెలలో ఏకంగా 27.2 శాతం ఉత్పత్తి పెంచింది. సాధారణంగా ప్రతియేటా 5. 8శాతం మేర ఉత్పత్తి పెరుగుతుంది. కానీ ఈ ఏడాది విపరీతమైన డిమాండ్ రావడంతో పెద్ద ఎత్తున బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన పరిస్థితి.

ఒకవైపు మండే ఎండలకు మాడు పగులుతోంది. మరోవైపు దేశంలో కరెంట్‌ కోతలతో కారుచీకట్లు కమ్ముకుంటున్నాయి. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో భయంకరమైన విద్యుత్‌ కొరత కనిపిస్తోంది. యూపీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా, ఉత్తరాఖండ్‌, బీహార్‌, జార్ఖండ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు కోతలు జనాన్ని పరేషాన్‌ చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు కరెంట్ సమస్యను అధిగమించాలంటే అవసరమైనంత బొగ్గును థర్మల్ పవర్ ప్లాంట్లకు అందించాలి. దేశాన్ని కరెంట్ కోతల నుంచి బయటకు తీసుకురావాలంటే.. స్పెషల్ యాక్షన్ ప్లాన్ తప్పని సరి.. అందుకే రైల్వేతో కలిసి కోల్ సైకిల్‌ను పరుగులు పెట్టించేందుకు కేంద్రం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా కరెంట్‌ కోతలను అధిగమించే చర్యల్లో భాగంగా 240 ప్యాసింజర్‌ రైళ్లను నిరవధికంగా రద్దు చేశారు. మరో 657 ప్యాసింజర్ రైళ్లను కూడా నిలిపివేశారు. బొగ్గుసరఫరా చేస్తున్న 533 రైల్‌ రేక్స్‌ వేగం పెంచేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

దేశంలో ప్రస్తుత సంక్షోభానికి మోదీ సర్కారు వైఫల్యమే కారణమని కాంగ్రెస్‌ పార్టీ మండిపడుతోంది. కేంద్రం నిర్వాకం వల్ల 16 రాష్ట్రాలు రోజుకు 10 గంటల దాకా కరెంటు కోతలు విధించాల్సిన దుస్థితి దాపురించిందని ఆరోపిస్తోంది. మరోవైపు ప్రధాని మోదీ టార్గెట్‌గా రాహుల్ గాంధీ ట్వీట్లకు పదును పెట్టారు. పెట్రోల్ రేట్లు పెరిగితే రాష్ట్రాలను నిందిస్తారు. కోల్ షార్టేజ్ వస్తే రాష్ట్రాలే కారణం.. ఆక్సిజన్ కొరతకు రాష్ట్రాలే కారణంగా చూపిస్తోందంటూ ఆరోపించారు. 68శాతం పన్నులు వసూలు చేస్తున్న కేంద్రం రాష్ట్రాలకు సహకరించకుండా.. భయపెట్టి పాలన చేస్తోందన్నారు.

ఇదిలావుంటే, 8 సంవత్సరాల బీజేపీ పాలన తర్వాత దేశంలో బొగ్గు సంక్షోభానికి కారణంగా ఎవరిని చూపిస్తారంటూ మరో ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ. దేశంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని తాను ముందే చెప్పినట్టే జరుగుతోందన్నారు. రాహుల్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ ముందు తన పార్టీ గురించి చూసుకుంటే బాగుంటుందనీ.. ఆ తర్వాతే బొగ్గు గురించి మాట్లాడాలన్నారు. ఇప్పటికే అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతున్నట్టు కేంద్రం చెప్తోంది.

38 ఏళ్లలో కనీవినీ ఎరుగని రికార్డుస్థాయికి పవర్‌ డిమాండ్‌ చేరింది. కరెంట్ డిమాండ్‌కు సరిపడా సప్లయ్‌ లేకపోవడమే ఈ విద్యుత్‌ కోతలకు కారణం. బొగ్గు సమస్య పరిష్కారం కాకపోతే మున్ముందు మరింత కష్టాలు తప్పవనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తోంది.

Read Also…  Defamation Case: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రూ.1500 మనీ ఆర్డర్ చేసిన ఆర్ఎస్ఎస్ నేత.. ఎందుకో తెలుసా?

మరిన్ని జాతీయ వార్తల కోసం