Samosa: సమోసా కోసం లొల్లి.. వ్యక్తిని కత్తితో కొట్టి చంపిన మహిళ! ఎక్కడంటే..?
Man Killed Over Samosa Dispute: సమోసా కోసం ఏకంగా ఓ హత్య జరిగింది. ఓ వ్యక్తిని మహిళ కత్తితో కొట్టిమరీ చంపింది. ఈ విచిత్ర ఘటన బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో జరిగింది. ఆదివారం (అక్టోబర్ 19) సమోసాల విషయంలో ఏర్పడిన చిన్న వివాదం చిరిగి చిరిగి హత్యకు దారితీసింది. అసలింతకీ ఏం జరిగిందంటే..

బీహార్, అక్టోబర్ 23: ఘుమఘుమలాడే వేడివేడి సమోసా చూస్తే నోరూరని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. చల్లని సాయంత్రాల్లో చాలా మంది భోజన ప్రియులకు సమోసా బెస్ట్ చిరుతిండి. అయితే తాజాగా సమోసా కోసం ఏకంగా ఓ హత్య కూడా జరిగింది. ఈ విచిత్ర ఘటన బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో జరిగింది. ఆదివారం (అక్టోబర్ 19) సమోసాల విషయంలో ఏర్పడిన చిన్న వివాదం చిరిగి చిరిగి హత్యకు దారితీసింది. అసలింతకీ ఏం జరిగిందంటే..
బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో కౌలోదిహరి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి స్థానిక దుకాణంలో సమోసాలు కొనడానికి వెళ్ళాడు. అయితే అతడు అక్కడున్న ఇతర కస్టమర్లతో అనుకోకుండా గొడవకు దిగాడు. దీంతో వారు అతడు కొనుగోలు చేసిన సమోసాల ప్యాకెట్ లాక్కోవడమే కాకుండా అతడిపై దాడి చేశారు. గమనించిన స్థానికంగా ఉండే చంద్రమ యాదవ్ అనే వ్యక్తి జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు. వాగ్వాదం ఆపేందుకు చిన్న చర్చగా ప్రారంభమైన ఈ యవ్వారం చిరిగి చిరిగి గాలివానగా మారింది. దీంతో దుఖాణం వద్దకు చేరిన కొందరు గ్రామస్తుల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఇంతలో దుకాణం యజమాని అయిన ఓ మహిళ పదునైన కత్తితో చంద్రమ యాదవ్ తలపై కొట్టింది. దీంతో తీవ్ర గాయాలైన అతడు రక్తస్రావంతో కుప్పకూలాడు. స్థానికులు అతడిని పాట్నాలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం చంద్రమ యాదవ్ మరణించాడు.
సమాచారం అందుకున్న భోజ్‌పూర్ పోలీసులు హత్య కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. చంద్రమ యాదవ్‌పై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళను సంఘటన జరిగిన కొద్దిసేపటికే అరెస్టు చేశారు. సమోసా విషయంలో జరిగిన చిన్న గొడవ ఏకంగా ఓ వ్యక్తి ప్రాణాలను బలి తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ హత్యోదంతంలో ఇతరుల ప్రమేయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




