India Defence: భారత రక్షణ వ్యవస్థకు మరింత బలం.. ఇక శత్రు దేశాల వెన్నులో వణుకే..!

ప్రపంచమే యుద్ధం అంచున నిలబడిన ఈ పరిస్థితుల్లో జనాభాలో అన్ని దేశాలను మించి భారత్ వంటి దేశంలో ఐరన్ డోమ్ వ్యవస్థ గురించి చర్చించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తాజాగా మూడు 'ఎస్-400' రకానికి చెందిన యాంటీ-మిస్సైల్ యూనిట్లను భారత్‌కు రష్యా అందజేసింది. వచ్చే ఏడాది నాటికి మరో రెండు యూనిట్లను అందజేస్తామని తెలియజేసింది. ఈ విషయాన్ని ఎయిర్‌ఫోర్స్ చీఫ్ అమర్‌ప్రీత్ సింగ్ తెలియజేశారు.

India Defence: భారత రక్షణ వ్యవస్థకు మరింత బలం.. ఇక శత్రు దేశాల వెన్నులో వణుకే..!
Iron DomeImage Credit source: PTI
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Oct 05, 2024 | 12:15 PM

ఐరన్ డోమ్.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దీని గురించి చర్చ జరుగుతోంది. శత్రుదేశాలు వందల సంఖ్యలో క్షిపణులను ప్రయోగిస్తున్నా సరే.. వాటిని మధ్యలోనే పేల్చేస్తూ తమ దేశాన్ని రక్షించుకుంటున్న ఇజ్రాయిల్ వైపు ప్రపంచం సంభ్రమాశ్చర్యాలతో చూస్తోంది. మన దేశంపైకి దూసుకొచ్చే క్షిపణులను మధ్యలోనే పేల్చేసే యాంటీ-మిస్సైల్ వ్యవస్థను ఆర్థికంగా బలంగా ఉన్న అనేక దేశాలు సమకూర్చుకున్నాయి. అయితే ఇజ్రాయిల్ జనాభా ప్రకారం చూసినా, వైశాల్యంలో చూసినా చిన్నదేశమే. అయినా సరే తమ అపారమైన మేధోశక్తితో అత్యంత పటిష్టమైన యాంటీ-మిస్సైల్ వ్యవస్థను తయారు చేసుకుంది. అందుకే అష్టదిక్కులా శత్రుదేశాలే ఉన్నప్పటికీ వాటన్నింటినీ ధీటుగా ఎదుర్కోగలుగుతోంది. ఇప్పుడు ఈ ఉపోద్ఖాతం దేనికి అంటే.. ప్రపంచమే యుద్ధం అంచున నిలబడిన ఈ పరిస్థితుల్లో జనాభాలో అన్ని దేశాలను మించి భారత్ వంటి దేశంలో ఈ వ్యవస్థ గురించి చర్చించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తాజాగా మూడు ‘ఎస్-400’ రకానికి చెందిన యాంటీ-మిస్సైల్ యూనిట్లను భారత్‌కు రష్యా అందజేసింది. వచ్చే ఏడాది నాటికి మరో రెండు యూనిట్లను అందజేస్తామని తెలియజేసింది. ఈ విషయాన్ని ఎయిర్‌ఫోర్స్ చీఫ్ అమర్‌ప్రీత్ సింగ్ తెలియజేశారు.

భారత్ గతంలో పొరుగున ఉన్న పాకిస్తాన్‌తో మాత్రమే శత్రుత్వాన్ని, సీమాంతర ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటూ వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలో బలమైన సైనిక వ్యవస్థలు కల్గిన పెద్ద రాజ్యాల్లో ఒకటైన చైనా నుంచి కూడా ముప్పును ఎదుర్కొంటోంది. చైనా ఆక్రమిత టిబెట్‌లో భారత సరిహద్దుల వెంట పెద్ద ఎత్తున రోడ్లు, ఇతర మౌలిక వసతులను నిర్మిస్తూ మన దేశానికి సవాల్ విసురుతోంది. అంతర్జాతీయ సరిహద్దులను గౌరవించకుండా తరచుగా కవ్వింపు చర్యలకు సైతం పాల్పడుతోంది. దశాబ్దాల క్రితం అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న ఆ దేశం ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, లద్దాక్ ప్రాంతాల్లో దురాక్రమణలకు తెగబడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం తమ రక్షణ సామర్థ్యాన్ని వీలైనంత వేగంగా పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. చైనాకు ధీటుగా భారత్ కూడా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించుకుంటోందని వైమానిక దళ చీఫ్ అన్నారు. వాయు మార్గంలో దూసుకొచ్చే క్షిపణులను మధ్యలోనే ఎదుర్కొని ధ్వంసం చేయగల బలమైన వ్యవస్థల్లో ఒకటైన ఎస్-400 యూనిట్లను సమకూర్చుకుంటోంది.

