AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీహార్‌లో అధికారం వారిదే.. తేల్చిన ఎగ్జిట్ పోల్స్

ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కేదెవరికో తేలుస్తున్నాయి ఎగ్జిట్ పోల్ సర్వేలు. మూడో విడత పోలింగ్ ముగిసిన వెంటనే పీపుల్స్ పల్స్ - పీఎస్టీ సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే నివేదిక వెల్లడైంది.

బీహార్‌లో అధికారం వారిదే.. తేల్చిన ఎగ్జిట్ పోల్స్
Rajesh Sharma
|

Updated on: Nov 07, 2020 | 7:09 PM

Share

Bihar winner in exit polls: పలు జాతీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీహార్ ఎన్నికల మూడో, ఆఖరు విడత పోలింగ్ శనివారం ముగిసింది. మూడు విడతల పూర్తి అయిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ సర్వేల వెల్లడి మొదలైంది. అయితే పీపుల్స్ పల్స్ -పీఎస్జీ సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో ఆర్జేడీ సారథ్యంలోని మహా ఘట్ బంధన్‌ వైపే బీహారీలు మొగ్గుచూపినట్లు తేలింది. ఈ ఎన్నికల్లో మహాఘట్ బంధన్ (కాంగ్రెస్-ఆర్జేడీ-వామపక్ష కూటమి)కే స్వల్ప ఆధిక్యత లభించే అవకాశం వుందని పీపుల్స్ పల్స్ – పీఎస్జీ ఎగ్జిట్ పోల్ సర్వే తేల్చింది.

రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీకి 85-95 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 15- 20, ఎల్‌జేపీకి 3-5, వామపక్షాలకు 3-5 సీట్లు వస్తాయని సర్వే నిర్వాహకులు వెల్లడించారు. బీజేపీకి 65-75 సీట్లు దక్కుతాయని.. అధికారంలో వున్న జేడీ(యూ) 25-35 సీట్లకే పరిమితమవుతుందని పేర్కొన్నారు. జీడీఎస్ఎఫ్ & ఇండిపెండెంట్లు 5-13 సీట్లు సాధించే అవకాశం వుందన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత చాపకింద నీరులా మారితే మహాఘట్ బంధన్ ఇంకా ఎక్కువ సీట్లు సాధించే అవకాశముందని సర్వే నిర్వాహకులు తెలిపారు.

బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్ వైపు 36 శాతం, నితీష్ కుమార్ వైపు 34 శాతం మంది ఓటర్లు మొగ్గు చూపారు. ఎన్నికల్లో అత్యధిక ప్రభావం చూపిన సమస్యల్లో నిరుద్యోగం (31%), ధరల పెరుగుదల (28%), వలసలు (19%), వరదలు (12%), ఎంఎస్‌పీ (9%) మరియు ఇతర సమస్యలు (1%) వున్నట్లు పేర్కొన్నారు. తేజస్వీ యాదవ్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు ఓటర్లను బాగా ప్రభావితం చేశాయి. 10 లక్షల ఉద్యోగాల భర్తీ హామీ యువతను బాగా ఆకట్టుకుందని తేల్చారు.

ముస్లిం, యాదవ సామాజికవర్గాల్లో అత్యధిక ఓటర్లు ఆర్జేడీ వైపే మొగ్గు చూపినట్లు సర్వేలో తేలిందన్నారు. భూమిహార్ల సామాజికవర్గం సహా ఉన్నత కులాల ఓటర్లు సైతం గణనీయమైన సంఖ్యలో జేడీ (యూ)కి దూరమైనట్లు సర్వే నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో దివంగత రాం విలాస్ పాశ్వాన్ తనయుడు చిరాగ్ పాశ్వాన్ ప్రభావం పెద్దగా కనిపించలేదని తేల్చారు. అంతిమంగా చిరాగ్ పాశ్వాన్ ప్రచారం మహాఘట్ బంధన్‌కే ఎక్కువగా లాభించినట్లుగా గ్రౌండ్ స్థాయిలో కనిపించినట్లు సర్వే నివేదిక పేర్కొంది.

పాట్నా, నలందాతోపాటు వాయువ్య భోజ్‌పురి, బజ్జికా, మైథిలి, ఆంజిక మాట్లాడే ప్రాంతాల్లో జేడీయూకి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం వుందని, పలు చోట్ల ఎన్డీయే కూటమి ఓట్లకు తిరుగుబాటు, స్వతంత్ర్య అభ్యర్ధులు గండి కొట్టినట్లు కనిపిస్తుందని పీపుల్స్ పల్స్ – పీస్టీ ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్టు అభిప్రాయపడింది. మొత్తం 61 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 305 పోలింగ్ స్టేషన్లలో పీపుల్స్ పల్స్ – పీఎస్జీ సంయుక్తంగా ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహించింది.

ALSO READ: కేంద్రం ఒక్క పైసా ఇవ్వలే.. మండిపడ్డ కేసీఆర్

ALSO READ: సినీ లవర్స్‌కు కేసీఆర్ ఒకే రోజు 2 గుడ్‌న్యూస్

ALSO READ: జీహెచ్ఎంసీ వినూత్న ప్రయోగం.. ‘ఆ’ వ్యర్థాలకు రీసైక్లింగ్‌తో చెక్

ALSO READ: జీహెచ్ఎంసీకి హడ్కో అవార్డు.. కేటీఆర్ ప్రశంస

ALSO READ: నాగేంద్రకు 14 రోజుల రిమాండ్