Shubanshu Shukla: శుభాంశు శుక్లాకు అశోక్ చక్ర.. కేంద్రం నుంచి ప్రకటన.. రేపే ప్రదానం
భారత వ్యోమగామి శుభాంశు శుక్లాకు దేశ అత్యున్నత పుర్కసారం లభించింది. అశోక్ చక్ర అవార్డును ఆయనకు కేంద్రం ప్రకటించింది. రేపు జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్‌లో ఆయనకు రాష్ట్రపతి అవార్డు ప్రదానోత్సవం చేయనున్నారు. ఈ సందర్భంగా శుభాంశు శుక్లాకు పలువురు అభినందనలు తెలుపుతున్నారు.

అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రంలోకి వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామిగా పేరొందిన శుభాంశు శుక్లాకు మరో కీలక అవార్డు లభించింది. భారత సైనిక పురుస్కారం అయిన అశోక్ చక్ర అవార్డు ఆయనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. పద్మభూషణ్, పద్మ విభూషణ్, పద్మ శ్రీ అవార్డులను ప్రకటించింది. ఈ సందర్భంగా అశోక్ చక్ర అవార్డుపై కూడా క్లారిటీ వచ్చింది. గత ఏడాది ఐఎస్‌ఎస్‌లోకి వెళ్లి వచ్చిన శుభాంశు శుక్లాకు అశోక్ చక్ర ప్రకటించింది.
రేపు అవార్డు ప్రదానం
జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో పరేడ్ జరగనుంది. ఈ పరేడ్ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా శుభాంశు శుక్లా అశోక్ చక్ర అవార్డును అందుకోనున్నారు. సాధారణంగా ఉగ్రవాద వ్యతిరేక పోరాటాలతో పాటు ఆర్మీలో సాహసోపేతమైన సాహసాలు చూపించినవారికి అశోక్ చక్ర అవార్డులను అందిస్తూ ఉంటారు. కానీ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో అడుగుపెట్టి తన ధైర్య సాహాసాలు చూపించినందుకు శుభాంశు శుక్లాకు ఈ అవార్డు ప్రకటించారు. గత ఏడాది జూన్‌లో ఆక్సియమ్-4 మిషన్ ద్వారా ఐఎస్‌ఎస్‌లో శుభాంశు శుక్లా అడుగుపెట్టారు. అందులో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. దాదాపు 18 రోజుల పాటు అక్కడే గడిపి కీలక ప్రయోగాలు చేశారు.
గగన్ యాన్ ప్రాజెక్టుకు కీలకం
ఐఎస్‌ఎస్‌లో కష్టతరమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని తన తెగువను చూపించినందుకు శుభాంశు శుక్లాకు అశోక్ చక్ర అవార్డును కేంద్రం ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఆయన ధైర్యసాహాసాలను కొనియాడుతున్నారు. ఆక్సియమ్-4 మిషన్ పైలట్‌గా పనిచేయడమే కాకుండా కష్టతరమైన డాకింగ్ ప్రక్రియను కూడా నిర్వహించాడు. ఇక 2025 జూన్‌లో ఇస్రో కోసం పలు పరిశోధనల చేశారు. ఆయన చేసిన ప్రయోగాలు ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గగన్ యాన్ ప్రాజెక్టుగా కీలకంగా పనిచేస్తామని అంటున్నారు.
