Bengaluru Rain: చీరతో ఐదుగురి ప్రాణాలు కాపాడిన మహిళ.. బెంగళూరులో స్త్రీ మూర్తి సాహసం..

నాలుగు రోజుల క్రితం బెంగళూరులో బీభత్సం సృష్టించిన వర్షం ఎపిసోడ్‌లో ఓ ఆసక్తికర విషయంలో వెలుగులోకి వచ్చింది. తన చీరతో ఐదుగురు ప్రాణాలను కాపాడింది ఓ మహిళ. ఇంతకీ.. అసలు ఆ రోజు ఏం జరిగింది?.. ఐదుగురి ప్రాణాలను ఆమె ఎలా కాపాడింది?..

Bengaluru Rain: చీరతో ఐదుగురి ప్రాణాలు కాపాడిన మహిళ.. బెంగళూరులో స్త్రీ మూర్తి సాహసం..
Woman Saree Saves Five
Follow us
Sanjay Kasula

|

Updated on: May 23, 2023 | 9:43 PM

కళ్ల ముందు ఏదైనా ప్రమాదం జరిగితే చూసీ చూడనట్లు తప్పించుకుని పోయే వాళ్లను ఎందరినో చూస్తుంటాం.. కొందరు మాత్రం అంబులెన్స్‌, పోలీసులకు ఫోను చేయాలని ప్రయత్నిస్తారే తప్ప.. రంగంలోకి దిగి సాయం చేయాలన్న ఆలోచన చేయరు. కానీ.. బెంగళూరులో ఓ మహిళ.. తన చీరతో ఐదుగురి ప్రాణాలకు కాపాడి శభాష్‌ అనిపించుకుంటోంది. బెంగళూరులో కురిసిన భారీ వర్షాల వల్ల.. ఆదివారం కేఆర్‌ కూడలి సమీపంలో అండర్‌ పాస్‌ వరద నీటిలో కారు చిక్కుకోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భానురేఖ అనే టెకీ మృతి చెందింది. వరదలో చిక్కుకుంది ఆరుగురైతే.. మృతి చెందింది మాత్రం ఒక్కరే. మిగిలిన ఐదుగురిని ప్రాణాపాయం నుంచి కాపాడింది బెంగళూరు రెస్క్వూ టీమ్‌. అయితే.. ఆ రక్షణ బృందాలు సంఘటనా స్థలానికి వచ్చేంతవరకు వారి ప్రాణాలను కాపాడింది మాత్రం ఓ మహిళ చీర.

స్థానిక కేఆర్‌ కూడలిలోని అండర్‌ పాస్‌ వద్ద ఏదో హడావుడి కొనసాగుతుందని అదే మార్గంలో వెళ్తున్న ఓ మహిళ గుర్తించింది. వరద నీటిలో అండర్‌ బ్రిడ్జి మునిగిపోగా.. మీడియా ప్రతినిధి ఒకరు ఈత కొడుతూ మునిగిన కారులో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేశారు. వారిని రక్షించేందుకు తాడు అవసరమై.. ఎవరైనా ఏదైనా అందించాలని అతను కోరాడు.

అందరూ చూస్తున్నారే తప్ప అతనికి ఏదైనా ఆధారాన్ని అందించాలనే ప్రయత్నం మాత్రం చేయలేదు అక్కడున్నవారు. కానీ.. అప్పుడే అటువైపుగా వచ్చిన ఆ మహిళ.. తన చీరను విప్పి అతనికి అందించింది. అండర్‌ పాస్‌కు ఉన్న ఇనుప ఊచలకు కట్టిన ఆ చీరతో ఒక్కొక్కరుగా బయటకు రాగలిగారు. ఆ మహిళ చూపిన తెగువకు అక్కడున్నవారంతా ఆమెను అభినందించారు. దాంతో.. వెంటనే.. మరో మహిళ తన వద్ద ఉన్న దుపట్టాను ఆమెకు అందించగా.. మరో వ్యక్తి తన చొక్కాను విప్పి ఇచ్చాడు.

మొత్తంగా.. ప్రమాద సమయంలో తన చీరను అందించి ఐదుగురి ప్రాణాలను కాపాడేలా చేసిన ఆ మహిళపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

వీడియో ఇక్కడ చూడండి

మరిన్ని జాతీయ వార్తల కోసం