BJP in South India : అంతుచిక్కని ఓటరునాడి.. కమలనాథులకు దక్కని దక్షిణాది!

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Jul 27, 2021 | 9:34 PM

దేశవ్యాప్తంగా మెజార్టీ రాష్ట్రాల్లో కమలం వికసిస్తోంది. 2019లో కూడా ఎక్కువ MP సీట్లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన BJPకి దక్షిణాది మాత్రం కొరకరాని కొయ్యగానే మారింది.

BJP in South India : అంతుచిక్కని ఓటరునాడి.. కమలనాథులకు దక్కని దక్షిణాది!
Big News Big Debate

బిగ్‌న్యూస్‌ బిగ్‌డిబేట్‌ డెస్క్‌:

దేశవ్యాప్తంగా మెజార్టీ రాష్ట్రాల్లో కమలం వికసిస్తోంది. 2019లో కూడా ఎక్కువ MP సీట్లు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన BJPకి దక్షిణాది మాత్రం కొరకరాని కొయ్యగానే మారింది. ఐదు రాష్ట్రాల్లో బలమైన ముద్ర వేయాలని భావిస్తున్న ఆ పార్టీ ఆశలు ఆవిరవుతూనే ఉన్నాయి. కర్ణాటకలో అధికారంలోకి వచ్చినా కూడా ఎందుకో కన్ఫూజన్‌‌ పార్టీని వెంటాడుతోంది. యడియూరప్ప రాజీనామా అనంతరం సరైన మాస్‌ లీడర్‌ కనిపించడం లేదు. ఇక, మొన్నటి ఎన్నికల్లో కేరళ, తమిళనాడులో బలపడాలన్న ప్రయత్నాలను జనాలు తిప్పికొట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేసినంతగా ఎన్నికల్లో ఓట్లు రాలడం లేదు.

దేశవ్యాప్తంగా హవా…
ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ బీజేపీ. 40కోట్లకుపైగా సభ్యత్వాలు సొంతం చేసుకున్న ఏకైక జాతీయపార్టీ BJP. మూడున్నర దశాబ్ధాల తర్వాత సొంతంగా అధికారంలోకి వచ్చేంత మెజార్టీతో చిరస్మరణీయ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది కాషాయం. కాంగ్రెస్‌ హఠావో నినాదంతో గుజరాత్‌ నుంచి వచ్చిన మోడీ- అమిత్‌షాల ద్వయం వరుస విజయాలతో రాష్ట్రాల్లో కూడా కమల వికాసం సాకారం చేశారు. దేశమంతా పార్టీ జెండా రెపరెపలాడుతోంది. మరికొన్ని రాష్ట్రాల్లో ప్రధాన ప్రత్యర్ధిగా ఉంది. 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది.

అందని ద్రవిడ రీజియన్‌…
నార్త్‌లో ఎంతో సులభంగా పాగా వేసిన కమలనాథులకు దక్షిణాదిలో మాత్రం పార్టీకి బలమైన పునాదులు ఏర్పడటం లేదు. కాంగ్రెస్ ఆధిపత్యాన్ని ప్రశ్నించి ప్రాంతీయ పార్టీల ఉద్యమాలకు ఊపిరి పోసి.. కొత్త శకానికి నాంది పలికిన ద్రవిడ రీజియన్‌లో బీజేపీ వ్యూహాలు పారడం లేదు. తమిళనాడు మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీతో పాటు కేరళలో పార్టీ బలగం పెంచుకోవాలని చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడా ఫలించలేదు. కనీస ఓటుబ్యాంకు లేని బెంగాల్‌, త్రిపుర వంటి రాష్ట్రాల్లో పార్టీ తక్కువ సమయంలో ఓట్లు, సీట్లు సాధించినా.. 1980ల్లో ఆవిర్బావం నుంచే కొద్దోగొప్పో బలం ఉండి గతంలో మిత్రపక్షాలతో అధికారం పంచుకున్న పార్టీగా తెలుగు రాష్ట్రాల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతోంది. మిత్రపక్షాలతో కలిసి పోటీచేస్తే సీట్లు.. లేకుంటే డిపాజిట్లు గల్లంతయ్యేలా పరిస్థితి తయారైంది. ఇక తమిళనాడులో అన్నాడిఎంకే ద్వారా అధికారంలోకి రావాలని చూసినా ఇటీవల ప్రజలు తిప్పికొట్టారు. అటు కేరళలో శబరిమల ఉద్యమాన్ని.. ఇటు అభివృద్ధి‌ మంత్రం ప్రయోగించినా కూడా ఫలితం రాలేదు.

