Army Cheetah Helicopter: కుప్పకూలిన ఆర్మీ చీతా హెలికాప్టర్.. పైలట్ మృతి.. మరొకరికి తీవ్రగాయాలు..
భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్‌లో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఓ పైలట్ ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు

భారత సైన్యానికి చెందిన చీతా హెలికాప్టర్ అరుణాచల్ ప్రదేశ్‌లో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఓ పైలట్ ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్ బుధవారం ఉదయం 10 గంటల సమయంలో తవాంగ్ సమీపంలోని ఫార్వర్డ్ ఏరియాలో కూలిపోయిందని ఇండియన్ ఆర్మీ తెలిపింది. రోజువారీ విధుల్లో భాగంగా చక్కర్లు కొడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించింది. సమాచారం అందిన వెంటనే అధికార యంత్రాంగం, సైనిక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వెంటనే ఇద్దరు పైలట్లను సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్రంగా గాయపడిన లెఫ్టినెంట్ కల్నల్ సౌరభ్ యాదవ్ చికిత్స పొందుతూ మరణించినట్లు ఆర్మీ తెలిపింది. మరొక పైలట్‌కు చికిత్స కొనసాగుతోందని పేర్కొంది. కాగా, అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా.. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని.. విచారణ కొనసాగుతోందని ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఈ ఘటనపై కేంద్ర రక్షణ శాఖ, హోంమంత్రిత్వ శాఖలు కూడా ఆరా తీసి వివరాలు తెలుసుకున్నాయి.
ఇదిలాఉంటే.. ఈ ఏడాది మార్చిలో జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఆర్మీకి చెందిన మరో చితా హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ మృతి చెందగా, కో పైలట్ తీవ్రంగా గాయపడ్డాడు.
గత సంవత్సరం చివర్లో.. తమిళనాడులో వైమానిక దళానికి చెందిన ఎంఐ-17 వీ5 ఛాపర్ ప్రమాదంలో మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మరణించారు. డిసెంబరులో జరిగిన ప్రమాదంలో అతనితో పాటు అతని భార్య, మరో 12 మంది మరణించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం



