AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sumalatha: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫుల్ ఫోకస్.. కమలం పార్టీలో చేరనున్న ఎంపీ సుమలత!

Karnataka Assembly Election 2023: వచ్చే ఏడాది జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై కమలనాథులు ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టారు. ఆ రాష్ట్రంలో మళ్లీ అధికారాన్ని తగ్గించుకునేందుకు పక్కా వ్యూహాలతో సన్నద్ధమవుతున్నారు.

Sumalatha: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫుల్ ఫోకస్.. కమలం పార్టీలో చేరనున్న ఎంపీ సుమలత!
Sumalatha Ambareesh
Janardhan Veluru
|

Updated on: Apr 29, 2022 | 5:22 PM

Share

Karnataka Assembly Election 2023: వచ్చే ఏడాది జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై కమలనాథులు ఇప్పటి నుంచే ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆ రాష్ట్రంలో మళ్లీ అధికారాన్ని తగ్గించుకునేందుకు పక్కా వ్యూహాలతో సన్నద్ధమవుతున్నారు. మొత్తం 225 స్థానాల్లో 150 స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. కర్ణాటకలో బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచన చేస్తోందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఎన్నికల వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ,  జనతా దళ్ – సెక్యులర్ (JD-S) నుంచి భారీ సంఖ్యలో నేతలను పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. మరీ ముఖ్యంగా పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్, జేడీఎస్ నుంచి తరలి వచ్చే వలసల ద్వారా ఆ ప్రాంతాలపై పట్టుబగించాలని యోచిస్తోంది.

ఇందులో భాగంగా ఓల్డ్ మైసూరు ప్రాంతంపై బీజేపీ ప్రత్యేక దృష్టిసారించినట్లు వినికిడి. ఆ ప్రాంతంలో జేడీఎస్ బలంగా ఉంది. మాండ్యా స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీష్‌(MP Sumalatha Ambareesh)తో పాటు మరికొందరు ప్రతిపక్ష నేతలను పార్టీలో చేర్చుకోవాలని కర్ణాటక బీజేపీ నేతలు భావిస్తున్నారు. బీజేపీలో చేరేందుకు సుమలత సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. మే మూడో వారంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో ఆమె తన మద్ధతుదారులతో కలిసి బీజేపీ తీర్థంపుచ్చుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. పాత మైసూరు ప్రాంతంలో ఎన్నికల సన్నాహక ర్యాలీని మే 15 తర్వాత నిర్వహించాలని కర్ణాటక బీజేపీ సీనియర్లు భావిస్తున్నారు. ఈ ర్యాలీలో అమిత్ షా పాల్గొంటారని సమాచారం. అంతకు ముందే బెంగుళూరులో మే 3న జరిగే ఖేలో ఇండియా గేమ్స్ ముగింపు వేడుకలో పాల్గొనేందుకు అమిత్ షా బెంగుళూరులో పర్యటించనున్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో సుమలత స్వతంత్ర అభ్యర్థిగా మాండ్యా నుంచి పోటీ చేసి మాజీ ప్రధాని దేవె గౌడ మనువడు నిఖిల్ కుమారస్వామిపై విజయం సాధించారు. బీజేపీలో చేరేందుకు తన తనయుడు, నటుడు అభిషేక్ అంబరీష్‌కు మద్దూర్ నియోజకవర్గం టిక్కెట్ ఇవ్వాలని సుమలత బీజేపీని కోరినట్లు తెలుస్తోంది.

బీజేపీలో చేరే విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని.. తన మద్ధతుదారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు గురువారంనాడు సుమలత మాండ్యాలో మీడియాకు తెలిపారు. అంబరీష్ 25 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నారని.. ఆయనకు అన్ని పార్టీల్లోనూ మిత్రులు ఉన్నారని చెప్పుకొచ్చారు. తమ పార్టీలో చేరాలంటూ దాదాపు అన్ని పార్టీల నుంచి తనకు అనధికారిక ఆహ్వానం ఉన్నట్లు చెప్పారు. అయితే తమ మద్ధతుదారు అభిప్రాయం, ఆమోదం మేరకు ఏ పార్టీలో చేరాలన్న దానిపై తుది నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

గతంలో సుమలత కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆమె తనయుడికి మద్దూరు నియోజకవర్గ టిక్కెట్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ నుంచి హామీ లభించకపోవడంతో ఆమె బీజేపీ వైపు చూస్తున్నట్లు కన్నడ రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మద్దూర్ అసెంబ్లీ టిక్కెట్‌ను మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ మేనళ్లుడు ఎస్ గురుచరణ్ ఆశిస్తున్నందున కాంగ్రెస్ ఆయన వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. బీజేపీ నేతలతో సుమలత చర్చలు జరుపుతుండటా.. ఇప్పటికే ఆమె మద్ధతుదారులు మద్దూరు నియోజకవర్గంలోని స్థానిక బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ముందు ముందు కాంగ్రెస్, జేడీఎస్ నుంచి భారీ ఎత్తున బీజేపీకి వలసలు ఉంటాయని కర్ణాటక రెవిన్యూ శాఖ మంత్రి ఆర్ అశోక బుధవారంనాడు మాండ్యాలో మీడియాకు తెలిపారు. సుమలత కూడా త్వరలోనే బీజేపీలో చేరుతారని చెప్పుకొచ్చారు. కుటుంబ రాజకీయాలతో విసిగిపోయిన చాలా మంది జేడీఎస్ నేతలు బీజేపీలో చేరేందుకు ముందుకొస్తున్నట్లు తెలిపారు. ఓల్డ్ మైసూరు ప్రాంతానికి చెందిన కనీసం కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ తమ పార్టీలో చేరుతారని క్రీడా శాఖ మంత్రి కేసీ నారాయణ గౌడ మీడియాకు వెల్లడించారు. వారు తమతో టచ్‌లో ఉన్నారని..ఎవరు, ఎప్పుడు బీజేపీలో చేరుతారన్నది త్వరలోనే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. (Source)

Also Read..

Viral Video: యమపాశంలా దూసుకువచ్చిన బండ రాయి.. క్షణకాలంలో ఊహించని విషాదం..

Indian Railway: అర్థాంతరంగా రద్దవుతున్నాయి.. ఆలస్యంగా గమ్య స్థానాలకు చేరుతున్నాయి.. రైల్వే తీరుతో ప్రయాణికులు సతమతం