పెళ్లైన రెండు రోజులకే గదిలో విగతజీవులుగా పడి ఉన్న కొత్త జంట..! కారణం అదేనా?
బీహార్‌లోని వైశాలి జిల్లాలో జరిగిన ఒక విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక నూతన జంట వివాహం చేసుకున్న రెండు రోజుల తర్వాత విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

బీహార్‌లోని వైశాలి జిల్లాలో ఒక విషాద సంఘటన వెలుగులోకి వచ్చింది. హాజీపూర్ గంగాబ్రిడ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని నవాడా కలాన్ గ్రామంలో వివాహం అయిన రెండు రోజులకే కొత్త జంట విగతజీవులుగా పడి ఉన్నారు. తమ స్నేహితుడి ఇంట్లో కొత్తగా పెళ్లైన జంట విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపారు.
మృతుడిని నవాడా కలాన్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల పప్పు కుమార్ గా గుర్తించారు. మృతురాలి పేరు ప్రియా గుప్తా. పోలీసుల సమాచారం ప్రకారం, పప్పు కుమార్ కంప్యూటర్ క్లాస్ నడిపేవాడు. ఈ సమయంలో, అతను ప్రియా గుప్తాతో ప్రేమలో పడ్డాడు. వారిద్దరూ జూన్ 12న వైశాలిలోని మహానార్ బ్లాక్‌లోని శివాలయంలో వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత, పప్పు తన భార్య ప్రియతో కలిసి వైశాలి జిల్లాలోని లాల్‌గంజ్‌కు వెళ్లాడు. అమ్మాయి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేస్తుందని పప్పు భయపడి, ప్రేమికులిద్దరూ తమ స్నేహితుడు మిథిలేష్ ఇంటికి వెళ్లారు.
మిథిలేష్ ఇంట్లో భార్యాభర్తలిద్దరూ భోజనం చేసి నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం పప్పు సోదరి మిథిలేష్ కు ఫోన్ చేసింది. ఇద్దరూ మంచం మీద కాకుండా నేలపై నిద్రపోతున్నారని మిథిలేష్ చెప్పాడు. అయితే ఎంతకీ వారి నుంచి స్పందన రాకపోవగంతో లోపలి నుండి లాక్ చేసిన తలుపు ఏదో విధంగా తెరిచి చూసేసరికి ప్రియా గుప్తా చనిపోయి కనిపించింది. పప్పు అపస్మారక స్థితిలో ఉన్నాడు. స్థానికులు పప్పును చికిత్స కోసం హాజీపూర్ సదర్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యలో అతను కూడా మరణించాడు.
దీని తరువాత, మరణించిన పప్పు కుమార్ కుటుంబ సభ్యులు ఇద్దరి మృతదేహాలను తమతో తీసుకెళ్లారు. స్థానిక ప్రజలు ఈ సంఘటన గురించి గంగాబ్రిడ్జి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న గంగాబ్రిడ్జి పోలీస్ స్టేషన్ మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం హాజీపూర్ సదర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలావుంటే, ఈ కేసులో, మృతుడి సోదరితో సహా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన కారణంగా, మొత్తం ప్రాంతంలో వివిధ రకాల చర్చలు జరుగుతున్నాయి. వైశాలి జిల్లాలోని మహానార్‌లోని నోటరీ పబ్లిక్ మేజిస్ట్రేట్ ముందు ఇద్దరు ప్రేమికులు పారిపోయి వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని అఫిడవిట్ ద్వారా ప్రకటించారని చెబుతున్నారు. పోలీసులు మొత్తం విషయాన్ని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
