భార్యను కత్తితో పొడిచి హత్య.. అడ్డుకున్న తల్లిపైనా దాడి! ఆపై పురుగుల మందు తాగి నేరుగా..
పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో జరిగిన గొడవ నేపథ్యంలో జహంగీర్ ఆలం తన భార్య రుక్సానా బేగంను కత్తితో పొడిచి హత్య చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తన తల్లిపైనా దాడి చేసి గాయపరిచాడు. అనంతరం పురుగుల మందు తాగిన జహంగీర్, తాను దాడికి ఉపయోగించిన కత్తితోనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు..

బెంగాల్, ఆగస్ట్ 23: పశ్చిమ బెంగాల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో జరిగిన గొడవ నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. భార్యను కాపాడేందుకు ప్రయత్నించిన తన తల్లిపైనా కత్తితో దాడి చేసి గాయపరిచాడు. అనంతరం పురుగుల మందు తాగి, తాను దాడికి ఉపయోగించిన కత్తితోనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. జల్పాయిగురి జిల్లాలో ఈ ఘటన జరిగింది. మృతురాలిని రుక్సానా బేగంగా, నిందితుడిని జహంగీర్ ఆలంగా గుర్తించారు. వీరిద్దరికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. శనివారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో రుక్సానా, జహంగీర్ మధ్య ఓ విషయంపై వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన జహంగీర్ పదునైన కత్తితో భార్యపై దాడి చేశాడు.
పలుమార్లు కత్తితో పొడవడంతో రుక్సానాకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో జహంగీర్ తల్లి జోక్యం చేసుకుని రుక్సానాను కాపాడేందుకు ప్రయత్నించింది. దీంతో నిందితుడు తన తల్లిపైనా కత్తితో దాడి చేశాడు. ఆమె కాలికి తీవ్ర గాయం కావడంతో రక్తస్రావమైంది. దీంతో ఆమె ప్రాణభయంతో ఇంటి నుంచి బయటకు పరుగులు తీసింది. ఇంట్లో నుంచి కేకలు వినిపించడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే తీవ్ర కత్తి గాయాలతో రుక్సానా మృతి చెందినట్లు గుర్తించారు. ఘటన అనంతరం జహంగీర్ పురుగుల మందు తాగినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత తాను దాడికి ఉపయోగించిన పదునైన కత్తిని తీసుకుని ధూప్‌గురి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
రుక్సానా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జహంగీర్ తల్లి కూడా కత్తి దాడిలో గాయపడటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. జహంగీర్ మత్తుపదార్థాలకు బానిసయ్యాడని స్థానికులు ఆరోపించారు. డ్రగ్స్ సేవించిన తర్వాత తరచూ ఇంట్లో గొడవలు సృష్టించేవాడని, భార్యను కొట్టడంతో పాటు పొరుగువారిని కూడా బెదిరించేవాడని వారు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భార్య హత్యకు దారితీసిన అసలు కారణం ఏమిటన్న దానిపై విచారణ కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. మరోవైపు ప్రాంతంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీస్ పెట్రోలింగ్ బృందాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు.