బీజేపీ సాధించిన సీట్లు.. ఓట్లు
రాష్ట్రం మొత్త స్థానాలు సంవత్సరం పోటీ చేసిన స్థానాలు గెలిచిన సీట్లు  ఓట్ల శాతం
కర్ణాటక 224 2018 223 104 36.22%
2013 223 40 19.89%
తమిళనాడు  234 2021 20 4 2.62%
2016 234 0 2.86%
కేరళ 140 2021 113 0 11.30%
2016 98 1 10.60%
ఆంధ్రప్రదేశ్ 175 2019 173 0 0.84%
2014 14 4 4.13 % (ఉమ్మడి రాష్ట్రం టీడీపీ పొత్తు)
తెలంగాణ  119 2018 117 1 7.10%
2014 44 5 4.13 % (ఉమ్మడి రాష్ట్రం టీడీపీ పొత్తు)
పుదుచ్చేరి 30 2021 9 6 13.66%
2016 30 0 2.40%

 

కర్ణాటకలో మారిన పరిణామాలు… 

ఇక, పార్టీ 2006లో కర్ణాటకలో మిత్రపక్షాలతో కలిసి అధికారంలోకి వచ్చింది. అక్కడ పార్టీకి బలమైన కేడర్‌ కొంతవరకు తయారైంది. 2008లో సొంతంగా అధికారంలోకి వచ్చినా కూడా అవినీతి ఆరోపణలు.. CMల మార్పులు తప్పలేదు. 2018లో మళ్లీ మెజార్టీ సీట్లు వచ్చినా మేజిక్‌ నెంబర్‌ దక్కలేదు. దీంతో పవర్‌ పోయింది. ఏడాదిన్నర తర్వాత కాంగ్రెస్‌-JDS ప్రభుత్వాన్ని కూల్చి మరీ పీఠం దక్కించుకున్నారు. కానీ పూర్తికాలం కాకుండానే మళ్లీ కొత్త CM వేటలో పడింది BJP. ప్రభుత్వ వ్యతిరేకత, యడియూరప్ప ప్రాభవం వల్ల అధికారం దక్కింది కానీ.. ఇక్కడ స్థిరమైన ఓటుబ్యాంకు లేకపోవడం పార్టీకి మైనస్‌ అయింది. యడియూరప్ప పార్టీ వీడటంతో 2013లో చిత్తుగా ఓడిపోయింది. అంటే స్థానిక నాయకత్వం.. సామాజికవర్గం అండ తప్ప పార్టీ విధానంతో అక్కడ బలమైన ముద్ర వేయలేకపోయింది. ఇప్పుడు కూడా మళ్లీ లింగాయత్‌ కమ్యూనిటీకి భయపడి.. యడియూరప్ప ఆశీస్సులన్న వ్యక్తి బసవరాజ్‌ బొమ్మైకు పగ్గాలు ఇవ్వాల్సి వచ్చింది కానీ.. కొత్త తరం నాయకుడికి మరో వర్గానికి కేటాయించలేని పరిస్థితి.

ఎజెండానే బలహీనతా…
ప్రధానంగా సౌతిండియాలో డెవలప్‌మెంట్‌ కోణం తప్ప.. హిందుత్వ ఎజెండా వర్కవుట్‌ కాదన్న చర్చ ఉంది. పైగా స్తానికంగా రాష్ట్రాల్లో బలమైన నాయకులు, ప్రాంతీయ పార్టీలున్నాయి. అదే సమయంలో బీజేపీకి సరైన మాస్‌ లీడర్ల కొరత కూడా ఎదగక పోవడానికి కారణమంటున్నారు. మరి వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ మరింత బలాన్ని కూడగట్టుకుంటుందా. ఉన్న శక్తిని తగ్గించుకుంటుందా.?

ఇదే అంశంపై టీవీ9 బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌ లో ప్రత్యేక చర్చ జరిగింది. వాచ్‌ వీడియో ఫర్‌ మోర్‌ అప్‌డేట్స్…


Read Also… Karnataka CM: లింగాయత్ సామాజిక వర్గానికే మరో అవకాశం.. కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజు బొమ్మై..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu