బెంగుళూరులో హింస, ఆ సంస్థపై నిషేధం తప్పదా ?
బెంగుళూరులో ఇటీవల పెద్దఎత్తున జరిగిన హింస, అల్లర్లలో సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్ డీ పీ ఐ) హస్తం ఉందని, దానిపై ప్రభుత్వం చర్య తీసుకుంటుందని..

బెంగుళూరులో ఇటీవల పెద్దఎత్తున జరిగిన హింస, అల్లర్లలో సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్ డీ పీ ఐ) హస్తం ఉందని, దానిపై ప్రభుత్వం చర్య తీసుకుంటుందని కర్నాటక హోం మంత్రి బసవరాజ బొమ్మై అన్నారు. అవసరమైతే దీన్ని నిషేధించాలని కేంద్రానికి సిఫారసు చేస్తామన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తోందని, అరాచక శక్తులతో చేతులు కలిపిన ఈ సంస్థను బ్యాన్ చేయాల్సిందే అని ఆయన చెప్పారు. సీఎం ఎడియూరప్ప కూడా నిన్న ఈ సంస్థ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. చట్టం ప్రకారం దీనిపై చర్య తీసుకుంటామని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస మూర్తి అల్లుడు నవీన్ ఫేస్ బుక్ లో పెట్టిన ఓ పోస్ట్ తో ఈ నెల 11 న సిటీలో పెద్దఎత్తున హింస చెలరేగింది. వందలాది మంది ఆందోళనకారుల దాడుల్లో అనేక వాహనాలు దగ్ధమయ్యాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. అనేకమంది గాయపడ్డారు. లక్షలాది రూపాయల విలువైన ఆస్తి నష్టం సంభవించింది.