Jammu Kashmir Floods: జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు, వరదల బీభత్సం.. ఆ ప్రాంతాల్లో హై అలర్ట్..
ఒకవైపు కుండపోత వర్షం.. మరోవైపు ఆకస్మిక వరదల ధాటికి విలవిలలాడిపోతోంది జమ్మూకశ్మీర్. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. జమ్ము-శ్రీనగర్ నేషనల్ హైవే కూడా మూతబడింది. దీంతో పలు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు.
Jammu Kashmir Floods: జమ్మూకశ్మీర్‌లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 4 రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలకు జనజీవనం స్తంభించిపోయింది. నదులు ప్రమాదకరస్థాయిని మించి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదల ధాటికి రాంబన్, ఉధంపూర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారి కొట్టుకుపోయింది. దీంతో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. భారీ వరదలకు నిర్మాణంలో ఉన్న పీరా వంతెన కొట్టుకుపోయింది. షోపియాన్ జిల్లాతో జమ్ములోని పూంచ్, రాజౌరి జిల్లాలను కలిపే ప్రత్యామ్నాయ మార్గం మొఘల్ రోడ్డు కూడా కొండచరియలు విరిగిపడటంతో క్లోజ్ చేశారు. దీంతో హైవేపై చిక్కుకున్న ప్రయాణికులకు ఆహారం, వైద్య సదుపాయాలు ఏర్పాటుచేశారు. రోడ్లపై పేరుకుపోయిన బురదను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. ఆకస్మిక వరదలకు కొట్టుకుపోయిన రోడ్డుకు మరమ్మతులు చేస్తున్నారు.
మరోవైపు పలు ప్రాంతాల్లో వరద ఉధృతిలో చిక్కుకున్న వారిని రక్షించింది రెస్క్యూ టీమ్. వరద ప్రభావిత జిల్లాల్లోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు అమర్‌నాథ్ సహా కొండ ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. శ్రీనగర్‌లో దాదాపు 50ఏళ్లలో జూన్‌లో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదముందని..లోతట్టు ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రానున్న 24 గంటలు చాలా కీలకమని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
జమ్ము, ఉధంపూర్, రియాసి, పుల్వామా జిల్లాల్లోని నదుల్లో నీటిమట్టం పెరిగిపోతోంది. దీంతో ప్రజలు ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. వరద ప్రభావిత జిల్లాల్లో హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..