లడఖ్‌లో ఇంజినీరింగ్ అద్భుతం.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కంటే ఎత్తులో రోడ్డు.. BRO ఘనత..
సరిహద్దుల్లో రోడ్లు వేసే సంస్థ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ భారీ రికార్డు సృష్టించింది. తూర్పు లడఖ్‌లోని మిగ్ లా పాస్ వద్ద 19,400 అడుగుల ఎత్తులో రోడ్డు నిర్మాణం పూర్తి చేసి, ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డుగా రికార్డు సృష్టించింది. ఈ రోడ్డు దేశ సైనికులకు వ్యూహాత్మకంగా, పర్యాటకులకు కొత్త దారులను తెరిచే ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పొచ్చు.

దేశ సరిహద్దు ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఒక చారిత్రక ఘనతను సాధించింది. తూర్పు లడఖ్‌లో 19,400 అడుగుల ఎత్తులో ఉన్న మిగ్ లా పాస్ వద్ద రోడ్డు నిర్మించింది. దీంతో ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన రోడ్డుగా నిలిచింది. ఇంతకు ముందు ఈ రికార్డు BRO వేసిన ఉమ్లింగ్ లా (19,024 అడుగులు) పేరిట ఉండేది.
ఇంజనీరింగ్ అద్భుతం
ప్రాజెక్ట్ హిమాంక్ ద్వారా ఈ రోడ్డు వేశారు. ఈ రోడ్డు కేవలం ఒక మార్గం మాత్రమే కాదు.. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే మానవ ధైర్యానికి అద్భుతమైన చిహ్నం. దీని ఎత్తు ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కంటే ఎక్కువ కావడం గమనార్హం. ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ బ్రిగేడియర్ విశాల్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. “రికార్డులు బద్దలు కొట్టడం మా ముఖ్య లక్ష్యం కాదు. మా సైనికులకు, ప్రజలకు మంచి రోడ్లు ఇవ్వడమే ముఖ్యం. రికార్డులు వచ్చినా, రాకపోయినా మా పని మేము చేస్తాం” అని చెప్పారు.
దేశానికి ఇది ఎందుకు ముఖ్యం..?
ఈ లికారు-మిగ్ లా-ఫుక్చే రోడ్డు మన దేశ సరిహద్దుల్లో చాలా ముఖ్యమైనది. ఇది CDFD లాంటి ముఖ్యమైన సరిహద్దు గ్రామాలను కలుపుతుంది. ఈ రోడ్లు వేయడం వలన యుద్ధ సమయాల్లో మన సైన్యానికి త్వరగా మూవ్‌మెంట్ సాధ్యమవుతుంది. BRO డీజీ లెఫ్టినెంట్ జనరల్ రఘు శ్రీనివాసన్ మాట్లాడుతూ.. సరిహద్దుల్లోని ప్రాంతాల అభివృద్ధికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పారు.
సవాలుతో కూడిన పని
ఇంత ఎత్తులో రోడ్డు వేయడం మామూలు విషయం కాదు. చలికాలంలో ఇక్కడ ఉష్ణోగ్రత -40°Cకి పడిపోతుంది. అందుకే సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే పని చేయగలుగుతారు. ఈ రోడ్డు 2028 మార్చి నాటికి పూర్తిగా తారు వేసి, వాహనాలు తిరగడానికి వీలుగా మారుతుందని అధికారులు చెప్పారు. BRO ఇప్పటికే ప్రపంచంలోని ఎత్తైన 14 రోడ్ పాస్‌లలో 11 నిర్మించింది.
పర్యాటకులకు కొత్త ప్రాంతం
ఈ అద్భుతమైన రోడ్డు పూర్తి కావడం వలన, సాహస యాత్రలు చేసే వారికి, డ్రైవింగ్ ఇష్టపడే వారికి ఈ ప్రాంతం కొత్తగా అందుబాటులోకి వస్తుంది. ఈ కొత్త మార్గం ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు చేస్తుందని భావిస్తున్నారు. మిగ్ లా పాస్ కేవలం రోడ్డు మాత్రమే కాదు, మన దేశ సైనికులు, ఇంజనీర్ల ధైర్యానికి, నైపుణ్యానికి ఒక నిదర్శనం అని చెప్పవచ్చు.
News9 మాత్రమే..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటారు మార్గంగా నిలిచిన శక్తివంతమైన మిగ్ లా పాస్ రహదారి నిర్మాణ ప్రయాణాన్ని TV9 నెట్‌వర్క్‌కు చెందిన News9 దగ్గరగా కవర్ చేసింది. ఆగస్టు 2023లో జరిగిన ఈ కీలకమైన రహదారి శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రపంచానికి చూపించింది. జాతీయ గర్వం, దృఢ సంకల్పానికి నిదర్శనమైన ఈ ఇంజనీరింగ్ మైలురాయిని News9 ప్రత్యేకంగా ప్రపంచానికి అందించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




