Coronavirus: దేశంలో కరోనా విజృంభణ.. ఇవాళ వైద్య నిపుణులతో కేంద్ర ఆరోగ్య మంత్రి కీలక భేటీ..
దేశంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల మధ్య కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా గురువారం నిపుణుల బృందంతో సమీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
India Covid-19 Cases: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని రోజుల నుంచి 10వేలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల మధ్య కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా (Mansukh Mandaviya) గురువారం నిపుణుల బృందంతో సమీక్ష నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మన్సుఖ్ మాండవీయా అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని తెలిపాయి. ఈ రోజు మధ్యాహ్నం ఫిజికల్ ఫార్మాట్‌లో సమావేశం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి.
అంతకుముందు జూన్ 13న కరోనా వ్యాక్సినేషన్ HarGharDastak 2.0 ప్రచారం పురోగతిని సమీక్షించడానికి మాండవియా అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరోనా ఇంకా ముగియలేదని.. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు నివేదికలు అందుతున్నాయని మాండవియా ఆ సమయంలో తెలిపారు. అప్రమత్తంగా ఉండటం ముఖ్యమని.. సంక్రమణ వ్యాప్తిని నిరోధించడానికి మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం మర్చిపోవద్దంటూ సూచించారు.
దేశంలోని కొన్ని రాష్ట్రాల్లోని జిల్లాల్లో పెరుగుతున్న కేసులపై సమీక్షించిన ఆయన పరీక్షలు పెంచాలని.. దీని ద్వారా సమాజంలో సంక్రమణ వ్యాప్తిని అరికట్టవచ్చని పేర్కొన్నారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్, నిర్వహణ అంశాలకు కట్టుబడి వ్యూహాలను అమలు చేయాలని.. నిరంతరం పర్యవేక్షణ అవసరమని ఆయన పేర్కొన్నారు. హర్ ఘర్ దస్తక్ ప్రచారం ద్వారా.. పిల్లలకు (12-17) పెద్దలకు వ్యాక్సిన్ అందించాలని సూచించారు.
కాగా.. బుధవారం దేశంలో 9,923 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 17 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటనలో తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..