రష్యా నుండి ఐదు S-400 సిస్టమ్‌లను కొనుగోలు చేయడానికి భారతదేశం 2019లో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. అందులో భాగంగా మూడు యూనిట్లు రష్యా నుండి ఇప్పటికే భారతదేశానికి అందాయి. మరో రెండు యూనిట్లు ఇంకా అందాల్సి ఉంది. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం మొదలుపెట్టిన నేపథ్యంలో భారత్‌కు రెండు యూనిట్లను సరఫరా చేయలేకపోయింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో పర్యటించారు. తన పర్యటనలోనే ఎస్-400 క్షిపణి వ్యవస్థ సరఫరాకు సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడారు. రష్యా నుంచి అందుకున్న మూడు S-400 క్షిపణి వ్యవస్థలను చైనా సరిహద్దు ప్రాంతాల్లో భారత్ మోహరించింది. ఇలా చేయడం ద్వారా భారత సరిహద్దులో సైనిక బలం మరింత బలపడింది.

ఎస్-400 ప్రత్యేకతలు ఇవే

వాయుమార్గంలో దూసుకొచ్చే క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్లను ధ్వంసం చేయగల బలమైన ఆయుధమే ఎస్-400 శత్రు క్షిపణులను రాడార్ ద్వారా గుర్తించి గాల్లోనే ధ్వంసం చేయగల సామర్థ్యం దీని సొంతం. ఇది స్థిరంగా ఒక చోటనే ఉండే తరహా యాంటీ-మిస్సైల్ యూనిట్ కాదు. ఒక బలమైన ట్రక్ మీద దీన్ని ఏర్పాటు చేయడంతో ఎక్కడికి కావాలంటే అక్కడికి తరలించుకునే వెసులుబాటు ఉంది. S-400 అనేది భూ ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించే క్షిపణి (SAM) వ్యవస్థ. రష్యా అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ ద్వారా కేవలం శత్రుదేశం ప్రయోగించే క్షిపణులను మాత్రమే కాదు.. యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులను కూడా గాల్లోనే ధ్వంసం చేసే సామర్థ్యం దీని సొంతం.

  • S-400 నాలుగు శ్రేణుల క్షిపణులను ప్రయోగించవచ్చు. 40 కి.మీ, 100 కి.మీ, 200 కి.మీ మరియు 400 కి.మీ దూరం ప్రయాణించగల క్షిపణులను ప్రయోగించవచ్చు.
  • ఈ వ్యవస్థ 100 నుండి 40,000 అడుగుల ఎత్తున ఉన్న లక్ష్యాలను గుర్తించి ధ్వంసం చేయగలదు.
  • ఇది 92N6E ఎలక్ట్రానిక్ స్టీర్డ్ ఫేజ్డ్ యారో రాడార్‌ వ్యవస్థను కలిగి ఉంది.
  • ఈ రాడార్ దాదాపు 600 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకొచ్చే లక్ష్యాలను గుర్తించగలదు.
  • కేవలం 5 నుండి 10 నిమిషాల్లో ఇది ఆపరేషన్‌కు సిద్ధంగా ఉంటుంది.
  • ఒక యూనిట్ నుండి ఏకకాలంలో 160 వస్తువులను ట్రాక్ చేయవచ్చు.
  • ఒక లక్ష్యాన్ని ధ్వంసం చేయడం కోసం రెండు క్షిపణులను ఏకకాలంలో ప్రయోగించవచ్చు.
  • ఇది 30 కిలోమీటర్ల ఎత్తులో కూడా తన లక్ష్యంపై దాడి చేయగలదు.

రష్యన్ కంపెనీ‌తో భారత్ ఒప్పందం

ఇలాంటి అధునాతన వ్యవస్థలను అవసరాల మేరకు కొనుగోలు చేయడమే కాదు, స్వయంగా భారత్‌లోనే తయారు చేసుకునేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రష్యాతో కుదిరిన ఒప్పందం ప్రకారం భారత‌కు ఐదు ఎస్-400 స్క్వాడ్రన్‌లు అందిన తర్వాత, ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లోని భాగాలను భారతదేశంలో తయారు చేయడానికి సన్నాహాలు జరుగుతాయి. భారతదేశంలో S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నిర్వహణ మరియు మరమ్మత్తు కోసం ఒక భారతీయ కంపెనీ, రష్యన్ తయారీదారు అల్మాజ్-ఆంటె మధ్య ఒప్పందం దాదాపు ఖరారైంది. ఇది భారత మరియు రష్యా కంపెనీల మధ్య జాయింట్ వెంచర్ అవుతుంది.

రెండవ దశలో, భారతదేశంలో వ్యవస్థకు అవసరమైన భాగాల ఉత్పత్తిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తారు. దీని కోసం రష్యన్ కంపెనీ భారతీయ కంపెనీతో జాయింట్ వెంచర్‌ను కూడా ఏర్పాటు చేసి సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది. ఈ పనికి అవసరమైన సాంకేతికతను కూడా రష్యన్ కంపెనీ అందిస్తుంది. ఈ పని 2028 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి