AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“అమ్మ” పార్టీలో చీలిక.. అన్నాడీఎంకేలో ముసలం.. విజయ్ వైపు 30 మంది ఎమ్మెల్యేలు..!

తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ఒకప్పుడు తమిళ రాజకీయాలను శాసించిన "అమ్మ" పార్టీలో ముసలం మొదలైంది. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి మద్దతుగా ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే (AIADMK)లో చీలక రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

అమ్మ పార్టీలో చీలిక.. అన్నాడీఎంకేలో ముసలం.. విజయ్ వైపు 30 మంది ఎమ్మెల్యేలు..!
Aiadmk Rebel Mlas Back Cm Vijay
Balaraju Goud
|

Updated on: May 12, 2026 | 9:00 PM

Share

తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ఒకప్పుడు తమిళ రాజకీయాలను శాసించిన “అమ్మ” పార్టీలో ముసలం మొదలైంది. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి మద్దతుగా ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే (AIADMK)లో చీలక రావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా 30 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తూ విజయ్ వైపు మొగ్గు చూపడం రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని మార్చేస్తోంది.

అన్నాడీఎంకే సీనియర్ నాయకులు ఎస్.పి. వేలుమణి, సి.వి. షణ్ముగం నేతృత్వంలోని 30 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుత పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ఎడప్పాడి కె. పళనిస్వామి (EPS) వైఖరిని నిరసిస్తూ, వీరంతా విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు ప్రకటించారు. తాము విజయ్‌కు మద్దతు లేఖను కూడా అందజేస్తామని షణ్ముగం స్పష్టం చేశారు. అసెంబ్లీలో జరిగే బలపరీక్ష సమయంలో టీవీకే ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామని వారు బహిరంగంగానే ప్రకటించారు.

“మేము డీఎంకేను వ్యతిరేకించడానికే ఈ పార్టీని స్థాపించాము. గత 53 ఏళ్లుగా మా రాజకీయ లక్ష్యం అదే” అని షణ్ముగం వ్యాఖ్యానించారు. డీఎంకే పరోక్ష మద్దతుతో అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పళనిస్వామి ప్రతిపాదనను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తిరుగుబాటు వర్గం పేర్కొంది. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పళనిస్వామిని తొలగించి, ఆ స్థానంలో వేలుమణిని శాసనసభాపక్ష నాయకుడిగా గుర్తించాలని వారు ప్రొ-టెం స్పీకర్ ఎం.వి. కరుపయ్యకు లేఖ సమర్పించారు.

మరోవైపు పళనిస్వామి వర్గం ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీ ఆదేశాలను ధిక్కరించే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామని మాజీ మంత్రి ఆగ్రీ ఎస్.ఎస్. కృష్ణమూర్తి హెచ్చరించారు. పళనిస్వామికి 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఓ.ఎస్. మణియన్ స్పష్టం చేశారు. ఈ 47 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను స్పీకర్ జె.సి.డి. ప్రభాకర్‌కు అందజేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పేలవమైన ప్రదర్శన తర్వాత పళనిస్వామి నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమయంలో విజయ్ ఎంట్రీ ఇవ్వడం, కీలక నేతలు ఆయన వైపు వెళ్లడం అన్నాడీఎంకే ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోంది. అటు విజయ్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ, తిరుగుబాటు నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.

ఇదిలావుంటే, తమిళనాడు అసెంబ్లీలో జరగబోయే బలపరీక్ష ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. టీవీకేకు మద్దతుగా ఈ 30 మంది ఎమ్మెల్యేలు ఓటు వేస్తే, రాష్ట్రంలో కొత్త రాజకీయ శకం మొదలైనట్టే. ఒకవైపు డీఎంకేను ఎదుర్కోవడం, మరోవైపు అంతర్గత తిరుగుబాటును అణచుకోవడం అన్నాడీఎంకేకు ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. మొత్తానికి ‘దళపతి’ విజయ్ రాజకీయ రంగప్రవేశం తమిళనాట ఊహించని కుదుపులకు కారణమవుతోంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us