వాయు కాలుష్యంతో భారతీయుల ఆయుష్షు ఐదేళ్లు ఫసక్‌.. అక్కడివారికైతే ఏకంగా పదేళ్లు.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

Air Pollution:  అభివృద్ధి పేరుతో పారిశ్రామికీకరణ, శిలాజ ఇంధనాల వాడకం పెరగడం, వాహనాలు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో మన దేశంలో వాయుకాలుష్యం (Air Pollution) విపరీతంగా పెరిగిపోతోంది. ఫలితంగా లక్షలాది మంది ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడి..

వాయు కాలుష్యంతో భారతీయుల ఆయుష్షు ఐదేళ్లు ఫసక్‌.. అక్కడివారికైతే ఏకంగా పదేళ్లు.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Air Pollution
Follow us

|

Updated on: Jun 25, 2022 | 4:45 PM

Air Pollution:  అభివృద్ధి పేరుతో పారిశ్రామికీకరణ, శిలాజ ఇంధనాల వాడకం పెరగడం, వాహనాలు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో మన దేశంలో వాయుకాలుష్యం (Air Pollution) విపరీతంగా పెరిగిపోతోంది. ఫలితంగా లక్షలాది మంది ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ముందువరుసలో ఉండే ఢిల్లీ దీన స్థితి గురించి అధ్యయనాలు, పరిశోధనలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా నివారణ చర్యలు తీసుకుంటున్నాయి. అయినా అక్కడ గాలిలో నాణ్యత పెరగడం లేదు. తాజాగా ఢిల్లీ వాయు కాలుష్యంపై చికాగో వ‌ర్సిటీలోని ఎన‌ర్జీ పాల‌సీ ఇనిస్టిట్యూట్‌ సంచలన విషయాలు బయటపెట్టింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాల కంటే ఢిల్లీలో వాయుకాలుష్యం 21 రెట్లు అధికంగా ఉందన్న ఈ అమెరికన్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌.. పరిస్థితి మారకపోతే దేశ రాజధాని ప్రజల ఆయుర్దాయం 10 ఏళ్ళు తగ్గిపోతుందని హెచ్చరించింది.

ప్రపంచంలోనే అత్యధికంగా..

కాగా 2013 నుంచి ప్రపంచవ్యాప్తంగా 44 శాతం కాలుష్యం ఒక్క భారతదేశం నుంచే వస్తోందని ఈ సంస్థ నివేదించింది. ఇక ప్రపంచంలోనే కాలుష్యం అధికంగా ఉన్న దేశాల్లో ఇండియా రెండో స్థానంలో ఉందని ఈ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ గుర్తుచేసింది. ఇక దేశంలోని 1.3 బిలియన్ల ప్రజలు వార్షిక సగటు కాలుష్య స్థాయి.. డబ్ల్యూహెచ్​వో సూచించిన పరిమితికంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నే ఉంటున్నారంది. కాగా భార‌త్‌లో వాయు నాణ్యత 40 µg/m³ ఉంటే దాన్ని సురక్షితంగా భావిస్తారు. అయితే 63 శాతం మంది భార‌తీయులు ఆ స్థాయి నాణ్యత లేని వాతావ‌ర‌ణంలో నివసిస్తున్నారని ఈ అధ్యయనంలో తేలింది. ఇక 2019 లెక్కల ప్రకారం భారతదేశంలో గాలిలోని సూక్ష్మధూళి కణాల సాంద్రత 70.3 µg/m³గా ఉందని.. ఇది ప్రపంచంలోనే అత్యధికమని ఈ సంస్థ పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను పాటించకుంటే వాయు కాలుష్యం కారణంగా భారత్‌లో నివసించే వారి జీవిత కాలం సగటున ఐదేళ్లు తగ్గనుందని హెచ్చరించింది. గ‌డిచిన రెండు ద‌శాబ్దాల్లో భారత్ లో పారిశ్రామికీక‌ర‌ణ విప‌రీతంగా పెరిగింద‌ని, వాహ‌నాల సంఖ్య కూడా నాలుగింత‌లు పెరిగిందని ఇదే వాయకాలుష్యానికి దారి తీసిందని యూఎస్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ నివేదించింది.

ఇవి కూడా చదవండి

కేంద్రానికి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు..

కాగా ఈ నివేదికను సుమోటోగా తీసుకున్న కేంద్ర మానవ హక్కుల కమిషన్‌ తాజాగా కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ నివేదికలోని అంశాలు నిజమైతే జీవించే హక్కుకు భంగం కలిగించినట్లేనంటూ తీవ్రంగా ప్రతిస్పందించింది. 2019లో కేంద్రం ప్రారంభించిన నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌ స్టేటస్‌తో సహా ఈ నివేదికపై నాలుగు వారాల్లోగా నివేదిక సమర్పించాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కార్యదర్శికి నోటీసులు పంపించింది. మరి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని జాతీయ వార్తలపై క్లిక్ చేయండి..