శరద్ పవార్‌కు బిజెపి బంపర్ ఆఫర్.. అత్యున్నత పదవికి రెడీనా?
ముఖ్యమంత్రి పీఠం కోసం పట్టుబట్టి బిజెపికి దూరమైన శివసేన భారీ మూల్యం చెల్లించుకుంది. అదే సమయంలో మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో కీలక రోల్ పోషిస్తున్నశరద్ పవార్‌కు అనూహ్యమైన అదృష్టం వరించబోతోందా? పరిస్థితులు, పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ముఖ్యమంత్రి పీఠం ఆశించి, ఫలితాలు వెల్లడవుతున్న తరుణంలోనే పేచీ మొదలు పెట్టిన శివసేన.. మూడు దశాబ్దాల మైత్రిని ఫణంగా పెట్టేసింది. బిజెపితో చిరకాల మిత్రబంధాన్ని ముఖ్యమంత్రి పీఠం కోసం తెంచుకుంది శివసేన అధినాయకత్వం. అదే సమయంలో కేంద్రంలోని ఎన్డీయే […]
ముఖ్యమంత్రి పీఠం కోసం పట్టుబట్టి బిజెపికి దూరమైన శివసేన భారీ మూల్యం చెల్లించుకుంది. అదే సమయంలో మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో కీలక రోల్ పోషిస్తున్నశరద్ పవార్‌కు అనూహ్యమైన అదృష్టం వరించబోతోందా? పరిస్థితులు, పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.
ముఖ్యమంత్రి పీఠం ఆశించి, ఫలితాలు వెల్లడవుతున్న తరుణంలోనే పేచీ మొదలు పెట్టిన శివసేన.. మూడు దశాబ్దాల మైత్రిని ఫణంగా పెట్టేసింది. బిజెపితో చిరకాల మిత్రబంధాన్ని ముఖ్యమంత్రి పీఠం కోసం తెంచుకుంది శివసేన అధినాయకత్వం. అదే సమయంలో కేంద్రంలోని ఎన్డీయే కూటమి నుంచి కూడా బయటికి వచ్చేసింది.
బిజెపి కాదంటే ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీలు ఎగిరి గంతేసి మరీ మద్దతిస్తాయని పగటి కలలు కన్న శివసేన, ఆ రెండు పార్టీలు ఆడిన రాజకీయ చదరంగంలో పావుగా మిగిలే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే శివసేన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిగా మారింది. అటు కేంద్రంలో మంత్రి పదవులు కోల్పోయి, ఇటు రాష్ట్రంలో ఏకాకిగా మిగిలిపోయే పరిస్థితి తలెత్తింది. దానికి తోడు హిందుత్వంలో బిజెపి కంటే హార్డ్‌కోర్ అన్న పేరును కోల్పోయే ప్రమాదం కూడా కనిపిస్తోంది. అదే జరిగితే ఆ పార్టీ ఓటు బ్యాంకులో చెప్పుకోదగిన స్థాయిలో చీలిక ఖాయం. శివసేనతో కలిసేందుకు కాంగ్రెస్ పార్టీ ససేమిరా అనడంతో శరద్ పవార్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి.
మరోవైపు శివసేనతో కలిసేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు కనిపించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు అనుకోని అదృష్టం దక్కేలా వుంది. మహారాష్ట్ర రైతు సమస్యల పేరిట ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన శరద్ పవార్‌కు బిజెపి భారీ ఆఫర్ ఇచ్చినట్లు హస్తిన వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఎన్సీపీ గనక ఎన్డీయే కూటమిలోకి వస్తే.. మహారాష్ట్రలో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతోపాటు.. జాతీయ స్థాయిలో కీలకమైన రాజకీయ పరిణామాలకు నాందీ పలుకుతామని బిజెపి నేతలు శరద్ పవార్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే రాష్ట్రపతి ఎన్నికల్లో శరద్ పవార్‌ను ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు కూడా బిజెపి రెడీ అవుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ ఆఫర్లన్నీ స్వయంగా మోదీ నుంచి రావడంతో శరద్ పవర్ సీరియస్‌గానే ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నది పాత సామెత.. ఒక్క దెబ్బకు ఎన్నో పిట్టలు అన్నట్లుగా శరద్ పవార్‌కు బిజెపి ఆఫర్లు కలిసి వచ్చేలా వున్నాయి. అసలే సిబిఐ కేసులతో సతమతమవుతున్న పవార్ ఫ్యామిలీకి బిజెపి ఇచ్చిన ఆఫర్ నక్కతోకను తొక్కినట్లయిందంటున్నారు. కేసుల నుంచి ఉపశమనం లభించడంతోపాటు.. శరద్ పవార్ తనయునికి మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే చాన్స్ వుంది. ఎన్సీపీలో కీలక నేతలకు కేంద్రంలో మంత్రి పదవులు దక్కే అవకాశం కూడా వుంది. అదే సమయంలో ప్రధాని కావాలన్న కోరిక నేరవేర్చుకోలేని శరద్ పవార్.. ఫ్యూచర్‌లో రాష్ట్రపతి అయ్యే ఛాన్స్ కూడా వుంది. ఇలా బిజెపితో కలిస్తే ఎన్సీపీకి పదవుల పంట పండే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో.. కీలక నిర్ణయం తీసుకునే క్రూషియల్ టైమ్ ఇప్పుడు శరద్ పవార్ చేతిలో వుందన్నమాట.