Bangladesh MP Case: వీడని బంగ్లాదేశ్ ఎంపీ డెత్ మిస్టరీ.. రెమాల్ తుఫాన్‌కు కొట్టుకుపోయిన శరీర భాగాలు!
బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ (53) హత్య ఇంకా మిస్టరీగానే ఉంది. చికిత్స నిమిత్తం కోల్‌కతాకు వచ్చిన ఆయన అపార్ట్‌మెంట్‌లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ అధికారులకు ఇప్పటి వరకూ ఆయన శరీర భాగాలను గుర్తించలేక పోయారు. ఆయన శరీర అవశేషాలను చిన్న ముక్కలుగా కట్ చేసి పడేయడమే ఇందుకు కారణం. పైగా ఇటీవల కురిసిన వర్షాలకు అవి..
కోల్‌కతా, మే 28: బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ (53) హత్య ఇంకా మిస్టరీగానే ఉంది. చికిత్స నిమిత్తం కోల్‌కతాకు వచ్చిన ఆయన అపార్ట్‌మెంట్‌లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ అధికారులకు ఇప్పటి వరకూ ఆయన శరీర భాగాలను గుర్తించలేక పోయారు. ఆయన శరీర అవశేషాలను చిన్న ముక్కలుగా కట్ చేసి పడేయడమే ఇందుకు కారణం. పైగా ఇటీవల కురిసిన వర్షాలకు అవి కొట్టుకుపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఎంపీ హత్యను నిర్ధరించుకునేందుకు చివరి ప్రయత్నంగా అపార్టుమెంటులో గుర్తించిన రక్తం నమూనాలను డీఎన్‌ఏ పరీక్ష ద్వారా నిర్దారించేందుకు సిద్ధమయ్యారు. డీఎన్‌ఏ పరీక్ష ద్వారా ఎంపీ కుటుంబీకుల డీఎన్‌ఐతో పోల్చి చూడటం తప్ప వేరొక మార్గం లేదని బంగ్లాదేశ్ దర్యాప్తు బృందం వెల్లడించింది. వర్షం తగ్గుముఖం పట్టడంతో ఆయన శరీర భాగాల కోసం కాలువలో వెతికే ప్రక్రియను మళ్లీ మొదలుపెట్టినట్లు తెలిపారు.
కాగా బంగ్లా అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ మే 17 నుంచి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఆయనను కోల్‌కతా శివారులోని న్యూ టౌన్‌లోని ఓ అపార్టుమెంటులో హత్య చేసి, శరీర భాగాలను కాలువలో పడేసి ఉంటారని దర్యాప్తు చేస్తున్న కోల్‌కతా సీఐడీ పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. ఆయన శరీర భాగాలు దొరకని పక్ష్యంలో చివరి ఆప్షన్‌గా డీఎన్‌ఏ టెస్ట్ నిర్వహిస్తామని కోల్‌కతాకు వచ్చిన ఢాకా పోలీసధికారులు తెలిపారు. ఎంపీ అనార్ మరణంపై దర్యాప్తు చేసేందుకు ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ డిటెక్టివ్ బ్రాంచ్‌కు చెందిన ముగ్గురు సభ్యుల బృందం కోల్‌కతాలో ఉంది. ఈ బృందానికి డిటెక్టివ్ బ్రాంచ్ చీఫ్ మహ్మద్ హరున్-ఆర్-రషీద్ నాయకత్వం వహిస్తున్నారు.
కోల్‌కతా పోలీసుల విపత్తు నిర్వహణ బృందం మంగళవారం రాజర్‌హట్ సమీపంలోని వినోద ఉద్యానవనానికి ఆనుకుని ఉన్న బాగ్జోలా కాలువలో ఎంపీ శరీర అవశేషాల కోసం వెతుకులాట ప్రారంభించారు. అయితే సోమవారం రెమాల్ తుఫాను వల్ల కురిసిన భారీ వర్షాల కారణంగా శరీర భాగాలను కనుగొనడం కష్టతరంగా మారింది. శరీర భాగాలను చిన్న భాగాలుగా నరికడం వల్ల, వాటిని జంతువులు తినే అవకాశం ఉంది. అంతేకాకుండా బాగ్జోల కాలువలో మురికి నీరు కారణంగా శరీర భాగాలు పాడైపోయే అవకాశం ఉందని ఓ పోలీసు అధికారి చెప్పారు. కాలువలో ఎంపీ శరీర భాగాలను గుర్తించడానికి డైవర్లను నియమించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.