తిరుమలలో కర్ణాటక ప్రముఖులకు తొలి హారతి వీక్షణ అవకాశం.. సీఎం డీకే శివకుమార్ కీలక ప్రకటన
Tirumala First Harathi: కర్ణాటకకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయమూర్తులు, సీనియర్ అధికారులకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతిరోజూ నిర్వహించే తొలి హారతిని వీక్షించే అవకాశం కల్పించనున్నట్లు సీఎం డి.కె. శివకుమార్ ప్రకటించారు. ఈ మేరకు కొత్త ప్రోటోకాల్‌ను త్వరలో అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కీలక ప్రకటన చేశారు. ఇకపై ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతిరోజూ నిర్వహించే తొలి హారతిని కర్ణాటకకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయమూర్తులు, సీనియర్ ఐఏఎస్-ఐపీఎస్ అధికారులు తదితర ప్రముఖులు ప్రోటోకాల్ ప్రకారం వీక్షించే అవకాశం కల్పించనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ ప్రకటించారు. బెంగళూరులోని బనశంకరిలో శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రోటోకాల్ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో జారీ చేస్తుందని తెలిపారు.
ఇప్పటివరకు ముఖ్యమంత్రికే పరిమితమైన అవకాశం
తిరుమలలో ప్రతి ఉదయం జరిగే తొలి హారతి కర్ణాటక రాష్ట్రానికి ప్రత్యేకమైన చారిత్రక సంప్రదాయంగా కొనసాగుతోంది. దీనికి దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉంది. విజయనగర సామ్రాజ్య రాజులు, అనంతరం మైసూరు వొడయార్ రాజవంశం తిరుమల దేవస్థానానికి బంగారు ఆభరణాలు, భూములు, అలాగే నిత్యపూజలకు అవసరమైన సామగ్రిని విరాళంగా అందించాయి.
మైసూరు సంస్థానం ఆలయ నిత్యపూజల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో, ప్రతి ఉదయం స్వామివారికి సమర్పించే తొలి హారతిని స్వీకరించే గౌరవం మైసూరు రాజవంశానికి దక్కింది. స్వాతంత్ర్యం అనంతరం ఆ సంప్రదాయాన్ని కర్ణాటక ప్రభుత్వం కొనసాగిస్తోంది. సంప్రదాయం ప్రకారం కర్ణాటక ముఖ్యమంత్రి గర్భాలయం వెలుపల కులశేఖరపడి వరకు వెళ్లి రాష్ట్ర ప్రజల తరఫున తొలి హారతిని స్వీకరిస్తారు. ముఖ్యమంత్రి హాజరుకాలేని సందర్భాల్లో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి ఆ బాధ్యతను నిర్వర్తిస్తారు.
ఇకపై ప్రముఖులకూ అవకాశం
కొత్త నిర్ణయంతో కర్ణాటక ప్రభుత్వం తరఫున తిరుమలకు వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయమూర్తులు, సీనియర్ అధికారులు కూడా తొలి హారతిని వీక్షించి స్వామివారి ప్రత్యేక దర్శనం చేసుకునే అవకాశం పొందనున్నారు. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
“నా పదవీకాలంలో ఇదే అత్యంత కీలక నిర్ణయం”
ఈ సందర్భంగా డి.కె. శివకుమార్ మాట్లాడుతూ.. “మన రాష్ట్రానికి చెందిన అనేక మంది ప్రజాప్రతినిధులు తిరుమలకు వెళ్లినా, సరైన దర్శనం లేకుండానే తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇకపై కర్ణాటక తరఫున సేవలందిస్తున్న ప్రముఖులందరికీ తిమ్మప్ప సన్నిధిలో నిలబడి తొలి హారతిని వీక్షించే ఈ అరుదైన అవకాశం కల్పిస్తాం. నా ముఖ్యమంత్రి పదవీకాలంలో ఇదే అత్యంత ముఖ్యమైన నిర్ణయం” అని అన్నారు.
వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసిన సీఎం
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తమ కుటుంబ దైవమని పేర్కొన్న డి.కె. శివకుమార్.. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇటీవల వరకు తిరుమలను సందర్శించలేకపోయానని తెలిపారు. ఇటీవల జరిగిన తన తిరుమల పర్యటన సందర్భంగా ఈ ఆలోచన వచ్చిందని చెప్పారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం. కృష్ణ హయాంలో తిరుపతిలో కర్ణాటక ట్రస్టు ఏర్పాటు చేసి దాని బాధ్యత తనకు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే అప్పట్లో ప్రభుత్వం మారిపోవడంతో ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తించే అవకాశం రాలేదని, ఇప్పుడు ఆ సంకల్పాన్ని కార్యరూపంలోకి తీసుకువస్తున్నామని సీఎం శివకుమార్ వెల్లడించారు.
