AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trivikram: మ్యూజిక్‌ను ఆపేసరికి త్రివిక్రమ్ ఒక మాట అన్నాడు.. కానీ.! నేను చేసింది కరెక్టే..

ఆర్.పి. పట్నాయక్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తన స్నేహాన్ని, కలిసి పనిచేయకపోవడానికి గల కారణాలను వెల్లడించారు. సినిమా విజయంలో సంగీత ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన ఆర్.పి., తన సంగీతం వల్ల మార్కెట్ అవ్వట్లేదన్న వ్యాఖ్యతో సంగీతం ఆపేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయాన్ని త్రివిక్రమ్, కోటి తీవ్రంగా వ్యతిరేకించారని పేర్కొన్నారు.

Trivikram: మ్యూజిక్‌ను ఆపేసరికి త్రివిక్రమ్ ఒక మాట అన్నాడు.. కానీ.! నేను చేసింది కరెక్టే..
Trivikram
Ravi Kiran
|

Updated on: Mar 18, 2026 | 1:28 PM

Share

ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తన బంధం, వృత్తిపరమైన సహకారం లేకపోవడం, తన సంగీతం కెరీర్‌ను విడిచిపెట్టడానికి దారితీసిన సంఘటనలు, పరిశ్రమలోని మారుతున్న పోకడల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తనకు స్నేహం ఉందని ఆర్.పి. పట్నాయక్ స్పష్టం చేశారు. తామిద్దరం కలిసి పనిచేయకపోవడంపై బయట వ్యక్తులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని, అయితే అలాంటి అపోహలు అవసరం లేదని ఆయన కొట్టిపారేశారు. “శీను కథ చేసినప్పుడు, ఈ కథకి ఆర్.పి. అయితే బాగుంటదని తను అనుకున్నప్పుడు నాకు డెఫినిట్‌గా పిలుస్తాడు. అలాంటి కథ వచ్చినప్పుడు తను పిలిచినప్పుడు నేను వెళ్తాను” అని ఆయన వివరించారు.

సంగీత దర్శకుడి ఎంపిక అనేది కేవలం దర్శకుడి నిర్ణయం మాత్రమే కాదని, అందులో హీరో, నిర్మాత వంటి పలువురి ప్రమేయం ఉంటుందని ఆర్.పి. పట్నాయక్ పేర్కొన్నారు. “ఆర్.పి. పట్నాయక్ ని మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకోవాలి అంటే త్రివిక్రమ్ ఒక్కడి డెసిషన్ ఉండదు. అక్కడొక హీరో ఉంటాడు, ఒక ప్రొడ్యూసర్ ఉంటాడు, ఒక చాలా మంది ఉంటారు” అని ఆయన తెలిపారు. సినిమాకు 100 శాతం న్యాయం చేసే వారికే అవకాశం ఇవ్వాలనే సూత్రాన్ని తాను గట్టిగా నమ్ముతానని, అక్కడ సినిమా ముఖ్యమే గానీ వ్యక్తులు కాదని ఆయన నొక్కిచెప్పారు. ఈ సిద్ధాంతం వల్లే తాను ఎప్పుడూ అవకాశాల కోసం ఎవరి దగ్గరికీ వెళ్ళలేదని ఆర్.పి. పట్నాయక్ స్పష్టం చేశారు.

తన గత కెరీర్ గురించి మాట్లాడుతూ, 2002లో తాను నిరంతరం పనిచేసేవాడినని, ఉదయం 4 గంటలకు ఇంటికి వెళ్లి మళ్ళీ 7 గంటలకు రికార్డింగ్‌లకు వచ్చేవాడినని, కొన్నిసార్లు స్టూడియోలలోనే నిద్రపోయేవాడినని గుర్తుచేసుకున్నారు. తాను ఎన్ని సినిమాలు చేశానో లెక్కపెట్టలేదని, అయితే చార్ట్‌బస్టర్‌లలో ఒకేసారి తన మూడు పాటలు టాప్ 3లో నిలిచిన ఒక సందర్భాన్ని తన కెరీర్‌లో అత్యంత గర్వించదగిన క్షణంగా అభివర్ణించారు. సంతోషం సినిమాకు సంగీతం అందించినప్పుడు నాగార్జున తన పాటలను విని “ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్ళిపోయారు?” అని అడిగిన విషయాన్ని పంచుకున్నారు. ఈ మాట తన పనికి లభించిన గొప్ప గుర్తింపు అని ఆయన భావించారు. దర్శకుడు దశరథ్‌తో తనకున్న అనుబంధం గురించి కూడా ప్రస్తావించారు. త్రివిక్రమ్, సునీల్‌లతో పాటు తాను రూమ్‌మేట్స్‌గా ఉన్న సమయంలో దశరథ్, గోపి మోహన్, జేకే(కెమెరామెన్) తమ నైబరింగ్ రూమ్‌లో ఉండేవారని చెప్పారు.

సంగీత దర్శకత్వానికి దూరమవ్వాలనే తన నిర్ణయం వెనుక గల కారణాన్ని వివరించడానికి ఆర్.పి. పట్నాయక్ నిరాకరించారు. “నీ మ్యూజిక్ వల్ల సినిమాకి మార్కెట్ అవ్వట్లేదు” అని ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్య తనను తీవ్రంగా బాధించిందని, ఆ వ్యాఖ్యతోనే తాను సంగీతానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తన ఈ నిర్ణయాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడు కోటి తీవ్రంగా వ్యతిరేకించి, “ఎందుకు అంత బ్లంట్ డెసిషన్ తీసుకుంటున్నావు” అని క్లాస్ పీకారని ఆర్.పి. పట్నాయక్ వెల్లడించారు. అయినప్పటికీ, తాను సరైన నిర్ణయమే తీసుకున్నానని భావించడంతో ఎవరి మాట వినలేదని పేర్కొన్నారు.

Follow Us