AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: 15 ఏళ్ల తర్వాత అద్భుతం.. కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!

Indian Spectacled Cobra Hatchlings Delhi Zoo: వన్యప్రాణుల సంరక్షణ, వాటి గురించి ప్రజల్లో అవగాహన పెంచడం, పర్యావరణ సమతుల్యతలో కీలకమైన సరీసృపాల మనుగడను కాపాడటమే ధ్యేయంగా దిల్లీ జూ ఈ అడుగు వేసింది. 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కృత్రిమ పద్ధతిలో జన్మించిన ఈ బుజ్జి నాగులు, రాబోయే రోజుల్లో ఇలాంటి మరెన్నో అరుదైన జీవుల సంరక్షణ ప్రయోగాలకు సరికొత్త మార్గాన్ని చూపించాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Video: 15 ఏళ్ల తర్వాత అద్భుతం.. కృత్రిమంగా పొదిగిన నాగుపాము గుడ్లు..!
Artificial Incubation Cobra Eggs
Venkata Chari
|

Updated on: Jul 13, 2026 | 9:00 AM

Share

Artificial Incubation Cobra Eggs: వన్యప్రాణి సంరక్షణ రంగంలో దిల్లీలోని నేషనల్ జూలాజికల్ పార్క్ (జాతీయ జంతు ప్రదర్శనశాల) అధికారులు ఒక అరుదైన మైలురాయిని అధిగమించారు. గత 15 సంవత్సరాలుగా ఎన్నో విఫలయత్నాల తర్వాత, ఎట్టకేలకు అత్యాధునిక సాంకేతికత సాయంతో నాగుపాము గుడ్లను కృత్రిమంగా పొదిగించడంలో జూ పశువైద్య బృందం ఘన విజయం సాధించింది. సైంటిఫిక్ యానిమల్ మేనేజ్‌మెంట్‌లో ఇదొక చారిత్రాత్మక విజయమని అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

15 ఏళ్ల కల సాకారం.. ల్యాబ్‌లో పెరిగిన ప్రాణం..

సాధారణంగా నాగుపాము వంటి సరీసృపాలు జూ వాతావరణంలో గుడ్లు పెట్టినప్పటికీ, సరైన అనుకూల పరిస్థితులు లేక అవి పిల్లలుగా మారడం చాలా కష్టంగా మారుతుంది. గత పదిహేనేళ్లుగా దిల్లీ జూలో ఈ జాతి సంతానోత్పత్తి కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే ఈసారి జూ అధికారులు పట్టుదలగా శ్రమించి, కొత్తగా సేకరించిన మూడు నాగుపాము గుడ్లను తల్లి పాము వద్ద ఉంచకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కృత్రిమ సంరక్షణ కేంద్రానికి (ఇంక్యుబేషన్ చాంబర్) తరలించారు.

ఇవి కూడా చదవండి

యంత్రాల సాయంతో తల్లి పాములాంటి వెచ్చదనం..

ఈ అద్భుత ప్రక్రియ వెనుక జూ రక్షణ బృందం, పశువైద్య నిపుణుల రాత్రింబవళ్ల శ్రమ దాగి ఉంది. ల్యాబ్‌లోని ప్రత్యేక యంత్రాల సాయంతో గుడ్లు పొదగడానికి అవసరమైన ఉష్ణోగ్రత, తేమ స్థాయిలను ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ, ప్రకృతిసిద్ధమైన వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించారు. జూన్ 29 నుంచి జూన్ 30 మధ్య కాలంలో ఈ మూడు గుడ్ల నుంచి బుజ్జి నాగుపాము పిల్లలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చి లోకాన్ని చూశాయి.

ఎంతో ఆరోగ్యంగా.. అత్యంత చురుగ్గా..

ప్రస్తుతం ఈ మూడు నాగుపాము పిల్లలు ఎంతో ఆరోగ్యంగా, చురుగ్గా ఉన్నాయని జూ అధికారులు అధికారిక ప్రకటనలో తెలిపారు. వాటి జాతికి తగినట్లుగా, శీతోష్ణస్థితులు సరిపోయేలా ప్రత్యేక రక్షణ వలయంలో ఉంచి నిరంతరం గమనిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విజయవంతమైన ప్రయోగంపై జూ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లో భాగమైన విద్యార్థులు కూడా సరీసృపాల ప్రవర్తన, వాటి శారీరక మార్పులపై లోతైన అధ్యయనం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us