AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మహా’ ట్విస్టులో అసలేం జరిగింది? అర్ధరాత్రి పరిణామాలేంటంటే ?

తెల్లవారితే ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని దేశమంతా అనుకుంది. కానీ తెల్లారగానే పెద్ద షాక్. ఉదయం 8 గంటలకే బిజెపి అతిపెద్ద ఝట్కా ఇచ్చింది. రాజ్‌భవన్‌ తలుపులు తెరవగానే పాత్ర ధారులు మారిపోయారు. ముఖ్యమంత్రిగా దేవేంద్రఫడ్నవీస్.. ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. బిజెపి రాత్రంతా నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్ ఏకంగా ప్రమాణ స్వీకారం పూర్తయ్యేదాకా కనీసం మీడియాకు కూడా లీక్ కాలేదు. ఏకంగా ప్రమాణ స్వీకారం దృశ్యాలను కొన్ని ఏజెన్సీలు ప్రసారం […]

‘మహా’ ట్విస్టులో అసలేం జరిగింది? అర్ధరాత్రి పరిణామాలేంటంటే ?
Rajesh Sharma
| Edited By: Nikhil|

Updated on: Nov 23, 2019 | 12:17 PM

Share

తెల్లవారితే ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని దేశమంతా అనుకుంది. కానీ తెల్లారగానే పెద్ద షాక్. ఉదయం 8 గంటలకే బిజెపి అతిపెద్ద ఝట్కా ఇచ్చింది. రాజ్‌భవన్‌ తలుపులు తెరవగానే పాత్ర ధారులు మారిపోయారు. ముఖ్యమంత్రిగా దేవేంద్రఫడ్నవీస్.. ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. బిజెపి రాత్రంతా నిర్వహించిన సీక్రెట్ ఆపరేషన్ ఏకంగా ప్రమాణ స్వీకారం పూర్తయ్యేదాకా కనీసం మీడియాకు కూడా లీక్ కాలేదు. ఏకంగా ప్రమాణ స్వీకారం దృశ్యాలను కొన్ని ఏజెన్సీలు ప్రసారం చేసే దాకా బిజెపి, ఎన్సీపీ డబుల్ గేమ్ గురించి ఎవరికీ తెలియలేదు.

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెల్లడై సరిగ్గా నెల రోజుల తర్వాత ప్రభుత్వం ఏర్పడింది. తాను ప్రారంభించిన పొలిటికల్ గేమ్‌లో శివసేన ఘోరంగా పరాభవాన్ని మూటగట్టుకుంది. ముఖ్యమంత్రి పీఠం తనదే అనుకున్న ఉద్ధవ్ థాక్రే నుంచి సీఎం సీటును బిజెపి నిర్దాక్షిణ్యంగా, వ్యూహాత్మకంగా లాగేసుకుంది. అయితే.. ఇందులో డబుల్ గేమ్ ఆడిన క్రెడిట్ ఎన్సీపీ అధినేత శరదపవార్‌కు దక్కుతుంది. మూడు రోజుల క్రితం మహారాష్ట్ర రైతు సమస్యల పేరిట ప్రధాని నరేంద్ర మోదీని పార్లమెంటులో కలిసిన శరద్ పవార్.. ఒకవైపు శివసేన, కాంగ్రెస్ పార్టీలతో చర్చలు జరుపుతూనే సీక్రెట్‌గా బిజెపి అధినాయకత్వంతో సమాలోచనలు కొనసాగించి ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్ళినట్లు చెబుతున్నారు.

తెల్లారితే ప్రమాణ స్వీకారం అనుకుని కూల్ నిద్రపోయిన ఉద్ధవ్ థాక్రేకు అర్ధరాత్రి మంత్రాంగంతో బిజెపి, ఎన్సీపీ షాకిచ్చినట్లయింది. వీరిద్దరి మధ్య తెల్లవారు జామున 4 గంటల వరకు చర్చలు కొనసాగినట్లు ముంబయి మీడియా చెబుతోంది. ఆ తర్వాత కుదిరిన అంగీకారాన్ని గవర్నర్‌కు నివేదించడం.. ఉదయం ఏడున్నర కల్లా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎత్తివేయడం.. ఆ వెంటనే గవర్నర్ పిలుపు మేరకు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లు రాజ్‌భవన్‌కు చేరుకోవడం.. ఆ వెంటనే ప్రమాణ స్వీకారం జరిగిపోవడం.. అలా కమ్ అండ్ గో లాగా పూర్తయ్యాయి.

జాతీయ సమీకరణాల్లో మార్పు ‌!

మహారాష్ట్ర పరిణామాలు కేవలం ఆ రాష్ట్రానికే పరిమితమయ్యేలా లేవు. జాతీయ స్థాయిలో రెండు ప్రధాన రాజకీయ కూటముల్లో కూడా మార్పులు జరిగే సంకేతాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. చిరకాలంగా ఎన్డీయేలో కొనసాగుతున్న శివసేన ముఖ్యమంత్రి పీఠం కోసం పట్టుబట్టి ఆ అలియెన్స్‌ నుంచి బయటికి వచ్చేసింది. మరోవైపు తాజాగా బిజెపితో జతకట్టిన ఎన్సీపీ.. కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యుపిఏ నుంచి బయటకు రావడమే ఇక మిగిలింది. తాజా పరిణామాలతో కేవలం శివసేన ఒక్కటే కాదు.. కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద షాక్‌గానే భావించాలి. యుపిఏలో కాంగ్రెస్ పార్టీకి అత్యంత విశ్వసనీయ మిత్రపక్షం ఎన్సీపీ.. ఒక్కసారిగా బిజెపితో జతకట్టడం సోనియా గాంధీకి పెద్ద షాక్‌ అనే చెప్పాలి. సో.. ఎన్డీయే నుంచి శివసేన అవుట్.. యుపిఏ నుంచి ఎన్సీపీ అవుట్.. ఇలా జాతీయ పరిణామాల్లో మార్పులకు మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు దారితీసే అవకాశాలున్నాయి.

అయితే.. శరద్ పవార్ అనూహ్యంగా ఈ పరిణామాలతో తనకేం సంబంధం లేదని, నిర్ణయం పూర్తిగా అజిత్ పవార్ వ్యక్తిగతమని చెప్పడం కొసమెరుపుగా నిలుస్తోంది. రాబోయే కొన్ని గంటల్లో జరిగే పరిణామాలపై ఉత్కంఠకు శరద్ పవార్ ట్వీట్ తెరలేపింది.