మూడు రాష్ట్రాల్లో BSF అధికార పరిధి మరింత విస్తృతం.. కేంద్ర నిర్ణయంపై పంజాబ్, బెంగాల్ అభ్యంతరం

దేశ సరిహద్దుల వెంబడి బీఎస్ఎస్‌ అధికార పరిధిని మరింత విస్తృతం చేస్తూ కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మేరకు ఇకపై పంజాబ్‌, పశ్చిమ బెంల్​, అసోం రాష్ట్రాల్లో అంతర్జాతీయ సరిహద్దు నుంచి 50 కి.మీ.వరకు

మూడు రాష్ట్రాల్లో BSF అధికార పరిధి మరింత విస్తృతం.. కేంద్ర నిర్ణయంపై పంజాబ్, బెంగాల్ అభ్యంతరం
BSF

More Powers For BSF: దేశ సరిహద్దుల వెంబడి బీఎస్ఎఫ్(BSF) అధికార పరిధిని మరింత విస్తృతం చేస్తూ కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పంజాబ్‌, పశ్చిమ బెంల్​, అసోం రాష్ట్రాల్లో అంతర్జాతీయ సరిహద్దు నుంచి 50 కి.మీ.వరకు లోపలకు వచ్చి బీఎస్ఎఫ్ దళాలు సోదాలు, జప్తులు చేయడం సహా అనుమానిత వ్యక్తులను అరెస్టు చేయవచ్చు. పాకిస్థాన్‌తో సరిహద్దు పంచుకుంటున్న పంజాబ్, బంగ్లాదేశ్‌తో సరిహద్దు పంచుకుంటున్న పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలలో బీఎస్ఎఫ్ అధికార పరిధి ఇప్పటి వరకూ 15 కి.మీ. వరకే ఉండేది. ఇప్పుడు ఈ అధికార పరిధిని 50 కి.మీలకు విస్తరించారు.  దేశ సరిహద్దుల్లో డ్రోన్ల ద్వారా ఆయుధాలు డ్రాప్ చేయడం వంటి ఘటనల నేపథ్యంలో బీఎస్‌ఎఫ్‌ అధికార పరిధిని మరింత విస్తృతం చేసినట్లు కేంద్ర హోంశాఖ సోమవారం విడుదల చేసిన గెజట్ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఆ మేరకు బీఎస్ఎఫ్ అధికార పరిధికి సంబంధించి 2014 జులైలో విడుదల చేసిన నోటిఫికేషన్‌లో సవరణ చేసినట్లు తెలిపింది. దేశ భద్రత బలోపేతానికి, డ్రగ్స్ అక్రమ రవాణాను నిలువరించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొంది.

అయితే కేంద్ర హోం శాఖ తీసుకున్న నిర్ణయం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమంటూ కాంగ్రెస్ పాలిత పంజాబ్, తృణమూల్ కాంగ్రెస్ పాలిత పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు అభ్యంతరాలు తెలిపాయి.  కేంద్ర బలగాల ముసుగులో రాష్ట్రాల అధికారాల్లో జోక్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. కేంద్ర హోం శాఖ నిర్ణయం సరికాదని పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ అభ్యంతరం చెప్పారు. తమ రాష్ట్రంలో బీఎస్ఎఫ్ పరిధిని విస్తరించడం పట్ల అభ్యంతరం వ్యక్తంచేసిన ఆయన.. ఇది సమాఖ్య స్ఫూర్తిపై జరిగిన ప్రత్యక్ష దాడిగా ఆయన అభివర్ణించారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కోరినట్లు ట్విట్టర్‌లో వెల్లడించారు.

పంజాబ్ సీఎం చన్నీ ట్వీట్..

అటు శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. బీఎస్ఎఫ్ అధికార పరిధిని విస్తృతం చేయడం ద్వారా పంజాబ్‌లో కేంద్ర ప్రభుత్వం పరోక్ష పాలన సాగించాలని చూస్తోందని ఆక్షేపించారు. అయితే పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. దేశ సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ అధికార పరిధి పెంపు మన దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. రాజకీయాల్లోకి సైనిక దళాలను లాగడం సరికాదని అమరీందర్ సింగ్ పేర్కొన్నారు.

Bsf 1

BSF

అటు పశ్చిమ బెంగాల్ రవాణా శాఖ మంత్రి ఫిర్హద్ హఖీం కేంద్ర హోం శాఖ నిర్ణయాన్ని ఖండించారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. శాంతి భద్రతల రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమన్నారు. అయితే కేంద్ర బలగాల ముసుగులో రాష్ట్రాలను నియంత్రించాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు.

అయితే బీజేపీ పాలిత అసోం రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర హోం శాఖ తాజా ఉత్తర్వులపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తంచేయలేదు.

Also Read..

Dr.Manmohan Singh Health: మన్మోహన్ త్వరగా పూర్తి ఆరోగ్యవంతులు కావాలి.. ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్!

Electricity Crisis: విద్యుత్ కొరతపై రాష్ట్రాలకు కేంద్రం షాక్.. లైవ్ వీడియో

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Telugu