AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాహనదారులకు బిగ్ షాక్.. వారికి పెట్రోల్, డీజిల్ బంద్.. సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!

బీమా లేని వాహనాలపై కఠిన చర్యలకు భారత అత్యున్నత న్యాయస్థానం సిద్ధమవుతోంది. మోటార్ థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయించే లక్ష్యంతో సుప్రీంకోర్టు పలు కీలక ప్రతిపాదనలు చేసింది. ఇందులో భాగంగా, వాహనానికి చెల్లుబాటు అయ్యే బీమా ఉందో లేదో ధృవీకరించిన తర్వాతే పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే విధానంపై పైలట్ ప్రాజెక్టును రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.

వాహనదారులకు బిగ్ షాక్.. వారికి పెట్రోల్, డీజిల్ బంద్.. సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
No Insurance, No Fuel
Balaraju Goud
|

Updated on: Aug 05, 2026 | 7:55 AM

Share

బీమా లేని వాహనాలపై కఠిన చర్యలకు భారత అత్యున్నత న్యాయస్థానం సిద్ధమవుతోంది. మోటార్ థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయించే లక్ష్యంతో సుప్రీంకోర్టు పలు కీలక ప్రతిపాదనలు చేసింది. ఇందులో భాగంగా, వాహనానికి చెల్లుబాటు అయ్యే బీమా ఉందో లేదో ధృవీకరించిన తర్వాతే పెట్రోల్, డీజిల్ సరఫరా చేసే విధానంపై పైలట్ ప్రాజెక్టును రూపొందించాలని భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (IRDAI), కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ప్రతిపాదిత విధానం ప్రకారం, బీమా లేని వాహనాలకు అవసరమైన కవరేజీ పొందే వరకు ఇంధనం నిరాకరించే అవకాశాన్ని పరిశీలించనున్నారు. అయితే, ఇది ప్రస్తుతం కేవలం పైలట్ ప్రాజెక్టు మాత్రమేనని, దేశవ్యాప్తంగా వెంటనే అమల్లోకి రాదని స్పష్టం చేసింది.

అంతే కాకుండా, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరాలను వాహన్ డేటాబేస్, బీమా డేటాబేస్‌లతో అనుసంధానించాలని కూడా సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. దీంతో బీమా లేని వాహనాలను ఆటోమెటిక్‌గా గుర్తించి, అవసరమైతే ఇ-చలాన్లు జారీ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అతివేగం, రెడ్ సిగ్నల్ ఉల్లంఘన, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను గుర్తించేందుకు ఉపయోగిస్తున్న ANPR వ్యవస్థను బీమా ధృవీకరణకు కూడా వినియోగించాలని సూచించింది.

రోడ్డు తనిఖీల సమయంలో ట్రాఫిక్ పోలీసులకు మొబైల్ యాప్‌లు లేదా హ్యాండ్‌హెల్డ్ పరికరాలను అందించి, వాహన బీమా వివరాలను తక్షణమే పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో భౌతిక బీమా పత్రాలపై ఆధారపడకుండా అధికారులు ఆన్‌లైన్‌లోనే బీమా స్థితిని నిర్ధారించగలరు.

కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు తప్పనిసరి థర్డ్-పార్టీ బీమా కాలపరిమితిని కూడా పెంచాలని సుప్రీంకోర్టు సూచించింది. కొత్త ప్రైవేట్ కార్లకు ప్రస్తుతం ఉన్న మూడు సంవత్సరాల బీమాను నాలుగు సంవత్సరాలకు, ద్విచక్ర వాహనాలకు ఐదు సంవత్సరాల బీమాను ఆరు సంవత్సరాలకు పొడిగించాలని ప్రతిపాదించింది. ప్రారంభ బీమా గడువు ముగిసిన తర్వాత బీమా పునరుద్ధరించకుండా రోడ్లపై తిరిగే వాహనాల సంఖ్యను తగ్గించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని కోర్టు పేర్కొంది. ఇప్పుడు ఈ ప్రతిపాదనలను ఎలా అమలు చేయాలనే అంశాన్ని సంబంధిత అధికారులు పరిశీలించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us