Traffic Rules: ఇకపై ఆ నగరంలో ఎవరైనా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే.. ఇక దబిడి దిబిడే.. కొద్ది క్షణాల్లోనే..
రోడ్డు ప్రమాదాలను అరికట్టందుకు వాహనదారులంతా ట్రాఫిక్ నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ప్రభుత్వ పాలకులు, ట్రాఫిక్ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా మంది వాహనదారులు తమ వాహనాలను..
రోడ్డు ప్రమాదాలను అరికట్టందుకు వాహనదారులంతా ట్రాఫిక్ నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ప్రభుత్వ పాలకులు, ట్రాఫిక్ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా మంది వాహనదారులు తమ వాహనాలను విచ్చలవిడిగా నడుపుతుంటారు. ఫలితంగానే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ నియమాలను వాహనదారులు తూచా పాటించే విధంగా బెంగళూరు పోలీసులు ఓ వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు. అదేమిటంటే అర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కెమెరాల ద్వారా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వాహనదారులను గుర్తించి వారి సెల్‌ఫోెన్‌లకే ట్రాఫిక్ చలానా పంపడం. ఇలా చేయడం ద్వారా నగరంలోని వాహనదారుల తీరులో మార్పు వస్తుందని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ITMS) అనే నూతన విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానం ద్వారా కృత్రిమ మేధా కెమెరాలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినవారిని గుర్తించి వారి మొబైల్ ఫోన్‌లకు చలాన్‌లను జారీ చేస్తాయి.
‘‘కాంటాక్ట్‌లెస్ పద్ధతిలో ట్రాఫిక్ ఉల్లంఘనలను స్వయంచాలకంగా గుర్తించడం, నియమాలను ఉల్లంఘించినవారికి మానవ ప్రమేయం లేకుండానే ఆటోమేటిక్‌గా చలాన్‌లను పంపడం ITMS ప్రధాన లక్ష్యమ’’ని పోలీసు కమిషనర్(ట్రాఫిక్) ఎంఏ సలీమ్ తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనలను స్వయంచాలకంగా గుర్తించేందుకు ITMS కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్‌ను ఉపయోగిస్తుందని ఆయన చెప్పారు. ‘‘కర్ణాటక రాజధాని బెంగళూరులో మొత్తం 50 ప్రధాన ట్రాఫిక్ జంక్షన్లలో ఈ ITMSను అమలు చేస్తున్నాము. జంక్షన్లలో ఏర్పాటుచేసిన ఈ కెమెరాలు స్పీడ్ లిమిట్, రెడ్ లైట్లు, స్టాప్ లేన్‌ల ఉల్లంఘన కేసులతో పాటు హెల్మెట్ లేని ప్రయాణం, ట్రిపుల్ రైడింగ్, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం, సీటు బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడం వంటి నేరాలను గుర్తిస్తాయి. 50 జంక్షన్‌లలో 250 ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు, 80 రెడ్ లైట్ ఉల్లంఘన డిటెక్షన్ కెమెరాలతో ఈ సిస్టమ్‌లో భాగంగా ఉంటాయ’’ని సలీం తెలిపారు.
ఇంకా ‘‘ఈ కెమెరాలు 24 గంటలూ పూర్తి ఆటోమేటెడ్‌గా పనిచేస్తాయి. ట్రాఫిక్ నియమాలను ఉల్లఘించకుండా వాహనదారులు క్రమశిక్షణతో వాహనాలను నడిపేందుకు ఈ విధానం అమలులోకి వచ్చింద’’ని ఆయన అన్నారు. దీనిపై జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ఎమ్ఎన్ అనుచేత్ మాట్లాడుతూ “మేము సేకరించిన డేటా ట్రాఫిక్ పోలీసుల అధీనంలోని సర్వర్‌లో మాత్రమే ఉంటుంది. మేము డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు కట్టుబడి ఉన్నాము. దాని వివరాలు మరే ఇతరులకు షేర్ అవ్వవ’’ని తెలిపారు. నగర పోలీసు కమిషనర్ సిహెచ్ ప్రతాప్ రెడ్డి ఓ ట్వీట్ ద్వారా “తప్పులు చేయవద్దు, జరిమానా వసూలు చేయడం మా లక్ష్యం కాదు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కెమెరాలు అమలులోకి వచ్చాయి. మీలో మెరుగైన మార్పు తీసుకురావడమే మా లక్ష్యం’’అని రాసుకొచ్చారు.