Gold Price: సంక్రాంతి తర్వాత బంగారం ధరలు తగ్గుతాయా.. అసలు నిజం ఏంటంటే..?
పసిడి పరుగుకు బ్రేకులు పడటం లేదు.. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొత్త శిఖరాలను తాకుతున్నాయి. కేవలం 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 1.44 లక్షల మార్కును దాటేసి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. అసలు పసిడి ఎందుకు ఇంతలా మండుతోంది? సంక్రాంతి తర్వాత ధరలు తగ్గే అవకాశం ఉందా..? అని తెలుసుకుందాం..

బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మునుపెన్నడూ చూడని ఆల్‌టైమ్ హై రికార్డులను సృష్టిస్తోంది. మార్కెట్‌లో బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. జనవరి 13న 24 క్యారెట్ల బంగారం రూ. 1,44,211 గా ఉంటే.. 22 క్యారెట్ల బంగారం రూ. 1,31,377గా ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో్ ఒక ఔన్స్ బంగారం ధర రికార్డు స్థాయిలో 4,600 డాలర్లకు చేరుకుంది.
ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై చేస్తున్న హెచ్చరికలు, వెనిజులా అధ్యక్షుడి అరెస్ట్ వంటి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో భయాందోళనలు రేకెత్తించాయి. స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొనడంతో, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు మళ్లిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా ప్రకారం.. త్వరలోనే ఒక ఔన్స్ బంగారం ధర 5,000 డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది.
ధరలు తగ్గే అవకాశం ఉందా?
టెక్నికల్ పరంగా చూస్తే.. ప్రస్తుతం బంగారం ధరలు ఓవర్ బాట్ పొజిషన్‌లో ఉన్నాయి. ఆర్‌ఎస్‌ఐ ఇండికేటర్ 70 పైన ఉండటంతో, నిపుణులు కొన్ని కీలక అంచనాలు వేస్తున్నారు. వాటి ప్రకారం.. సంక్రాంతి పండుగ తర్వాత ధరల్లో స్వల్పంగా తగ్గుదల కనిపించే అవకాశం ఉంది. ఒకవేళ ధరలు తగ్గినా అది కేవలం 10 శాతం వరకు మాత్రమే ఉండవచ్చు. అంటే ఇది భారీ పతనం కాదని, కేవలం స్వల్పకాలిక సర్దుబాటు మాత్రమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
