సిద్దార్థ్ నేరస్థుడు, అతడ్ని మేమెందుకు బెదిరిస్తాం, బీజేపీ నేతల ఎదురు దాడి, పట్టించుకోవద్దని కార్యకర్తలకు హితవు
ప్రధాని మోదీని అగౌరవ పరిచే నటుడు సిద్దార్థ్ తరచూ నేరాలు చేసేవాడని, అతడిని తామెందుకు బెదిరిస్తామని తమిళనాడు బీజేపీ నేతలు అంటున్నారు.
ప్రధాని మోదీని అగౌరవ పరిచే నటుడు సిద్దార్థ్ తరచూ నేరాలు చేసేవాడని, అతడిని తామెందుకు బెదిరిస్తామని తమిళనాడు బీజేపీ నేతలు అంటున్నారు. తనకు బీజేపీ కార్యకర్తల నుంచి బెదిరింపు కాల్స్ అందుతున్నాయని సిద్దార్థ్ ఆరోపించిన సంగతి విదితమే. అయితే ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని తమిళనాడు ఐటీ విభాగం చీఫ్ నిర్మల్ కుమార్ స్పష్టం చేశారు. అతని ఆరోపణలను పట్టించుకోరాదని ఆయన తమ పార్టీ సభ్యులు, కార్యకర్తలను కోరారు. ఈ కోవిడ్ పాండమిక్ సమయంలో తాము బాధితులకు ఆహారం, మందులు తదితరాలను అందించే కృషిలో నిమగ్నమై ఉన్నామని, తమ పనులకు విఘాతం కలిగించరాదని ఆయన ట్వీట్ చేశారు. సిద్దార్థ్ వంటి వ్యక్తులు కేవలం సమయాన్ని వృధా చేసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తుంటారని నిర్మల్ కుమార్ విమర్శించారు. ప్రధాని మోదీని, హోమ్ మంత్రి అమిత్ షాను, చివరకు ముఖ్యమంత్రిని కూడా సిద్దార్థ్ విమర్శిస్తుంటాడని బీజేపీ నేత నారాయణ్ తిరుపతి కూడా దుయ్యబట్టారు. లోగడ తాను అతనిపై కోర్టులో కేసు పెట్టానని ఆయన తెలిపారు. ఇష్టం వచ్చినట్టు ప్రముఖులను అదే పనిగా ద్వేషించడం మానుకోవాలని ఆయన సిద్దార్థ్ కి సూచించారు.
తమిళనాడు బీజేపీ ఐటీ విభాగం తన ఫోన్ నెంబరును లీక్ చేసిందని, అప్పటి నుంచి తనకు బెదిరింపు కాల్స్ అందుతున్నాయని సిద్దార్థ్ ఆరోపించాడు. తన కుటుంబ సభ్యులను రేప్ చేస్తామని, తనను హతమారుస్తామని బెదిరిస్తున్నారని, రోజూ తనకు 500 కాల్స్ వస్తున్నాయని అంటూ ఈ నటుడు సంచలనం రేపాడు. బీజేపీ లింక్ తో కూడి తనకు అందిన అన్ని ఫోన్ నెంబర్లను రికార్డు చేసి పోలీసులకు అందజేశానని ఆయనతెలిపాడు. తాను చేసిన ట్వీట్స్ ఎవరినీ కించపరిచేవి కావన్నారు.