Pandora Papers: సంచలనం.. ‘పండోరా పేపర్స్ లీక్’.. లిస్టులో 380 మంది భారతీయులు.. ఎవరెవరంటే.?

Pandora Papers: మరోసారి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పన్ను ఎగవేతదారుల వివరాలు మళ్లీ లీకయ్యాయి. 2016వ సంవత్సరంలో..

Pandora Papers: సంచలనం.. 'పండోరా పేపర్స్ లీక్'.. లిస్టులో 380 మంది భారతీయులు.. ఎవరెవరంటే.?
Pandora Papers
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 04, 2021 | 12:39 PM

మరోసారి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పన్ను ఎగవేతదారుల వివరాలు మళ్లీ లీకయ్యాయి. 2016వ సంవత్సరంలో ప్రకంపనలు సృష్టించిన ‘పనామా పేపర్స్’ మాదిరిగానే ‘పండోరా పేపర్స్’ పేరుతో సంపన్నులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రముఖుల ఆస్తులు, ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన రహస్య పత్రాలను ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌(ఐసీఐజే) బహిర్గతం చేసింది. ఇటీవల కాలంలో ఇదే అతిపెద్ద లీక్ కాగా.. జాబితాలో 91 దేశాలకు చెందిన సంపన్నులు, ప్రముఖులు, రాజకీయ నేతలు ఉన్నారు. అలాగే ఈ లిస్టులో 380 మంది భారతీయులు కూడా ఉండటం గమనార్హం.

పన్నుల బెడద లేని దేశాలైన పనామా, దుబాయ్, మొనాకో, కేమన్ ఐలాండ్స్ మొదలుగు వాటిలో ధనవంతులు బ్లాక్ మనీని దాచుకోవడంతో పాటు ఆస్తులను కూడా సమకూర్చుకోవటానికి డొల్ల కంపెనీలను సృష్టించారని.. వాటికి సంబంధించిన రూ. 1.2 కోట్ల పత్రాలను సేకరించామని ఐసీఐజే ప్రకటించింది. అమెరికా, ఇండియా, పాకిస్తాన్, బ్రిటన్, మెక్సికో తదితర దేశాలకు చెందిన సంపన్నులు, రాజకీయ నేతలు ఈ లిస్టులో ఉన్నట్లు స్పష్టం చేసింది. జాతీయ మీడియా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..

1. లిస్టులో ఉన్న భారతీయుల్లో ఎక్కువ మంది ఆర్ధిక నేరగాళ్లు, మాజీ ఎంపీలు కావడం గమనార్హం

2. ప్రముఖ బిజినెస్‌మాన్ అనిల్ అంబానీకి 18 దేశాల్లో ఆస్తులు

3. ఇన్‌సైడర్ ట్రేడింగ్ కోసం బయోకాన్ సంస్థ ప్రమోటర్ కిరణ్ మజుందార్ భర్త ఓ ట్రస్టును ఏర్పాటు చేశారు. అలాగే భారత బ్యాంకులను ముంచేసి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ సోదరి ఓ ట్రస్టును నెలకొల్పారు. అది కూడా నీరవ్ మోడీ విదేశాలకు పారిపోయిన నెల రోజులు ముందుగా ఇది జరిగినట్లు తెలుస్తోంది.

4. 2016లో పనామా పేపర్స్ లీక్ అనంతరం మూడు నెలలకు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లోని తన ఆస్తులను పునర్వ్యస్థీకరించుకున్నారు.

5. అమెరికా, యూకే దేశాల్లో జోర్డాన్ రాజుకు 10 కోట్ల డాలర్ల ఆస్తులు.

6. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు, ఆయన కేబినేట్ మంత్రులకు కూడా కోట్ల డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.

7. ఉక్రెయిన్, కెన్యా, ఈక్వెడార్ దేశాల అధ్యక్షులు, చెక్ రిపబ్లిక్ ప్రధాని, యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌కు చెందిన రహస్య ఆస్తుల చిట్టా కూడా పండోరా పేపర్స్‌లో ఉన్నాయి.

8. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు మొనాకోలో విలువైన ఆస్తులు

ఇలా చాలామంది సంపన్నుల రహస్య వ్యవహారాలు తమ దగ్గర ఉన్నాయని.. వాటిన్నంటినీ బహిర్గతం చేస్తామని ఐసీఐజే పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 600 మందికిపైగా జర్నలిస్ట్స్ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారని.. ఎంతగానో శ్రమించి ఈ కీలక రహస్యాలను సేకరించారని స్పష్టం చేసింది.