AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: భారీ వర్షాలతో చెన్నై అతలాకుతలం.. రోడ్లన్నీ జలమయం.. భారీగా ట్రాఫిక్ జాం..!

Chennai Rains: మునుపెన్నడూ లేని విధంగా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు భారీగా ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడ్డాయి.

Watch Video: భారీ వర్షాలతో చెన్నై అతలాకుతలం.. రోడ్లన్నీ జలమయం.. భారీగా ట్రాఫిక్ జాం..!
Chennai Traffic Jam
Venkata Chari
|

Updated on: Dec 30, 2021 | 11:14 PM

Share

Chennai Traffic Jam: గురువారం మధ్యాహ్నం, చెన్నైతోపాటు శివారులోని అనేక ప్రాంతాలలో వర్షంతోపాటు బలమైన ఈదురు గాలులతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. వర్షం కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక రోడ్లు జలమయం కావడంతో నగరంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈరోజు, నగరంలోని పలు ప్రాంతాలు భారీ వర్షాల కారణంగా ముఖ్యంగా మౌంట్ రోడ్, పూనమల్లి రోడ్‌లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు భారీ ట్రాఫిక్ జామ్‌లతో ఇబ్బంది పడ్డాయి.

రాత్రి 9 గంటల వరకు, భారీ వర్షాల కారణంగా మూడు సబ్‌వేలు మూసివేసినట్లు అధికారులు తెలిపారు. కేకే నగర్, మైలాపూర్, సెంబియం, నుంగంబాక్కం, అశోక్ నగర్ తదితర ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. 14 రోడ్లపై నీటి ఎద్దడి కారణంగా ట్రాఫిక్‌ను మళ్లించారు. అయితే ప్రధాన రహదారులు క్లియర్‌గా ఉన్నా నగరంలోని అంతర్భాగాల్లోని చిన్న రోడ్లు జలమయమయ్యాయి. గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీసుల సమాచారం మేరకు, గంగురెడ్డి సబ్‌వే, దురైస్వామి సబ్‌వే, ఆర్‌బీఐ సబ్‌వేలు నీటి ఎద్దడి కారణంగా మూసివేశారు. నీటి ఎద్దడి కారణంగా 14 రోడ్లపై పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు.

కేకే నగర్ – రాజా మన్నార్ సలై, మైలాపోర్ – శివస్వామి సలై, ఈవీఆర్ సలై – గాంధీ ఇర్విన్ నుంచి నాయర్ పాయింట్ వరకు, సెంబియం – జవహర్ నగర్ 20 అడుగుల సలై, కులత్తూరు వినాయగపురం – రెడ్‌హిల్స్ రోడ్, పెరియార్ సలై – 100 అడుగుల రోడ్డు, నుంగంబాక్కం లేక్‌వ్యూ సలై, శాంతోమ్ కచేరీ రోడ్, రాజరతీనం స్టేడియం, ఈవీఆర్ సలై – గాంధీ ఇర్విన్ సలైకి ఈవీకే సంపత్ రోడ్డు, అశోక్ నగర్, 70 ఫీట్ రోడ్ కొడుంగయ్యూర్ హౌసింగ్ బోర్డ్ దగ్గర, పెరియమెట్ పోలీస్ స్టేషన్ సమీపంలో జోన్స్ రోడ్‌లలో వాహనాలను దారి మళ్లించారు. గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీసులు మోటారు పంపుల సహాయంతో నీటి ఎద్దడిని తొలగిస్తున్నారు. త్వరలో అన్ని రహదారులను క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు. రోడ్లపై నీరు నిలిచి ఉన్నందున, వాహనదారులు తమ మార్గాలను జాగ్రత్తగా ఎంచుకోవాలని సూచించారు.

భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, చెన్నైతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలలో అతిభారీ వర్షం కురుస్తుందని, రాబోయే ఆరు గంటల పాటు ఈ ప్రాంతంలో వర్షం కొనసాగుతుందని అంచనా వేసింది. ఎంఆర్‌సీ నగర్‌లో 198 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఉదయం 8:30 నుంచి సాయంత్రం 7:45 గంటల వరకు నుంగంబాక్కంలో 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని IMD తెలిపింది. రాబోయే 48 గంటలపాటు, చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (RMC) చెన్నై నగరం, దాని పరిసర ప్రాంతాలలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

“ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రత వరుసగా 31˚C, 24˚C గా ఉండే అవకాశం ఉంది” అని ఆర్ఎంసీ తన బులెటిన్‌లో తెలిపింది.

Also Read: Omicron Variant: ఒమిక్రాన్‌తో ఎవ్వరు చనిపోలేదు.. కొత్త వేరియంట్‌ కట్టడికి ప్రత్యేక చర్యలు

Chennai rain: వరద పోటెత్తింది.. సిటీ జలమయమైంది.. బిక్కు బిక్కుమంటున్న చెన్నై మహానగరం..