Pahalgam Attack: ఉగ్రదాడిపై ఆవేదన.. ఇస్లాంను త్యజించేందుకు సిద్ధమైన టీచర్
పహల్గామ్‌లో హేయమైన ఉగ్రదాడి ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. మతం అడిగి మరీ మనుషుల్ని కాల్చి చంపడంతో భారత్‌లోని ముస్లిం సమాజం నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మనుషులు వారి మతం కారణంగా ఎందుకు చంపబడాలి అని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఓ బెంగాల్ టీచర్ ఇస్లాంను త్యజించేందుకు సిద్ధమయ్యారు.

పహల్గామ్ ఉగ్రవాద దాడి భారతీయులను తీవ్రంగా కలిచివేస్తుంది. 26 మంది అమాయకులను టెర్రరిస్టులు కిరాకతంగా చంపడంతో దేశమంతా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఉగ్ర దాడిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ.. పశ్చిమ బెంగాల్‌లోని బదురియాకు చెందిన పాఠశాల ఉపాధ్యాయుడు సబీర్ హుస్సేన్ ఇస్లాంను త్యజించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఏ మతానికి చెందకుండా, తనకున్న ఇస్లాం గుర్తింపును వదులుకోవడానికి హుస్సేన్ కోర్టును ఆశ్రయించాలని యోచిస్తున్నాడు.
“నేను ఏ మతాన్ని అగౌరవపరచను. ఇది నా వ్యక్తిగత నిర్ణయం. ముఖ్యంగా కాశ్మీర్‌లో హింసకు మతాన్ని పదే పదే సాధనంగా ఎలా వాడుకుంటున్నారో నేను గమనించాను. ఇకపై నేను ఈ విధానాన్ని అంగీకరించలేను. నాకు ఏ మతపరమైన లేబుల్ లేకుండా ఓ సాధారణ మనిషిలా జీవించాలని అనుకుంటున్నాను. అందుకోసం కోర్టుకు అధికారిక అర్జీ పెట్టుకోవాలనుకుంటున్నాను.” అని టీచర్ సబీర్ హుస్సేన్ తెలిపాడు.
అయితే అన్ని మతాల పట్ల తనకు గౌరవం ఉందని సబీర్ హుస్సేన్ చెబుతున్నాడు. పహల్గామ్ వంటి హింసాత్మక ఘటనల్లో మతాన్ని దుర్వినియోగం చేయడమే తన బాధకు కారణమని అంటున్నారు . “ఎవరైనా వారి మతం కారణంగా ఎందుకు చంపబడాలి? అదే నన్ను తీవ్రంగా బాధపెడుతుంది” అని ఆయన అన్నారు.
హుస్సేన్ మొదట్లో తన నిర్ణయాన్ని ఫేస్‌బుక్‌లో ప్రకటించాడు. చట్టబద్ధంగా ఇస్లాం నుండి ఎలా వైదొలగాలి అన్న అంశంపై ఆయన సమాలోచనలు చేస్తున్నారు. అయితే, తన నమ్మకాలను తన కుటుంబంపై రుద్దబోనని అతను స్పష్టం చేశాడు. “నా భార్య, పిల్లలు ఏ మార్గాన్ని అయినా ఎంచుకునే స్వేచ్ఛ వారికి ఉంది. ఇది నా వ్యక్తిగత ప్రయాణం. నేను ఇకపై ఇస్లాంతో ప్రయాణాన్ని సాగించను” అని హుస్సేన్ స్పష్టం చేశారు. ఈ రోజుల్లో ప్రతిదీ మతం చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తోంది. నేను జీవించాలనుకునే ప్రపంచం అది కాదు అని ఆయన చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
