AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మళ్లీ అగ్నిగుండంగా మారిన మణిపూర్‌.. మైతీ తెగ నాయకుల అరెస్ట్‌తో రగిలిన హింస

మణిపూర్ మళ్లీ అగ్నిగుండంగా మారింది. గత కొన్నిరోజులుగా నివురు గప్పిన నిప్పులా ఉన్న మణిపూర్‌లో మళ్లీ హింస చేలరేగింది. మైతీ తెగకు చెందిన నాయకుల అరెస్ట్‌తో రాజధాని ఇంఫాల్‌లో ఘర్షణ చోటు చేసుకుంది. అరెస్టులకు వ్యతిరేకంగా మైతేయ్ సముదాయం పెద్ద ఎత్తున నిరసనలకు దిగింది.

మళ్లీ అగ్నిగుండంగా మారిన మణిపూర్‌.. మైతీ తెగ నాయకుల అరెస్ట్‌తో రగిలిన హింస
Manipur Violence
Balaraju Goud
|

Updated on: Jun 08, 2025 | 7:23 PM

Share

మణిపూర్ మళ్లీ అగ్నిగుండంగా మారింది. గత కొన్నిరోజులుగా నివురు గప్పిన నిప్పులా ఉన్న మణిపూర్‌లో మళ్లీ హింస చేలరేగింది. మైతీ తెగకు చెందిన నాయకుల అరెస్ట్‌తో రాజధాని ఇంఫాల్‌లో ఘర్షణ చోటు చేసుకుంది. అరెస్టులకు వ్యతిరేకంగా మైతేయ్ సముదాయం పెద్ద ఎత్తున నిరసనలకు దిగింది.

గత సంవత్సరం చెలరేగిన జాతుల మధ్య రగిలిన ఘర్షణలు, హింసాయుత ఘటనల నుంచి రాష్ట్రం ఇంకా పూర్తిగా కోలుకోకముందే మళ్లీ మణిపూర్‌లో హింస రాజుకుంది. మైతీ తెగ రాడికల్ గ్రూప్ అరమ్‌బాయ్‌ తెన్గోల్‌-ATకి చెందిన ప్రముఖ నాయకుడు కనన్‌ సింగ్ సహా ఐదుగురు నాయకులను అరెస్ట్ చేయడంతో రాజధాని ఇంఫాల్ హింసాత్మకంగా మారింది. మైతీ తెగ యువకులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. పలు ప్రాంతాల్లో టైర్లను తగులబెట్టి నిరసన తెలిపారు. నిరసనకారులు తమ నాయకులను వెంటనే విడుదల చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకుంటామంటూ కొందరు యువకులు పెట్రోల్ ‌పోసుకుని బెదిరింపులకు దిగారు. ఆందోళనకారుల దాడుల్లో వాహనాలు ధ్వంసం అయ్యాయి.

2024 ఫిబ్రవరిలో పోలీస్ సూపరింటెండెంట్ మోయిరంగ్థెం అమిత్ ఇంటిపై దాడి, ఒక సీనియర్ పోలీస్ అధికారి కిడ్నాప్‌లో కనన్ సింగ్ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. ఆ సమయంలో కనన్ సింగ్ రాష్ట్ర పోలీస్ కమాండో యూనిట్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. విధుల్లో నిర్లక్ష్యం కారణంగా అప్పట్లో కనన్ సింగ్‌ను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కనన్ సింగ్ ఏటీలో నాయకుడిగా మారారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భద్రతా దళాలతో ఆందోళనకారులు ఘర్షణ పడ్డారు. ఖురాయ్ లామ్‌లాండ్ జిల్లాలో ఆందోళనకారులు ఓ బస్సును తగులబెట్టారు. క్వాకెయితెల్ ప్రాంతంలో కాల్పులు శబ్దం విన్పించింది. అయితే కాల్పులు ఎవరు జరిపారన్నది వెల్లడికాలేదు. అరెస్టయిన తమ నాయకుడిని రాష్ట్రం బయటకు తీసుకుపోతున్నారని భావించి ఇంఫాల్ ఎయిర్‌పోర్ట్‌ రోడ్‌పై పడుకుని బ్లాక్ చేశారు. ఆందోళనకారులపై భద్రతా దళాలు టియర్ గ్లాస్ షెల్ ప్రయోగించాయి. లాఠీ చార్జీలో ఒకరు చనిపోయారు.

మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, తొబల్, కాక్చింగ్ జిల్లాల్లో 144 సెక్షన్ విధించి అదనపు బలగాలను మోహరించారు. ఆందోళనల నేపథ్యంలో ఈ ఐదు జిల్లాల్లో ఐదురోజులపాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందిప్రభుత్వం. మరోవైపు 10రోజుల పాటు బంద్ పాటించాలని అరమ్‌బాయ్‌ తెన్గోల్‌-AT గ్రూప్ పిలుపునిచ్చింది.

2023 మే నుంచి మణిపూర్‌లో మైతీలు, ‘కుకి-జో’ తెగల మధ్య చోటుచేసుకున్న హింసాయుత ఘటనల్లో 260 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలకు సంబంధించి కేసులో అరమ్‌బాయ్‌ తెన్గోల్‌-ATకి చెందిన నేతలను అరెస్ట్ చేయడంతో మళ్లీ రాష్ట్రంలో హింస ప్రజ్వరిల్లింది. అరమ్‌బాయ్‌ తెన్గోల్‌-AT గ్రూప్ మైతీ సంస్కతి పరిరక్షణకోసం ఏర్పాటై అనంతరం రాడికల్‌ గ్రూప్‌గా మారింది. ఇటీవల ఈ గ్రూప్‌ గవర్నర్‌తో చర్చలు జరిపింది. కొంతమంది గ్రూప్ సభ్యులు ఆయుధాలు వీడి సరెండర్ అయ్యారు.

మణిపూర్ అల్లర్లపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. రాష్ట్రం రెండేళ్లుగా హింసాయుతమైంది. ప్రజలు హింస, హత్య, అత్యాచారాలకు గురవుతున్నారు. ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. హింసాయుత ఘటనల్లో వందలాది చనిపోగా వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రపతి పాలన సాగిస్తున్నప్పటికీ, మణిపూర్ లో శాంతి పునరుద్ధరించబడకపోవడానికి కారణం ఏమిటి? ప్రధాని మోదీ మణిపూర్‌ను ఎందుకు వెళ్లలేదు? దేశ ప్రజలకు శాంతి భద్రతలను నిర్ధారించడం ప్రధానమంత్రి బాధ్యత. దీని నుండి వెనక్కి తగ్గడం అంటే బాధ్యత నుండి తప్పుకోవడమే అని ట్వీట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..