AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నితీష్ తనయుడు రాజకీయ అరంగేట్రం..! ముహుర్తం ఎప్పుడంటే..?

మరికొన్ని మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఏకైక సంతానం నిశాంత్ కుమార్ (Nishant Kumar) రాజకీయ అరంగేట్రంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. హోలీ తర్వాత ఆయన రాజకీయాల్లో చేరే అవకాశముందని బీహార్ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

నితీష్ తనయుడు రాజకీయ అరంగేట్రం..! ముహుర్తం ఎప్పుడంటే..?
Nishant Kumar, Bihar CM Nitish Kumar
Janardhan Veluru
|

Updated on: Jan 26, 2025 | 11:09 PM

Share

Bihar Politics: బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీష్ కుమార్ ఏకైక కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? త్వరలోనే ఆయన జేడీయులో చేరనున్నారా? బీహార్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. నితీష్ కుమార్ తన కుమారుడు నిశాంత్ కుమార్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. హోలీ తర్వాత ఆయన అధికారికంగా రాజకీయాల్లోకి వస్తారని.. ఆ మేరకు ముహుర్తం నిర్ణయించినట్లు బీహార్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

నిశాంత్ కుమార్ రాజకీయాల్లోకి రావడాన్ని బీజేపీకి చెందిన మంత్రి ప్రేమ్ కుమార్ స్వాగతించారు. నిశాంత్ కుమార్ రాజకీయాల్లోకి వస్తే స్వాగతిస్తానని అన్నారు. ఇది ప్రజాస్వామ్యమని, రాజకీయాల్లోకి వచ్చే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. నిశాంత్ కుమార్ నవ యువకుడు.. ఆయన రాక బీహార్ అభివృద్ధికి ఊపునిస్తుందన్నారు. ఆయన రాజకీయ రంగ ప్రవేశాన్ని స్వాగతిస్తానని చెప్పారు.

రాజకీయాలకు దూరంగా నిశాంత్ కుమార్

బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆయన ధివంగత భార్య మంజు సింగ్‌ల ఏకైక కుమారుడు నిశాంత్ కుమార్. ఆయన వయసు 38 ఏళ్లు. ప్రస్తుతం ఆయన రాజకీయాలు, టీవీ డిబేట్లు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్‌ డిగ్రీ చదివారు.

జనవరి 8న, నిశాంత్ కుమార్ తన స్వస్థలమైన భక్తియార్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తన తండ్రితో కలిసి కనిపించాడు. ఆ సమయంలో, ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మరోసారి JDU, తన తండ్రికి ఓటు వేయాలని కోరారు. తద్వారా రాష్ట్రంలో మళ్లీ తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

భక్తియార్‌పూర్‌లో జరిగిన కార్యక్రమం తర్వాత, నిశాంత్ కుమార్ రాజకీయాల్లోకి రావచ్చని జేడీయూ సీనియర్ నాయకుడు, బీహార్ మంత్రి శ్రవణ్ కుమార్ అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంపై నిశాంత్‌కుమార్‌కు పూర్తి అవగాహన ఉందని, ఆయన ప్రగతిశీల యువకుడని చెప్పారు. ఆయనలాంటి ఆలోచనలు ఉన్న యువత రాజకీయాల్లోకి రావాలని అన్నారు. అదే సమయంలో.. నిశాంత్ కుమార్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని జేడీయు పార్టీ కార్యకర్తలు చాలా కాలం నుంచి కోరుతున్నారు.

దీనికి ముందు, నిశాంత్ కుమార్ చివరిసారిగా 2015లో తన తండ్రి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. అప్పట్లో ఆయన రాజకీయాల్లోకి వచ్చే యోచన లేదని స్పష్టంచేశారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలని ఎంచుకున్నట్లు తెలిపారు.

అయితే ఇప్పుడు నిశాంత్ కుమార్ రాజకీయ అరంగేట్రానికి రంగం సిద్ధమయ్యిందన్న ఊహాగానాలు బీహార్ రాజకీయాల్లో జోరుగా సాగుతున్నాయి. వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చురుకైన పాత్ర పోషిస్తారని ప్రచారం జరుగుతోంది. నిశాంత్‌ను రాజకీయాల్లోకి తీసుకురావాలని నితీష్ కుమార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై జేడీయు లేదా నితీష్ కుమార్ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

బీహార్ అసెంబ్లీకి ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 243 స్థానాలు ఉండగా.. మరోసారి అక్కడ అధికార పగ్గాలు సొంతం చేసుకోవాలని ఎన్డీయే ఉవ్విళ్లూరుతోంది.